తెలుగు ఆడియన్స్ అంత ఈజీగా దేనికి కనెక్ట్ అవ్వరు.. ఒక్కసారి కనెక్ట్ అయితే అంత ఈజీగా వదలరు. ఠాగూర్ సినిమాలో డైలాగ్ కాస్త మార్చి చెప్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు కార్తీక దీపం విషయంలోనూ ఇదే జరుగుతుంది. వంటలక్క.. ఈ ఒక్క పేరు చాలు తెలుగు రాష్ట్రాలు రెండూ అభిమానంతో తడిసిపోవడానికి. ఓ సీరియల్‌కు ఇంత పాపులారిటీ వస్తుందా.. ఓ సీరియన్ నటిని ఇంతగా అభిమానిస్తారా అని అంతా ముక్కున వేలేసుకునేలా క్రేజ్ సంపాదించుకుంది ప్రేమీ విశ్వనాథ్. ఈమె పేరు ఇది అని చాలా మందికి తెలియదు. ఎందుకంటే అందరికీ ఈమె వంటలక్కగానే పరిచయం కాబట్టి. కార్తీక దీపం సీరియల్‌తో తెలుగులో కూడా చాలా గుర్తింపు సంపాదించుకుంది దీప ఉరఫ్ ప్రేమీ విశ్వనాథ్. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగులో ఈమెకు వచ్చిన క్రేజ్ చూసి చాలా మంది సీరియల్ హీరోయిన్లు కుళ్లుకుంటారేమో మరి..? తెలుగు రాష్ట్రాల్లో టీఆర్పీ పరంగా చూసుకున్నా కూడా కార్తీక దీపం నెంబర్ వన్ అంతే. దాని దరిదాపుల్లోకి కూడా మరో సీరియల్ రాదంటే అతిశయోక్తి కాదేమో..?
ఆ మధ్య వరదలు వచ్చి ఇంట్లోకి మోకాళ్ళ లోతు నీళ్ళొస్తే కూడా కార్తీక దీపం సీరియల్ చూసుకుంటూ కూర్చున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సీరియల్ ఇంటింటికీ ఎలా చేరిపోయిందో..? ఇదిలా ఉంటే ఈ మధ్య సీరియల్లో వస్తున్న కొన్ని ట్విస్టులు చూసిన తర్వాత కార్తీక దీపం సీరియల్ అయిపోతుందేమో అనే ఆందోళన అభిమానుల్లో కనబడుతుంది. ఇప్పుడు ఈ మెగా సీరియల్ 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటికే 999 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది ఈ సీరియల్.
మార్చ్ 29తో 1000వ ఎపిసోడ్ పూర్తి చేసుకోబోతుంది ఈ సీరియల్. మొన్నటికి మొన్న దీపకు కార్తీక్ చేరువ కావడం.. మోనితను దూరం పెట్టడం.. పైగా పిల్లలు హిమ, శౌర్య కూడా చేరువ అవ్వడంతో ఈ సీరియల్ అయిపోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో మొదలయ్యాయి. ఇంకా కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే ఉంటుంది.. రాబోయే నెల, రెండు నెలల్లోనే కార్తీక దీపంకు శుభం కార్డ్ పడటం ఖాయం అని అంతా ఫిక్స్ అయిపోయారు కూడా. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఇప్పట్లో ఈ సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడటం కష్టమే. మలయాళంలో నాలుగేళ్ల పాటు నిర్విరామంగా దాదాపు 1450 ఎపిసోడ్స్ రన్ అయింది కార్తీక దీపం.
తెలుగులో కూడా 2017 అక్టోబర్‌లో మొదలైంది. ఈ లెక్కన మూడేళ్ళు అయిపోయింది. తాజాగా 1000 ఎపిసోడ్స్ మైలురాయి కూడా అందుకుంది. ఈ సీరియల్ మరో ఆర్నెళ్లకు పైగానే బాకీ ఉంది. ఎలా చూసుకున్నా కూడా కార్తీక దీపం మరో 450 ఎపిసోడ్స్ వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే 2021 కూడా కార్తీక దీపంకు వచ్చిన ముప్పేం లేదన్నమాట. కచ్చితంగా 2022 వరకు ఈ సీరియల్ ఉంటుంది. ఇది నిజంగా వంటలక్క ఫ్యాన్స్‌కు శుభవార్తే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.