కెరీర్ మొదలు పెట్టిన ఆరేళ్లకు ఎట్టకేలకు మొదటి విజయం అందుకుంటున్నాడు అఖిల్ అక్కినేని. ఈయన నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ విజయం దిశగా అడుగులు వేస్తుంది. రెండు రోజుల్లోనే 70 శాతం రిటర్న్ తీసుకొచ్చి పెద్ద హిట్ వైపు పరుగులు పెడుతున్నాడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ సినిమా విజయంతో అఖిల్ కాస్త రిలాక్స్ అయిపోయాడు. ఎందుకంటే చాలా మందికి ఈ సినిమా యాసిడ్ టెస్టుగానే నిలిచింది. వరస విజయాలతో జోరు మీదున్న గీతా ఆర్ట్స్ 2కు చావు కబురు చల్లగా బ్రేకులు వేసింది. దాంతో బన్నీ వాసుకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ విజయం కీలకంగా మారింది. మరోవైపు బొమ్మరిల్లు తర్వాత సరైన విజయం లేని భాస్కర్ కూడా ఈ సినిమాపై ఆశలన్నీ పెట్టుకున్నాడు. అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో నిలబడాలంటే హిట్ కొట్టాల్సిందే అనే పరిస్థితుల్లో ఉన్నాడు.
ఇలాంటి సమయంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అంచనాలు అందుకునేలా కనిపిస్తుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ వైజాగ్‌లో జరిగింది. అందులో అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పడమే కాకుండా.. ఓటిటి రిలీజ్ గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. అందులో ఆయన మాట్లాడుతూ.. ‘బొమ్మరిల్లు సినిమా తీసి బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. ఇప్పుడు బ్యాచ్‌లర్ భాస్కర్ అయిపోతాడేమో తెలియదు మరి. కాకపోతే ఈ సినిమాతో ఎంత మంది కాపురాలకు సమస్యలు తెస్తాడో అనిపిస్తుంది. సినిమాల్లో సాధారణంగా మెసేజ్ ఎక్కదు.. కానీ ఈ సినిమాలో బ్యాచ్‌లర్ అనే టైటిల్ పెట్టి పెళ్లి కాకుండానే కాపురం చూపిస్తారు ఈ చిత్రంలో. అందుకే ఈ సినిమాలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఏంటంటే.. భార్యా భర్తలు కావాలంటే ఏయే అంశాలు కావాలో ఈ సినిమాలో చూపించారు. భార్యాభర్తలు చూస్తే కచ్చితంగా మొహామొహాలు చూసుకుంటారు. మహిళలు మీ భర్తలను సినిమాకు తీసుకెళ్లండి. మెసేజ్ చూసి ఆనందిస్తారు.. అది మా గ్యారెంటీ. చాలా సినిమాలు ఓటిటిలో వచ్చేస్తున్నాయి. కొన్ని నెలల వరకు ఓటిటిలో రావడం లేదు. థియేటర్స్‌కు వెళ్లి చూడాల్సిందే. త్వరలోనే వచ్చేస్తుంది ఓటిటిలో నేను నిన్న చూసాను.. కానీ అది నిజం కాదు. చాలా కాలం తర్వాతే ఇది ఓటిటిలో వస్తుంది..’ అని తెలిపారు.
ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా కూడా నెల రోజుల్లోనే ఓటిటిలో వచ్చేస్తుంది. అలాంటిది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాను మాత్రం ఇప్పట్లో విడుదల చేయమని చెప్తున్నాడు అరవింద్. థియెట్రికల్ రన్ మొత్తం అయిపోయిన తర్వాతే ఈ సినిమాను OTTలో విడుదల చేస్తామంటున్నాడు. ఎలాగూ ఓటిటిలో వచ్చేస్తుందిలే.. అక్కడే చూద్దాం అనుకుంటున్న ప్రేక్షకులకు షాక్ ఇచ్చే ప్రయత్నం చేసాడు అల్లు అరవింద్. ఇలా చెబితే కచ్చితంగా థియేటర్స్ వైపు ఫ్యామిలీ ఆడియన్స్ కదులుతారేమో అని ఆయన ఆలోచన. ప్లాన్ వినడానికి చాలా బాగుంది. కానీ ఇప్పుడున్న కరోనా పరిస్థితులను దాటుకుని.. వీక్ డేస్‌లో కుటుంబ ప్రేక్షకులు థియేటర్స్ వైపు అఖిల్ కోసం అడుగు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhil Akkineni, Allu aravind, Most Eligible Bachelor, Telugu Cinema, Tollywood