MEGA POWER STAR RAM CHARAN REACTS ON ANDHRA PRADESH ELECTION RESULTS AND JANASENA PARTY CHIEF PAWAN KALYAN DEFEAT CR
పవన్ కల్యాణ్ అలా ఉండిపోడు... జనసేన ఓటమిపై స్పందించిన రామ్ చరణ్...
రామ్ చరణ్, పవన్ కల్యాణ్
‘గొప్ప నాయకులు ఎప్పుడూ నాయకుడిగా ఉండిపోవాలని ప్రయత్నించరు... రాజకీయం అంటే ఇది ఓ పాత్ర కోసం కాదు, ఓ లక్ష్యం కోసం... ’ ఫేస్బుక్ ద్వారా బాబాయ్ పవన్ కల్యాణ్‌కు బాసటగా నిలిచిన రామ్‌చరణ్... జనసేన కోసం పనిచేసిన జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపిన మెగా పవర్ స్టార్...
ప్రశ్నించడానికి వస్తున్నా... అంటూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పార్టీ పెట్టిన ఆరేళ్లకు గానీ ప్రత్యేక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు జనసేన పార్టీ. ఇంత లేటుగా గ్రౌండ్లోకి దిగినా... పవన్ కల్యాణ్ గ్రాండ్ సక్సెస్ సాధిస్తాడని భావించారు ఆయన వీరాభిమానులు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దామనుకున్న పవన్ కల్యాణ్‌కు తెలుగు ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. జనసేన పార్టీ పట్టుమని రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా సాధించలేకపోయింది. అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందారు. రెండు చోట్ల పోటీ చేసినా జనసేనానికి ఒక్క చోట కూడా విజయం దక్కలేదు. గాజువాక, భీమవరం రెండు నియోజికవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థుల చేతుల్లో చిత్తుగా ఓడారు పవన్ కల్యాణ్. గాజువాకలో వైసీసీ అభ్యర్థి నాగిరెడ్డి... పవన్ కల్యాణ్‌పై విజయం సాధిస్తే... భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గెలుపొందారు. తెలుగు ప్రజల తీర్పును గౌరవిస్తున్నానంటూ, ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల్లోనే కొనసాగుతానని ఫలితాల అనంతరం ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై అబ్బాయ్ రామ్ చరణ్ స్పందించాడు. తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా జనసేన పార్టీ గురించి, పవన్ కల్యాణ్ గురించి కామెంట్ చేశారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.
పవన్ కళ్యాణ్ (Image : Janasena party / Twitter)
‘గొప్ప నాయకులు ఎప్పుడూ నాయకుడిగా ఉండిపోవాలని ప్రయత్నించరు. వాళ్లు మార్పు కోసమే ఆలోచిస్తారు. ఇది ఓ పాత్ర కోసం కాదు, ఓ లక్ష్యం కోసం... పవన్ కల్యాణ్ గారికీ, జనసేన పార్టీకి నిస్వార్థంగా సేవలు అందించిన ప్రతి ఒక్క జనసైనికుడికి కృతజ్ఞతలు...’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు రామ్ చరణ్. ఫలితాలకు ముందు దాకా జనసేన పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపడుతుందని కాకపోయినా పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడతారని మాత్రం భావించారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే వైసీపీ ‘ఫ్యాను’ గాలికి ‘జనసేన’ గ్లాసు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అల్లు అర్జున్, రామ్ చరణ్, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వంటి వాళ్లు జనసేన కోసం ప్రచారం చేసినా ఎలాంటి ఎఫెక్ట్ చూపలేకపోయారు.
జనసేన పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసిన మెగా బ్రదర్ నాగబాబు కూడా చిత్తుగా ఓడిపోయారు...
ఒక్క రాజోలులో మినహా మిగిలిన అన్నిచోట్ల జనసేన అభ్యర్థులు పరాజయం చెందారు. రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. అయితే ఫలితాల అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నేత, తన అభ్యర్థి వరప్రసాద్ విజయాన్ని మరిచిపోయారు. ఒక్క సీటు కూడా గెలవలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. దీంతో రాపాక వరప్రసాద్ కూడా త్వరలోనే వైసీపీలోకి జంప్ అవుతారనే ప్రచారం ఊపందుకుంది. పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా, చిరునవ్వులు చిందిస్తున్న పవన్ కల్యాణ్... రాజకీయాల్లో ఫెయిల్ అయిన మరో మెగా హీరోగా మిగిలిపోతాడా? అబ్బాయి చెప్పినట్టుగా నాయకుడిగా ఎదుగుతాడా చూడాలి...
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.