నీ పనైపోయింది.. ఇంక బ్యాగ్ సర్దుకోవాల్సిందే.. ఈ హీరోను ఇంక ప్రేక్షకులు మరిచిపోవాల్సిందే.. చేజేతులా కెరీర్ నాశనం చేసుకుంటున్నాడు.. ఇలా సరిగ్గా ఏడాది కింద సాయి ధరమ్ తేజ్‌పై వచ్చిన వార్తలివి. కానీ కాలెండర్ మారేసరికి మాయ చేసాడు మెగా మేనల్లుడు. అయిపోయింది అని విమర్శించిన నోళ్లతోనే రారా బంగారం అనిపించుకుంటున్నాడు సుప్రీం హీరో. 2015లో సుప్రీమ్ తర్వాత వరసగా అరడజన్ ఫ్లాపులు ఇచ్చాడు సాయి. కనీసం ఓపెనింగ్స్ కూడా తీసుకురాలేని స్థాయికి పడిపోయాడు ఈ హీరో. ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ సినిమాలైతే ఆయన్ని భారీగానే విమర్శల పాలు చేసాయి.
అనవసరంగా ఉన్న ఇమేజ్ నాశనం చేసుకుంటున్నాడంటూ అప్పట్లో తేజుపై చాలా వరకు సెటైర్లు కూడా పేలాయి. సుప్రీమ్ సినిమా నాలుగేళ్ల కిందే 25 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఆ సమయంలో మరో రెండు హిట్లు పడుంటే తేజ్ రేంజ్ మారిపోయుండేది కానీ విన్నర్ నుంచి తేజ్ ఐ లవ్ యూ వరకు వరస ఫ్లాపులిచ్చాడు సాయి. అలాంటి సమయంలో 2019 ఈ హీరోకు బాగా కలిసొచ్చింది. కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రలహరి సినిమాతో ఆరు ఫ్లాపుల తర్వాత విజయం అందుకున్నాడు. పైగా ఆ సినిమా అంతా ఫెయిల్యూర్ గురించే ఉంటుంది. దాంతో ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయిపోయింది.
ఇక ఇప్పుడు మారుతి తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే సినిమాతో మరో విజయం అందుకున్నాడు ఈయన. ఈ చిత్రం 6 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల వరకు షేర్ వసూలు చేసి సేఫ్ జోన్లోకి వచ్చేసింది. విడుదలైన ఆరో రోజు కూడా 2.80 కోట్ల షేర్ వసూలు చేసింది ప్రతిరోజూ పండగే. దాంతో వరసగా రెండో విజయం అందుకుని 2019లో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు తేజు. ప్రస్తుతం కొత్త దర్శకుడు సుబ్బుతో సోలో బ్రతుకే సో బెటరూ.. దేవాకట్టాతో ఓ సినిమా.. దాంతో పాటు రవితేజతో ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. మొత్తానికి పని అయిపోయిందనుకున్న టైమ్‌లో గోడకు కొట్టిన బంతిలా పైకి లేచాడు మెగా హీరో.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Dharam Tej, Telugu Cinema, Tollywood