తెలుగు ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న ఆదరణ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ల సినిమాలు వస్తే బాక్సాఫీస్ బద్ధలైపోతుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. పైగా 2019 వాళ్లకు బాగా కలిసొచ్చింది కూడా. మొదలుపెట్టడం ఫ్లాప్ సినిమాతో అయినా కూడా ఆ తర్వాత మాత్రం వరసగా విరుచుకుపడ్డారు మెగా హీరోలు. ముందుగా వినయ విధేయ రామ సినిమాతో సంక్రాంతికి వచ్చాడు రామ్ చరణ్. బోయపాటి తెరకెక్కించిన ఈ చిత్రం డిజాస్టర్ టాక్తో కూడా చరణ్ స్టామినా చూపిస్తూ దాదాపు 59 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది. కానీ సినిమా ఫ్లాప్ కోటాలోకి వెళ్లిపోయింది.
అదే పండక్కి వచ్చిన వరుణ్ తేజ్ మాత్రం ఎఫ్2 సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు. ఈ చిత్రం ఏకంగా 120 కోట్లకు పైగా గ్రాస్.. 70 కోట్ల వరకు షేర్ అందుకుని బాక్సాఫీస్ దగ్గర మెగా జెండా ఎగరేసింది. ఇక ఆ తర్వాత సమ్మర్లో చిత్రలహరి అంటూ కూల్ విక్టరీ అందుకున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఆరు ఫ్లాపుల తర్వాత ఈయన అందుకున్న విజయం ఇది. ఎఫ్2 తర్వాత గద్దలకొండ గణేష్ సినిమాతో మరో విజయం కూడా అందుకున్నాడు వరుణ్ తేజ్.
ఇక మెగా కుటుంబ ఆధ్యుడు చిరంజీవి కూడా ఈ ఏడాది సైరా సినిమాతో వచ్చాడు. ఈ చిత్రం మిగిలిన భాషల్లో ఫ్లాప్ అయినా కూడా తెలుగులో మాత్రం 106 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ఏడాది చివర్లో ప్రతిరోజూ పండగే అంటూ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఫుల్ రన్లో 30 కోట్ల మార్క్ అందుకునేలా కనిపిస్తుంది. మొత్తానికి 2019 మెగా హీరోలకు బాగానే కలిసొచ్చింది. ఒక్క రామ్ చరణ్ మాత్రమే నిరాశ పరిచాడు. ఇక పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ సినిమాలు చేయలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Ram Charan, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood, Varun Tej