అన్నయ్య చిరంజీవి అడుగుజాడల్లో సినిమాల్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.... 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాకతో పాటు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసినా.. ఎక్కడ ప్రభావం చూపించలేకపోవడాన్ని పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్.. మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఒక్క రాజోలు లో మాత్రమే జనసేన పార్టీ చావు తప్పి కన్నులొట్ట పోయినట్టు ఒక సీటు గెలిచింది. అంతేకాదు పోటీ చేసిన ఎక్కడ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది జనసేన పార్టీ. ఇక నరసాపురం ఎంపి పదవికి పోటీచేసిన మెగా బ్రదర్ నాగబాబు సైతం పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఓటమి తర్వాత నిరాశలో కూరుకుపోయిన కార్యకర్తల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక జనసేన పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశ నుండి బయటకు తీసుకురావడానికి తమదైన శైలిలో మోటివేట్ వేస్టూ ప్రసంగాలు దంచుతున్నారు నాగబాబు. ఓటమి గెలుపుకు తొలి మెట్టు అని దెబ్బలు తిందాం.. బలంగా పైకి లేద్దాం, భవిష్యత్ మనదే, ఇది ఓటమి కాదు.. విరామం మాత్రమే అంటూ జనసేన శ్రేణులకు వేదాంతం చెబుతున్నారు మెగా బ్రదర్స్ .

నాగబాబు (సినీ నటుడు, నర్సాపురం లోక్సభలో ఓటమి)
తాజాగా నాగబాబు తన సోషల్ మీడియా పేజీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచి మాట చెబుతున్నా అంటూ ఇలా చెప్పుకొచ్చారు. నొప్పి రెండు రకాలు - మొదటిది మిమల్ని బాధిస్తుంది. రెండోది మిమల్ని మారుస్తుంది.'అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల ఎన్నికల్లో జనసేన ఓటమిని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టం అవుతోంది.నాగబాబు పోస్ట్ లపై ఇప్పటికే వందల సంఖ్యలో అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. మాకు మొదటి రకం కంటే రెండో రకమే ఎక్కువ సార్లు అనుభవం అయింది సార్.. పర్లేదు.. మేము పైకి లేస్తాం.. బలంగా గెలుస్తాం అంటూ రిప్లై ఇస్తున్నారు. మంచి మాట, మంచి మనిషి ప్రజలకు నచ్చడానికి లేట్ అవుతుంది. మరో ఐదేళ్లు వెయిట్ చేద్దాం సార్ అంటూ మరి కొందరు అభిమానులు వ్యాఖ్యానించారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:June 12, 2019, 15:43 IST