Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: March 4, 2020, 8:03 PM IST
మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ (Chiranjeevi pawan Kalyan nagababu)
ప్రముఖ నటుడు చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దానికితోడు ఈ మధ్య జగన్తో చిరంజీవి సన్నిహితంగా ఉండటం.. మొన్నామధ్య కుటుంబ సమేతంగా వెళ్లి ఆయన్ని కలిసి రావడంతో ఈ ప్రచారంలో నిజం ఉందని కొందరు నమ్మేసారు కూడా. మళ్లీ చిరంజీవి రాజకీయాల వైపు వస్తున్నాడని.. వైసీపీలో చేరతాడని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చిరంజీవి తమ్ముడు నాగబాబు స్పష్టం చేసాడు. మెగా అభిమానుల్లో నెలకొన్న గందరగోళం క్లియర్ చేయడానికే తాను వచ్చానని చెప్పాడు ఈయన. అలా కావాలనే కొందరు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని ఆయన ఆరోపించాడు. ప్రస్తుతం చిరంజీవికి జనసేన సహా ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని చెప్పాడు నాగబాబు.

చిరంజీవి, వైఎస్ జగన్ (Chiranjeevi Ys Jagan)
అది కూడా నేరుగా కాదు.. తమ్ముడు పవన్ ఆలోచనలను ఓ అన్నయ్యగా చిరంజీవి సమర్థిస్తున్నాడని తెలిపాడు మెగా బ్రదర్. ఈ క్లారిటీ ఇవ్వడానికి తన యూ ట్యూబ్ నా ఛానెల్ నా యిష్టంలో నాగబాబు మాట్లాడాడు. చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం అంటూ కొన్ని వెబ్సైట్లు తప్పుడు వార్తలతో గందరగోళం సృష్టిస్తున్నాయని తెలిపాడు నాగబాబు. చిరంజీవి ఇప్పట్నుంచి పూర్తిగా సినిమాలకు పరిమితం అవుతాడని.. తన తన జీవితాన్ని మళ్లీ సినిమాలకే అంకితం ఇచ్చేసాడని చెప్పాడు నాగబాబు. అందుకే రాజకీయాలను పూర్తిగా వదిలేసి సినిమాలపై దృష్టి పెట్టాడని చెప్పాడు నాగబాబు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు మెగాస్టార్.

చిరంజీవి, వైఎస్ జగన్ (Chiranjeevi Ys Jagan)
ఆ తర్వాత మరో సినిమా కూడా మొదలవుతుందని చెప్పాడు ఈయన. తమ కుటుంబంలోని నటులందరి కంటే చిరంజీవే సినిమాల్లో బిజీగా ఉన్నాడని తెలిపాడు నాగబాబు. ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా గొప్ప స్వాగతం లభిస్తుందని.. రాజ్యసభ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదన్నాడు మెగా బ్రదర్. అన్నదమ్ములిద్దరం ఒకే రంగంలో ఎందుకనే ఉద్దేశంతోనే చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యాడని.. తమ్ముడు పవన్ కోసమే అన్నయ్య రాజకీయాలను త్యాగం చేసాడని నాగబాబు చెప్పడం గమనార్హం. రాజకీయాల్లో తనకంటే పవన్ అద్భుతంగా ప్రజలకు సేవ చేయగలడని చిరు నమ్ముతున్నట్లు చెప్పాడు నాగబాబు.

పవన్ కళ్యాణ్, చిరంజీవి (Chiranjeevi pawan Kalyan)
ఆయనకు ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే తాను అందులో ఉండకూడదని చిరంజీవి నిర్ణయించుకున్నాడని వివరించాడు. చిరంజీవికి అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉంటాయని.. ఎప్పటికీ అవి కొనసాగుతాయని తెలిపాడు నాగబాబు. అంతమాత్రాన ఆయా పార్టీల నిర్ణయాలకు ఆయన వంతపాడటం లేదని కన్ఫర్మ్ చేసాడు నాగబాబు. ఇటీవల కొంతమంది చిరంజీవి ఇంటిముందు ధర్నా చేయాలనే ప్రతిపాదన చేసినట్లు వార్తలు వచ్చాయని.. అది చాలా తప్పుడు నిర్ణయమన్నారు. చిరంజీవిపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికాడు నాగబాబు. ఏదేమైనా కూడా ప్రస్తుతం సినిమాలకు తప్ప రాజకీయాల గురించి ఆలోచించే టైమ్ చిరంజీవికి లేదని క్లారిటీగా చెప్పాడు నాగబాబు.
Published by:
Praveen Kumar Vadla
First published:
March 4, 2020, 8:03 PM IST