టాలీవుడ్లో ఇండస్ట్రీ పెద్ద ఎవరనే దానిపై కొద్దిరోజుల క్రితం పెద్ద చర్చే జరిగింది. ఇండస్ట్రీ పెద్ద చిరంజీవా లేక మోహన్ బాబా అనే టాక్ కూడా నడిచింది. అయితే తాను ఇండస్ట్రీ పెద్దను కాదని.. అయితే సినీరంగంలో ఏదైనా సమస్య పరిష్కారం కోసం కృషి చేయాల్సి వస్తే బాధ్యతగా ఆ పని చేస్తానని చిరంజీవి అన్నారు. ఏపీలో సినిమా టికెట్ల ధరల వివాదంపై కొద్దిరోజుల క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో కలిసి చర్చించారు. తాజాగా ఇండస్ట్రీ పెద్ద ఎవరనే అంశంపై మెగాబ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. ఓ టీవీ ఛానల్‌తో పిచ్చాపాటిగా మాట్లాడిన నాగబాబు.. చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద కాదని.. కానీ ఇండస్ట్రీలో ఎవరైనా ఇబ్బంది వస్తే పరిష్కరించేందుకు ముందుకొచ్చే బాధ్యతగల వ్యక్తి అని అన్నారు.
అసలు ఇండస్ట్రీలో పెద్ద అని ఎవరు ఉండరని నాగబాబు స్పష్టం చేశారు. ఇదంతా కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు సృష్టించిన అంశం మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీ పెద్ద అనేది ఎక్కడా లేదని నాగబాబు అన్నారు. తమిళ ఇండస్ట్రీకి, కన్నడ ఇండస్ట్రీకి, బాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద అంటూ ఎవరూ లేరని ఆయన గుర్తు చేశారు. ఆయా సంఘాలు మాత్రమే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాయని నాగబాబు అన్నారు.
టాలీవుడ్లో గతంలో దాసరి నారాయణరావు ఇండస్ట్రీలో ఎవరికైనా సమస్యలు వస్తే పరిష్కరించేందుకు ప్రయత్నించారని నాగబాబు అన్నారు. ఈ విషయంలో ఆయన కొంతవరకు సక్సెస్ అయ్యారని.. ఆయన కూడా పరిష్కరించలేకపోయిన సమస్యలు చాలానే ఉన్నాయని చెప్పుకొచ్చారు.
ఇండస్ట్రీలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించడం తన బాధ్యత అని చిరంజీవి చెప్పిన విషయాన్ని నాగబాబు గుర్తు చేశారు. పెద్దరికం అంటే ఎవరో ఇస్తేనే, తీసుకుంటేనే వచ్చేది కాదని.. అది సహజంగా రావాలని నాగబాబు అన్నారు. ఏపీలో సినిమా టికెట్ల అంశంపై చర్చించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ చిరంజీవిని ఆహ్వానించారని.. ఆయన కూడా ఏపీ ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు గురించి చెప్పారని నాగబాబు అన్నారు. అసలు సినీ రంగానికి పెద్ద అనే పదమే ఉండదని మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల కరోనా బారినపడ్డ చిరంజీవి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని.. ఆయన ఎప్పుడూ పూర్తి ఫిట్నెస్తో ఉంటారని నాగబాబు వ్యాఖ్యానించారు. తనకు చిరంజీవి, బన్నీ, చరణ్, ఎన్టీఆర్ కంటే ఎక్కువగా రామ్‌గోపాల్ వర్మ డాన్స్ అంటే ఇష్టమని నాగబాబు చమత్కరించారు. ఆయన డాన్స్ వీళ్లందరికంటే బాగుంటుందని పరోక్షంగా ఆయనపై సెటైర్లు వేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.