Master movie review: ‘మాస్టర్’ రివ్యూ.. అక్కడక్కడా గాడి తప్పారు మాస్టారూ..!

విజయ్ మాస్టర్ సినిమా రివ్యూ (Vijay Master)

Master movie review: విజయ్ సినిమా చేసాడంటే హిట్.. సూపర్ హిట్ అనే మాట తప్ప గత కొన్నేళ్లుగా మరేదీ వినిపించడం లేదు. అలాంటి కథలు ఎంచుకుంటున్నాడు ఈయన. ఇలాంటి సమయంలో కరోనా మహమ్మారి తర్వాత మాస్టర్ లాంటి సినిమాతో వచ్చాడు ఈయన. వరస విజయాలతో జోరు మీదున్న లోకేష్ కనకరాజ్ దర్శకుడు కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మరి పొంగల్‌కు వచ్చిన మాస్టర్ ట్రీట్ ఇచ్చాడా లేదా..?

  • Share this:
రివ్యూ: మాస్టర్
నటీనటులు : దళపతి విజయ్‌, విజయ్‌ సేతుపతి, మాళవికా మోహన్‌, ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్‌, అర్జున్‌ దాస్‌, గౌరి జి కిషన్‌, అళగమ్‌ పెరుమాళ్‌, శ్రీమాన్‌ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
ఎడిటర్‌: ఫిలోమన్‌ రాజు
నిర్మాణం: ఎక్స్‌బీ ఫిలిమ్స్‌ క్రియేటర్స్‌
నిర్మాత: జేవియర్‌ బ్రిట్టో
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్

విజయ్ సినిమా చేసాడంటే హిట్.. సూపర్ హిట్ అనే మాట తప్ప గత కొన్నేళ్లుగా మరేదీ వినిపించడం లేదు. అలాంటి కథలు ఎంచుకుంటున్నాడు ఈయన. ఇలాంటి సమయంలో కరోనా మహమ్మారి తర్వాత మాస్టర్ లాంటి సినిమాతో వచ్చాడు ఈయన. వరస విజయాలతో జోరు మీదున్న లోకేష్ కనకరాజ్ దర్శకుడు కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మరి పొంగల్‌కు వచ్చిన మాస్టర్ ట్రీట్ ఇచ్చాడా లేదా..?

కథ:
భవాని(విజయ్‌ సేతుపతి) వరంగల్‌లో పేరు మోసిన రౌడీ. ప్రాణభయం ఎక్కువగా ఉంటుంది. అందుకే అడ్డొచ్చిన వాళ్లను చంపుతూ పోతుంటాడు. తను చేసిన తప్పులను బాల నేరస్థుల జైలులో ఉన్న పిల్లలను వాడుకుంటాడు. వాళ్లను వాడి తన పనులు సాగించే నరరూప రాక్షసుడు. లారీలలో మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ.. రాజకీయంగా ఎదగాలని చూస్తుంటాడు. మరోవైపు జేడీ(విజయ్‌) ఓ ప్రొఫెసర్. ఎలాంటి భయం బెరుకు ఉండదు.. బాధ్యత అంటే తెలియదు.. మందుకు బానిస. ఆయన పనులు కాలేజీలో మిగిలిన సిబ్బందికి తలనొప్పిగా మారుతాడు. కానీ స్టూడెంట్స్‌కు మాత్రం జేడీ అంటే ప్రాణం. ఆయన్ని కాలేజీ నుంచి బయటికి పంపేస్తే అంతా వెళ్లిపోతామంటూ బెదిరించేంత యిష్టం. అయితే అనుకోని పరిస్థితుల్లో చారులత (మాళవిక మోహనన్) కారణంగా భవానీ ఉండే వరంగల్‌లోని బాల నేరస్థులకు పాఠాలు చెప్పాల్సి వస్తుంది. అక్కడికి అయిష్టంగానే వెళ్లిన జేడీ.. మొదట్లోనే ఓ దారుణం చూస్తాడు. ఆ ఘటనతో మందు మానేస్తాడు.. అక్కడి పిల్లలంతా మత్తుకు బానిసై.. వాళ్లు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకుని వాళ్లను కాపాడేందుకు భవానితో యుద్ధానికి దిగుతాడు. అందుకు ఏం చేసాడనేది అసలు కథ..

కథనం:
కొన్ని సినిమాలు హీరోల కోసం చూస్తారు.. మరికొన్ని దర్శకుల కోసం చూస్తారు. కానీ మాస్టర్ సినిమాను చూడ్డానికి మరో కారణం కూడా ఉంది.. అతడే విజయ్ సేతుపతి. ఆయన్ను చూస్తుంటే మాస్టర్ ఎలా ఉన్నాడనే సంగతి కూడా మరిచిపోవచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. మాస్టర్ అందరికీ తెలిసిన కథే. రొటీన్ కమర్షియల్ కథనే తీసుకున్నాడు లోకేష్. తన స్వార్థం కోసం బాల నేరస్థుల హోమ్‌లో ఉన్న పిల్లలను వాడుకునే ఓ దుర్మార్గుడి పని పట్టే మాస్టర్ ఈ సినిమా కథ. చాలా సింపుల్ కథను స్క్రీన్ ప్లే ప్రధానంగా చెప్పాలనుకున్నాడు విజయ్. ఫస్టాఫ్ వరకు అలాగే చేసాడు కూడా. అయితే ఎందుకో తెలియదు కానీ తన కెరీర్‌లో తొలిసారి లోకేష్ కనకరాజ్ నిరాశ పరిచాడు. తొలిసారి చేతిలో సూపర్ స్టార్స్ పడేసరికి బిల్డప్ ఎక్కువై.. బిజినెస్ తక్కువైందేమో అనిపించింది. ఖైదీలో కార్తి లాంటి స్టార్ ఉన్నా ఎక్కడా ట్రాక్ తప్పని లోకేష్.. మాస్టర్‌లో విజయ్ లాంటి స్టార్ హీరో వచ్చేసరికి కథ కాస్త సైడ్ ట్రాక్‌లోకి వెళ్లింది. ఫస్టాఫ్ వరకు మాస్టర్ దూసుకుపోయాడు.. ఇంటర్వెల్ సీన్ అయితే అదిరిపోయింది. సెకండాఫ్ కూడా అదే స్థాయిలో ఉండుంటే మరో బ్లాక్‌బస్టర్ కొట్టేవాడే.. కానీ అక్కడ్నుంచే బ్రేకులు పడ్డాయి. రొటీన్ స్టోరీ కావడం.. నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే మాస్టర్‌కు మైనస్ అయిపోయింది. దానికితోడు 3 గంటల నిడివి కూడా మైనస్.. తెలుగు వరకు కాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేదేమో..?
తీసుకున్న లైన్ బాగానే ఉంది.. సగం వరకు ట్రాక్ తప్పలేదు.. కానీ మిగిలిన సగమే కాస్త తేడా కొట్టింది. సెకండాఫ్‌లోనూ అక్కడక్కడా రెండు మూడు సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా విజయ్ సేతుపతి అడ్డాకు వచ్చి విజయ్ బెదిరించే సీన్ బాగుంది. అక్కడ విజయ్ సేతుపతి కూడా చింపేసాడంతే. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది.. విజయ్, విజయ్ సేతుపతిని అలా స్క్రీన్‌పై చూస్తుంటే రెండు కళ్లు సరిపోలేదు. మరీ ముఖ్యంగా ఫైట్ సమయంలోనూ సేతుపతి ఎక్స్‌ప్రెషన్స్ కేక పెట్టించాయి. మాస్టర్‌లోని కొన్ని సన్నివేశాలు చాలా బాగా రాసుకున్నాడు లోకేష్. వాటిని అంతే అద్భుతంగా స్క్రీన్ పై ప్రజెంట్ చేసాడు. కానీ ఊహించే కథ కావడం.. అలాగే జరుగుతుండటంతో స్క్రీన్ ప్లే అక్కడక్కడా గాడి తప్పింది. ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండుంటే రేంజ్ మరోలా ఉండేది. ఫస్టాఫ్‌లో కాలేజీ సీన్స్ బాగున్నాయి. అలాగే విజయ్ సేతుపతి కారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే లారీ ఫైట్ సీక్వెన్స్ కూడా బాగానే డిజైన్ చేసాడు. ఇలా ముక్కలు ముక్కలుగా బాగున్న మాస్టర్.. అతికించి చూస్తే మాత్రం అతకనట్టుగానే అనిపిస్తాడు.

నటీనటులు:
విజయ్ మరోసారి స్టైలిష్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు.. మేనరిజమ్స్‌తో మ్యాజిక్ చేసాడు. ఈ సినిమాతో తన వయసు మరింత తగ్గించుకున్నాడు విజయ్. అంత యంగ్ లుక్‌లో కనిపించాడు. విజయ్ సేతుపతి మాత్రం స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారి కరెంట్ పుట్టించాడు. విలనిజం అంటే ఇలా ఉంటుందా అనేలా కుమ్మేసాడు.. ఆయన కోసం మాస్టర్ చూడొచ్చు అనేలా నటించాడు. మాళవిక మోహనన్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా తక్కువ. ఉన్నంతలో పర్లేదు. ఆండ్రియా కూడా బాగానే చేసింది. శాంతను భాగ్యరాజ్, అర్జున్ దాస్ బాగా నటించారు.

టెక్నికల్ టీం:
అనిరుధ్ బ్యాగ్రౌండ్ అదిరింది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్ అయితే అదుర్స్ అంతే. ఎడిటింగ్ వీక్. తెలుగులో కొన్ని సన్నివేశాలు కట్ చేసుంటే బాగుండేది. నిడివి 3 గంటలు అనేది చాలా సమస్య. స్క్రీన్ ప్లే ఫాస్టుగా ఉంటే ఎంత సినిమా అయినా చూడొచ్చు కానీ స్లో నెరేషన్ శాపంగా మారింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. లోకేష్ కనకరాజ్ తొలిసారి కాస్త గాడి తప్పాడు. మానగరం, ఖైదీ లాంటి సినిమాలతో మెప్పించిన ఈయన.. స్టార్స్ మోజులో కథలో బ్యాలెన్స్ తప్పాడు. అయినా కూడా అక్కడక్కడా మెప్పించాడు.

చివరగా ఒక్కమాట:
మాస్టర్.. సగం అదుర్స్.. సగం బెదుర్స్..

రేటింగ్: 2.5/5
Published by:Praveen Kumar Vadla
First published: