హోమ్ /వార్తలు /సినిమా /

Sobhan Babu Death Anniversary: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..

Sobhan Babu Death Anniversary: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..

హీరో శోభన్ బాబు

హీరో శోభన్ బాబు

శోభన్ బాబు మరణించారంటే అసలు ఎవరూ నమ్మలేకపోయారు. పూర్తి ఆరోగ్యంతో ఉంటూ, మంచి డైట్ ను పాటించే ఆయన మరణించారా? అంటూ అంతా షాకయ్యారు. అప్పటి వరకు కొడుకుతో మాట్లాడారు. ఆ తర్వాత కొడుకు ఇంట్లోంచి బయటకు వెళ్లగానే..

‘నేను సాయత్రం ఆరు గంటల వరకే షూటింగ్ లో ఉంటాను. ఆరు దాటిన తర్వాత ఒక్క క్షణం కూడా స్పాట్ లో ఉండను. ప్రతీ ఆదివారం సెలవు కావాలి. రాత్రిళ్లు షూటింగ్ జరగాలంటే ఉదయం పూట నాకు రెస్ట్ కావాలి. ముందుగా ఒప్పుకున్న మేరకు తప్పకుండా రెమ్యూనరేషన్ ఇవ్వాలి. అలా అయితేనే సినిమా ఒప్పుకుంటా. లేదంటే వేరే హీరోను చూసుకోండి‘.. ఇది ఈ తరం యువ హీరోల్లో ఎవరో స్టార్ హీరో పెట్టిన డిమాండ్ ఏమీ కాదు. పాత తరం హీరోల్లో.. అంటే ఏఎన్నార్, ఎన్టీఆర్ ల కాలంలోనే ఓ హీరో పెట్టిన కండీషన్లు. అప్పట్లో డైరెక్టర్లే హీరోలుగా చెలామణీ అవుతున్న కాలంలో కూడా ఇంత నిక్కచ్చిగా రూల్స్ పాటించిన ఏకైక హీరో ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనే సోగ్గాడు శోభన్ బాబు. 2008వ సంవత్సరం మార్చి 20వ తారీఖున శోభన్ బాబు అశేష అభిమానులను శోకసముద్రంలో ముంచి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. శనివారం ఆయన 13వ వర్థంతి. ఈ సందర్భంగా శోభన్ బాబుకు సంబంధించిన ఎన్నో విశేషాలు వార్తల రూపంలో ఈ తరం సినీ అభిమానులకు తెలుస్తున్నాయి.

ఎప్పుడైనా దర్శకులు, అభిమానులు చెన్నైకి వెళ్తే శోభన్ బాబు ఇంటికి తప్పకుండా వెళ్లేవారు. ’మళ్లీ సినిమాల్లో నటించొచ్చు కదా సార్‘ అని ఎవరైనా అడిగితే ఆయన ఎప్పుడూ ఒకే మాటను చెబుతూ ఉండేవారు. ‘సినీ అభిమానులు నన్ను సోగ్గాడుగా గుర్తుంచుకున్నారు. అలాగే పిలుచుకుంటున్నారు. ఇప్పుడు ఈ అవతారంలో నన్ను చూస్తే, సినిమాల్లో మోసం చేశారా? అని కామెంట్లు వస్తాయి. అయినా నన్ను అభిమానుల గుండెల్లో సోగ్గాడిగానే మిగిలిపోనివ్వాలని నా ఆశ. ఆ శోభన్ బాబు చనిపోయాడు. సినిమాల్లో నటించమని అడిగేందుకో, నన్ను చూసేందుకో అభిమానులు నా ఇంటికి రావద్దు. మీరు మీ కుటుంబం కోసం జీవించండి‘ అని శోభన్ బాబు చెప్పేవారు.

ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్

నేను వందేళ్లు బతుకుతాను అంటూ.. శోభన్ బాబు తన సన్నిహితుల వద్ద చెప్పేవారు. చాలా కఠినమైన డైట్ ను ఆయన పాటించేవారు. కొలస్ట్రాల్ ఉండే ఆహార పదార్థాలను అస్సలు ముట్టుకునేవారు కాదు. ఆయన తన ఆరోగ్య అలవాట్లను చెబుతూ.. ’మా తాత 107 ఏళ్లు బతికాడు. మా నాన్న వందేళ్లు బతికాడు. నేను కూడా వందేళ్లు బతుకుతా‘ అని శోభన్ బాబు అనేవారు. 71 ఏళ్ల వయసులో సంభవించిన ఆయన మరణాన్ని కూడా సొంత కుటుంబ సభ్యులే కాదు, ఆయన కూడా అస్సలు ఊహించలేదు. ఏమాత్రం అనారోగ్యం లేకుండానే, అప్పటిదాకా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే ఆయన మరణం సంభవించడం శోచనీయం.

అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..

2008వ సంవత్సరం.. మార్చి 20వ తారీఖు. శోభన్ బాబు ఒక్కగానొక్క కొడుకు అయిన కరుణ శేషుతో ఉదయం పూట చాలా సేపు మాట్లాడారు. మద్రాసులో ఆయనకు ఉన్న స్థలంలో ఓ పెద్ద బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఆ బిల్డింగ్ లో ఫ్లోరింగ్ కు ఎలాంటి టైల్స్ వేస్తే బాగుంటుంది? ఎక్కడి నుంచి తెప్పించాలి? అన్న అంశాలపై తండ్రీకొడుకులిద్దరూ చర్చించుకున్నారు. ఆ విషయాలపై ఓ ఫైనల్ నిర్ణయానికి వచ్చిన తర్వాత కరుణ శేషు కారు తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. కొడుకు ఇంటి నుంచి బయటకు వెళ్లగానే భార్యకు ’మజ్జిగ తీసుకురా‘ అని చెప్పి తనకు ఎంతో ఇష్టమైన రాకింగ్ ఛెయిర్‌లో కూర్చున్నారు. వార్తలు చూద్దాం కదా అని టీవీ ఆన్ చేశారు.

ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!

ఎంత సేపటికీ భార్య మజ్జిగ తేకపోవడంతో భార్య వద్దకే వెళ్దామనుకున్నారు. అలా కుర్చీలోంచి పైకి లేచిన శోభన్ బాబు వెంటనే కింద పడిపోయారు. కుర్చీలోంచి పైకి లేవగానే సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది. అలా బోర్లా పడిపోవడంతో ఆయన ముక్కుకు కూడా దెబ్బ తగిలింది. అక్కడికక్కడే ఆయన మరణించారు. భార్య బయటకు వచ్చి చూసి అక్కడికక్కడే ఏడుస్తూ కుప్పకూలిపోయింది. వెంటనే ఈ విషయాన్ని కొడుకు కరుణ శేషుకు ఇతర కుటుంబ సభ్యులు తెలియజేశారు. అప్పటికే కిలో మీటరు దూరం మాత్రమే ఆయన వెళ్లారు. కొడుకుతో చివరి సారి మాట్లాడిన నిమిషాల వ్యవధిలోనే ఆయన మరణించడం జరిగింది.

First published:

Tags: A. Kodandarami Reddy, Krishna, Murali Mohan, NTR, Sobhan babu, Tollywood, Tollywood Movie News

ఉత్తమ కథలు