మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం క్రాక్. డాన్ శీను, బలుపు లాంటి సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. దాంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ కెరీర్‌కు ఈ చిత్రం డూ ఆర్ డై గా మారిపోయింది. అప్పట్లో వరస డిజాస్టర్స్‌తో పూర్తిగా ఇమేజ్ పడిపోతున్న సమయంలో రవితేజతో బలుపు సినిమా చేసి హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. మరోసారి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు రవితేజ. దాంతో ఇప్పుడు కూడా ఇదే చేస్తాడని నమ్ముతున్నారు రవితేజ అభిమానులు. శివరాత్రి సందర్భంగా క్రాక్ సినిమా టీజర్ విడుదల చేశారు చిత్రయూనిట్.
పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం వస్తుంది. ఒంగోల్లో రాత్రి 8 గంటలకు కరెంట్ పోయిందంటే కచ్ఛితంగా మర్డరే.. అనే వాయిస్ ఓవర్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఉత్కఠభరితంగా సాగింది. అప్పిగా, తుప్పిగా, నువ్వు ఎవరైతే నాకేంట్రా నా టోప్పిగా.. అంటూ మాస్ రాజా కూడా తనదైన శైలిలో డైలాగులు అదరగొట్టాడు. ఈ సినిమాను తమిళ సినిమా సేతుపతి ఆధారంగా తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. టీజర్ షాట్స్ చూసిన తర్వాత కూడా ఇదే అనిపిస్తుంది. విజయ్ సేతుపతి హీరోగా మూడేళ్ల కింద వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. తెలుగులో దీన్ని జయంత్ సి పరాన్జీ జయదేవ్ పేరుతో రీమేక్ చేసాడు. మళ్లీ ఇప్పుడు మరోసారి ఇలాంటి కథతోనే రవితేజ క్రాక్ సినిమా వస్తుందని ప్రచారం జరుగుతుంది. మే 8న సినిమా విడుదల కానుంది. బలుపు తర్వాత మరోసారి మాస్ రాజాతో రొమాన్స్ చేస్తుంది శృతి హాసన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Krack, Ravi Teja, Telugu Cinema, Tollywood