విజయ్ సేతుపతి గురించి కొత్తగా ఇప్పుడు పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే ఈయన పేరుకు తమిళ హీరో అయినా కూడా అంతా ఈయన్ని తమ హీరో అనుకుంటారు. తెలుగులో చేస్తే తెలుగు వాడు అయిపోతాడు.. హిందీలో నటిస్తే బాలీవుడ్ హీరో అయిపోతాడు. ఇక తమిళనాట ఈయన్ని దేవుడిలా చూస్తారు అభిమానులు. ఇదంతా కేవలం ఆయనకు సినిమాలతో వచ్చిన ఇమేజ్ కాదు. వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది కాబట్టి గుండెల్లో పెట్టుకున్నారు అభిమానులు. పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ఇప్పుడు విజయ్ సేతుపతి డేట్స్ కోసం చూస్తున్నారు. ఈయన డేట్స్ ఇవ్వకపోతే ఇచ్చేవరకు వేచి చూస్తున్నారు. ఈ రేంజ్‌కు రావడానికి విజయ్ సేతుపతికి పదేళ్లకు పైగానే పట్టింది. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాడు ఈయన. తిండికి కష్టపడిన రోజులు కూడా ఉన్నాయి ఈయన కెరీర్లో. అలాంటి సమయంలో తన ఎదుగుదలకు ఉపయోగపడిన వాళ్లను గుర్తించుకోవడం కనీస ధర్మం. అయితే సినిమా ఇండస్ట్రీలో కృతజ్ఞత భావం ఉండదని చాలా మంది చెప్పే మాట. అది తప్పని నిరూపించడానికి విజయ్ సేతుపతి లాంటి వాళ్లు అక్కడక్కడా కనిపిస్తుంటారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్నేళ్ల పాటు తిండి, నిద్ర లేక అల్లాడిపోయాడు విజయ్. అలాంటి క్లిష్ట సమయాల్లో తనను ఆదుకున్న దర్శకుడు ఎస్పీ జననాథన్. మార్చ్ 14న ఈయన బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయాడు. ఈయన హఠాన్మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. 2003లోనే జాతీయ అవార్డు సొంతం చేసుకున్నాడు జననాథన్. సామాజిక స్పృహ ఉండే సినిమాలు మాత్రమే చేసాడు ఈయన.
జననాథన్ చివరి సినిమా విజయ్ సేతుపతితోనే చేశాడు. లాభం పేరుతో వ్యవసాయ నేపథ్యంలో జననాథన్ సినిమా తెరకెక్కించాడు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నపుడే అనారోగ్యం పాలై చనిపోయాడు జననాథన్. ఇదిలా ఉంటే తనను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన దర్శకుడి మరణం ఆయన్ని బాగా కుంగదీసింది. అప్పుడు తనకు చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడు జననాథన్ హాస్పిటల్ బిల్ మొత్తం కట్టేసాడు.
ఒక్క రూపాయి కూడా ఆయన కుటుంబ సభ్యులను కట్టనివ్వలేదు. అంతేకాదు.. జననాథన్ అనారోగ్యం వార్త తెలియగానే అందరికంటే ముందు స్పందించాడు. హాస్పిటల్ దగ్గరికి వెళ్లి చూసాడు.. చనిపోయాడని తెలిసిన తర్వాత ఆయన అంతిమ సంస్కారాలు పూర్తయ్యేవరకు జననాథన్ కుటుంబంతో పాటు ఉన్నాడు. తాను ఒక స్టార్ హీరో అనే సంగతి మర్చిపోయి సామాన్యుడిలా అక్కడ అందరితో కలిసిపోయాడు విజయ్. తనకు కెరీర్ ఇచ్చిన దర్శకుడి కోసం కన్నీళ్ళు కార్చాడు. విజయ్ సింప్లిసిటీకి అక్కడున్న వాళ్లంతా జై కొట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Tamil Cinema, Vijay Sethupathi