Home /News /movies /

MAHARSHI MOVIE REVIEW MAHESH BABU 25TH MOVIE GOOD IN PARTS ONLY PK

మూవీ రివ్యూ: ‘మ‌హ‌ర్షి’.. ఎన్ యావరేజ్ జర్నీ ఆఫ్ రిషి కుమార్..

మహర్షి సినిమా

మహర్షి సినిమా

మ‌హ‌ర్షి.. కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీలో ఈ చిత్రం గురించి త‌ప్ప మ‌రో సినిమా గురించి టాపిక్ లేదు. ఎందుకంటే అది మ‌హేశ్ బాబు 25వ సినిమా కావ‌డంతో పాటు రైతుల క‌థ కావ‌డంతో ఎలా ఉండ‌బోతుందో అనే ఆస‌క్తి అంద‌రిలోనూ క‌నిపించింది. మ‌రి మ‌హ‌ర్షి అంచ‌నాలు అందుకున్నాడో లేదో చూద్దాం..

ఇంకా చదవండి ...
రేటింగ్: 2.5/5
న‌టీన‌టులు: మ‌హేశ్ బాబు, పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్, ప్ర‌కాశ్ రాజ్, రావు ర‌మేష్, జ‌య‌సుధ త‌దిత‌రులు
క‌థ‌: హ‌రి, వంశీ పైడిప‌ల్లి, సోలోమెన్
నిర్మాత‌లు: అశ్వినీ ద‌త్, దిల్ రాజు, పివిపి
ద‌ర్శ‌కుడు: వ‌ంశీ పైడిప‌ల్లి

మ‌హ‌ర్షి.. కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీలో ఈ చిత్రం గురించి త‌ప్ప మ‌రో సినిమా గురించి టాపిక్ లేదు. ఎందుకంటే అది మ‌హేశ్ బాబు 25వ సినిమా కావ‌డంతో పాటు రైతుల క‌థ కావ‌డంతో ఎలా ఉండ‌బోతుందో అనే ఆస‌క్తి అంద‌రిలోనూ క‌నిపించింది. మ‌రి మ‌హ‌ర్షి అంచ‌నాలు అందుకున్నాడో లేదో చూద్దాం..

క‌థ‌:
రిషి కుమార్(మ‌హేశ్ బాబు) గెలుపుకు చిరునామా. చిన్నస్థాయి నుంచి మొద‌లై ప్ర‌పంచంలోనే అతిపెద్ద కార్పోరేట్ కంపెనీ అయిన ఆరిజిన్‌కు సీఈఓ అవుతాడు. అమెరికాలోనే స్థిర‌ప‌డిపోయిన ఈయ‌న‌కు కాలేజ్ డేస్‌లో ర‌వి శంక‌ర్(అల్ల‌రి న‌రేష్) ఉంటాడు. అత‌డు చేసిన త్యాగం వ‌ల్లే తాను ఈ స్థాయికి ఎదిగాన‌ని తెలుసుకుని మ‌ళ్లీ ఇండియాకు వ‌స్తాడు. వ‌చ్చిన త‌ర్వాత తెలుస్తుంది.. త‌న స్నేహితుడు పెద్ద స‌మ‌స్య‌లో ఉంటాడ‌ని.. ఆ స‌మ‌స్య ఏంటి.. దాన్ని రిషి కుమార్ ఎలా అధిగ‌మించాడు అనేది క‌థ‌..

క‌థ‌నం:
ఈ రోజుల్లో ఏ హీరోకైనా 25 సినిమాల మైలురాయి అంటే గొప్ప విష‌య‌మే.. దాన్ని మ‌రింత ప‌క్కాగా ప్లాన్ చేసుకుంటుంటారు.. మ‌హేశ్ బాబు కూడా ఇదే చేసాడు. త‌న మైల్ స్టోన్ సినిమా క‌థ విష‌యంలో చాలా ప‌క్కాగా ఆలోచించాడు.. ఓ మంచి క‌థ‌ను ఎంచుకోవాల‌ని ఫిక్సైపోయి మ‌రీ.. రైతుల కోసం రైతుల చుట్టూ సినిమా చేసాడు. అదే మ‌హ‌ర్షి.. అయితే క‌థ వ‌ర‌కు బాగానే అనిపించినా.. ఎక్క‌డో తెలియ‌ని వెలితి మాత్రం సినిమా అంతా క‌నిపించింది. ఎందుకో తెలియ‌ని ఓ స్లో నెరేష‌న్ అడుగడుగునా మ‌హ‌ర్షి సినిమాకు అడ్డు ప‌డింది. దానికి తోడు 3 గంట‌ల‌కు పైగా ఉండే నిడివి కూడా ప్రేక్ష‌కుల‌ను ఇబ్బంది పెడుతుంది. శ్రీ‌మంతుడులో కూడా ఇలాంటి సోష‌ల్ మెసేజ్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. కానీ దాన్ని స్క్రీన్ ప్లే మాయాజాలంతో వేగంగా న‌డిపించాడు. వంశీ పైడిప‌ల్లి అది చేయ‌డంలో విఫ‌లం అయ్యాడేమో అనిపించింది. అక్క‌డ‌క్క‌డా సీన్స్ బాగా అనిపిస్తున్నాయి కానీ.. అన్నీ ఒకేచోట చేరిస్తే మాత్రం స‌రిగ్గా అత‌క‌న‌ట్లే అనిపించింది. ఫ‌స్టాఫ్ అంతా వ‌ద్ద‌నుకున్నా కూడా 3 ఇడియ‌ట్స్ సినిమా ఎక్కువ‌గా గుర్తొస్తుంది.
అక్క‌డ అమీర్ ఖాన్ కారెక్ట‌ర్ ఇక్క‌డ మ‌హేశ్ బాబులో క‌నిపిస్తుంది. జీవా కారెక్ట‌ర్ అల్ల‌రి న‌రేష్‌లో ఉన్నాడు. అయితే కాలేజ్ సీన్స్ మాత్రం బాగానే ఆక‌ట్టుకున్నాయి.. ముఖ్యంగా మ‌హేశ్ కామెడీ టైమింగ్ బాగుంది. ఒక‌ప్ప‌టి మ‌హేశ్ బాబును గుర్తు చేసాడు.. అల్ల‌రి న‌రేష్ కారెక్ట‌ర్ కూడా చాలా బాగా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. కామెడీ యాంగిల్ మాత్ర‌మే కాదు.. కావాల్సినంత ఎమోష‌న్ అత‌డి కారెక్ట‌ర్‌లో చూపించాడు వంశీ పైడిప‌ల్లి. సెకండాఫ్ అంతా ఎమోష‌న‌ల్ స్టోరీగానే సాగింది.. కాకపోతే కాస్త సా.....గింది కూడా. మంచి క‌థ రాసుకున్నా కూడా దాన్ని చాలా స్లోగా నెరేట్ చేయ‌డంతో అక్క‌డ‌క్క‌డా బోర్ కొట్టించాడు మ‌హ‌ర్షి. క‌థ‌లో స‌రైన విల‌న్స్ కూడా లేరు. ఎక్క‌డి వాళ్లు అక్క‌డే ఆగిపోతుంటారు. కానీ హీరో మాత్రం సూప‌ర్ మ్యాన్ మాదిరి వెళ్తూనే ఉంటాడు. హీరో స్ట్రాంగ్ అవ్వాలంటే విల‌న్ కూడా ఉండాలి.. కానీ మ‌హ‌ర్షిలో అదెక్క‌డా క‌నిపించ‌దు. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు బాగున్నాయి.. కాక‌పోతే అవి స‌న్నివేశాల ప‌రంగానే బాగుండ‌టం మ‌హ‌ర్షికి మైన‌స్. ప్రీ క్లైమాక్స్‌లో రైతుల గురించి చెప్పే సీన్ బాగుంది.. ప్రెస్ మీట్ సీన్ బాగానే వ‌ర్క‌వుట్ అయిందేమో అనిపించింది.

న‌టీన‌టులు:
మ‌హేశ్ బాబు చాలా బాగా న‌టించాడు. రిషి కుమార్ పాత్ర‌లో ఒదిగిపోయాడు. కార్పోరేట్ కంపెనీ సీఈఓగా హాలీవుడ్ హీరోను త‌ల‌పించాడు. న‌ట‌న‌లో కూడా పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. అల్ల‌రి న‌రేష్ కూడా ర‌వి పాత్ర‌కు ప్రాణం పోసాడు. ఇన్నాళ్లూ కామెడీగానే ఉన్న న‌రేష్.. ఇప్పుడు మాత్రం ఎమోష‌న‌ల్ పాత్ర‌లో చాలా బాగా న‌టించాడు. పూజా హెగ్డే అందాల ఆర‌బోత‌కు స‌రిపోయింది. రావు రమేష్, జ‌య‌సుధ‌, ప్ర‌కాశ్ రాజ్, సాయి కుమార్ పాత్ర‌లు కూడా బాగున్నాయి. వెన్నెల కిషోర్, శ్రీ‌నివాస్ రెడ్డి లాంటి వాళ్లు అక్క‌డ‌క్క‌డా క‌నిపించారు.

టెక్నిక‌ల్ టీం:
దేవీ శ్రీ ప్ర‌సాద్ ఎందుకో కానీ మ‌హ‌ర్షికి మ‌న‌స్పూర్తిగా మ్యూజిక్ ఇవ్వ‌లేదేమో అనిపించింది. ఆయ‌న సంగీతంలో ఉండే ప్రాణం ఇందులో మిస్ అయిన‌ట్లు అనిపించింది. ప‌ద‌రా ప‌ద‌రా పాట బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సోసోగానే అనిపించింది. ఎడిట‌ర్ ప‌నితనం వీక్. 3 గంట‌ల సినిమా కావ‌డంతో బోర్ కొట్టించాడు. అక్క‌డ‌క్క‌డా కొన్ని సీన్లు ట్రిమ్ చేసుంటే బాగుండేదేమో..? ద‌ర్శ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి అనుకున్నంత‌గా విజ‌యం సాధించ‌లేదేమో అనిపిస్తుంది. క‌థ‌కుడిగా మాత్రం మంచి క‌థ‌నే తీసుకున్నా.. దాన్ని తెర‌కెక్కించ‌డంలో విఫ‌లం అయ్యాడు. స్లో నెరేష‌న్ మ‌హ‌ర్షికి మైన‌స్. నిర్మాత‌లు పివిపి, దిల్ రాజు, అశ్వినీ ద‌త్ ఎక్క‌డా త‌గ్గ‌కుండా సినిమాను అద్భుతంగా నిర్మించారు.

చివ‌ర‌గా ఒక్క‌మాట‌:
మ‌హ‌ర్షి.. ఎన్ యావ‌రేజ్ జ‌ర్నీ ఆఫ్ రిషి కుమార్..
First published:

Tags: Maharshi Movie Review, Mahesh babu, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు