మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు (Maa elections) తర్వాత టాలీవుడ్ లో నటీనటుల మధ్య విభేదాలు మరింత ముదిరాయనే వార్తలు, పవన్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో ఎడమొహంగా వ్యవహరించిన ఘటన, ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ప్యానెల్ రాజీనామా తదితర అంశాలపై మా అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) కీలక వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో అక్రమాలు, ప్రత్యర్థి వర్గం ఆరోపణలపై స్పందించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలై బలై వేదికపై పవన్ తో మాట్లాడకపోవడంపైనా విష్ణు వివరణ ఇచ్చుకున్నారు. మా అధ్యక్షుడి హోదాలో తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విష్ణు తన టీమ్ తో కలిసి తిరుపతిలో మీడియాతో మాట్లాడారు..
మాటల్లేవ్..
మా ఎన్నికల్లో పవన్ కల్యాణ్ బలపర్చిన ప్రకాశ్ రాజ్ వర్గాన్ని ఓడించి మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత మెగా ఫ్యామిలీ, మంచు కుటుంబాల మధ్య మాటల యుద్ధం తీవ్రత పెరిగింది. కాగా, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ దసరా పండుగ సందర్భంగా సికింద్రాబాద్ లో నిర్వహించిన అలై-బలై కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు మధ్య చోటుచేసుకున్న దృశ్యాలు, వేదికపై పవన్ కూర్చున్న వీడియోను ట్వీచేస్తూ.. ఈయనెవరో గుర్తుపట్టారా? అని విష్ణు కామెంట్ చేయడం పరిస్థితిని మరింత దిగజార్చింది. వాళ్లిద్దరి మధ్య మాటల్లేవని మీడియాలో ప్రచారం జరిగింది. అయితే పవన్ తో తనకు ఎలాంటి గొడవలు, విభేదాలు లేవని వివరణ ఇచ్చారు మంచు విష్ణు..
పవన్‌తో మాట్లాడాను..
అలై-బలై కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తో మాట్లాడానని మంచు విష్ణు చెప్పారు. తామిద్దరి మధ్య మాటల్లేవని వచ్చిన వార్తను ఆయన ఖండించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చీఫ్ గెస్ట్ గా వేదికపై ఉండటంతో ప్రోటోకాల్ పాటించామని, అందుకే స్టేజీపై పీకేతో మాట్లాడలేదని, అయితే వేదిక కింద మాత్రం సరదాగా జోకులేసుకున్నామని విష్ణు తెలిపారు. ‘ఈయనెవరో గుర్తుపట్టారా?’ అన్న ట్వీట్ పై స్పందిస్తూ.. ‘పవన్ కల్యాణ్ కు కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ల కోసమే నేనా వీడియోను పోస్ట్ చేశాను. అంతపెద్దాయనతో నేనూ ఉన్నాననే అర్థంలో మాత్రమే నా కామెంట్లను చూడాలి’అని చెప్పారు.
రాజీనామాలపై ట్విస్ట్
మా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని నిరూపించాల్సింది ప్రకాశ్ రాజ్ ప్యానెలే అని, వాళ్లు కోరినట్లు సీసీటీవీ ఫుటేజిని నిరభ్యంతరంగా చూసుకోవచ్చని విష్ణు అన్నారు. కాగా, మంచు వర్గంతో కలిసి పనిచేసే పరిస్థితి ఉండదని, గెలిచిన తమ వాళ్లంతా రాజీనామా చేస్తారని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ప్రకటించినా, ఇప్పటివరకూ అధికారికంగా రాజీనామా లేఖలు అందలేదని మా అధ్యక్షుడు తెలిపారు. ‘కేవలం ఒకే ఒక్క లేఖ వచ్చింది. మిగతా వాళ్ల రాజీనామాలు నాకు అందలేదు. అయితే వాటిని మేం ఆమోదించాలనుకోవట్లేదు..’అని విష్ణు పేర్కొన్నారు.
మా నిబంధనలు మార్చేస్తాం..
అసోసియేషన్ కు సంబంధించి బైలాస్ లో కొన్ని మార్పులను తీసుకొస్తామని విష్ణు స్పష్టం చేశారు. తెలుగు వాళ్లు మాత్రమే మా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని తాము ఎక్కడా చెప్పలేదని, వచ్చే ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ నిరభ్యంతరంగా పోటీ చేయొచ్చని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి బెటర్ టక్ నెక్ట్స్ టైమ్ అని మాత్రమే చెప్పగలనన్నారు. మా ఎన్నికల తర్వాత చిరంజీవి, మోహన్ బాబు ఫోన్లో మాట్లాడుకున్నారని విష్ణు తెలిపారు.
ఆ జర్నలిస్టు వల్లే గొడవలు..
మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ వర్గం, ఆయనను సమర్థించిన మెగా ఫ్యామిలీతో మంచు కుటుంబానికి, తమ ప్యానెల్ తో స్పర్థలపై విష్ణు మరో కీలక విషయం తెలిపారు. జర్నలిజాన్ని భ్రష్టు పట్టించే ఒక జర్నలిస్ట్.. ఒకే ఒక్క డబ్బింగ్ సినిమాలో నటించి ‘మా’ సభ్యుడయ్యారని.. ఆ జర్నలిస్ట్ వల్లే ‘మా’ లో వివాదాలు మొదలయ్యాని విష్ణు కామెంట్ చేశారు. సీనీ జర్నలిస్టు సురేశ్ కొండేటిని ఉద్దేశించి విష్ణు ఇలా అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: MAA Elections, Manchu Vishnu, Pawan kalyan