MAA ELECTIONS THIS IS THE FINAL CONTESTANTS LIST FROM PRAKASH RAJ AND MANCHU VISHNU PANEL SR
MAA Elections : ఢీ అంటే ఢీ అంటోన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు.. అభ్యర్థుల తుది జాబితా ఇదే..
Prakash Raj and Manchu Vishnu Photo : Twitter
MAA Elections : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు అక్టోబరు 10న ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ముమ్మురంగా ప్రచారం మొదలు పెట్టారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అయితే తాజాగా మా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వెల్లడించారు
తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన ఎలక్షన్స్ (MAA Elections) రోజు రోజుకు రంజుగా మారుతున్న సంగతి తెలిసిందే. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ "మా" ఎన్నికల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈసారి మాకు ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికవబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. ఈ మా ఎలక్షన్స్ అక్టోబర్ 10 న జరగబోతున్నాయి. దీనికి సంబదించిన నోటిఫికేషన్ రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్యనే పోటీ ఉండనుంది.
అక్టోబర్ రెండు నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది కావడంతో ప్రెసిడెంట్ కోసం నామినేషన్ వేసిన సివిఎల్ నరసింహారావు తాను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక జనరల్ సెక్రటరీ కోసం నామినేషన్ వేసిన బండ్ల గణేష్ కూడా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో తాజాగా మా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వెల్లడించారు. మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీలో ఉండగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబుమోహన్, శ్రీకాంత్ పోటీ పడుతున్నారు.
ఇక వైస్ ప్రెసిడెంట్ పదవికి బెనర్జీ, హేమ, మాదాల రవి, పృథ్వీరాజ్ పోటీలో ఉండగా, జనరల్ సెక్రటరీ పోస్టుకు జీవితా రాజశేఖర్, రఘుబాబు బరిలో ఉన్నారని తెలిపారు. కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు పోటీలో ఉండగా, రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణిలు పోటీలో ఉన్నారు. వీటితో పాటు అసోసియేషన్‌లోని 18 ఈసీ పోస్టులకు 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఇక మా ఎన్నికలకు అక్టోబర్ 10వ తేదీన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు.
ఇక మరోవైపు నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్‌ను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నట్టు నటి పూనమ్ కౌర్ తెలిపింది. అప్పుడే తాను ఎదుర్కొన్న సమస్యల్ని చెప్పగలుగుతానని పేర్కోంది.
పూనమ్ కౌర్..ఎస్‌వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో 2006లో వచ్చిన 'మాయాజాలం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా తర్వాత..అడపా దడపా పలు సినిమాల్లో నటించింది. కానీ ఏ సీనిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. దీంతో హీరోయిన్ పాత్రల్నీ వదిలి..హీరోలకు చెల్లెలి పాత్రల్నీ వేయడం ఆరంభించింది. అంతేకాకుండా పూనమ్ కౌర్ ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే..కన్నడ, తమిళ సినిమాలు చేసింది. ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో ఆమె సినిమాలు ఏవి పెద్దగా రావడం లేదు. అయితే ఆమె తన సినిమాల కంటే..ఆమె చుట్టూ అల్లుకున్న వివాదాల ద్వారా పాపులర్ అయ్యింది.
ఇక మా ఎలక్షన్స్ విషయానికి వస్తే.. ఈ ఎన్నికలు ఎనిమిది మంది ఆఫీస్ బేరర్స్, పద్దెనిమిది మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కోసం జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే... కండీషన్స్ ఇలా ఉన్నాయి. ఒక అభ్యర్ధి ఒక పదవి మాత్రమే పోటీ చేయాలి. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి, ఈసీ మీటింగ్స్‌కు 50 శాతం కన్నా తక్కువ హాజరీ ఉంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్ బేరర్స్‌గా ఉండి.. ఆ పదవులకు రాజీనామా చేయకుండా 'మా' ఎన్నికల్లో పోటీ చేయకూడదు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.