హోమ్ /వార్తలు /సినిమా /

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ పచ్చి అబద్ధాలు - 20ఏళ్లుగా MAA Elections అధికారిని నేనే: కృష్ణమోహన్ -అక్రమాలపై యాక్షన్ ఉంటుందా?

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ పచ్చి అబద్ధాలు - 20ఏళ్లుగా MAA Elections అధికారిని నేనే: కృష్ణమోహన్ -అక్రమాలపై యాక్షన్ ఉంటుందా?

మా ఎన్నికల అధికారి

మా ఎన్నికల అధికారి

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అక్రమాలు, మంచు ఫ్యామిలీ దౌర్జన్యాలు చోటుచేసుకున్నాయంటూ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అయితే ఎన్నికల్లో మోసం జరిగిన మాట వాస్తవం కాదని మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ చెప్పారు. బ్యాలెట్ పేపర్లు ఎత్తుకెళ్లారనే అంశంపైనా ఆయన వివరణ ఇచ్చారు. ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువన్న కృష్ణ మోహన్ గత 20 ఏళ్లుగా మా ఎన్నికలను తానే నిర్వహిస్తున్నానని గుర్తుచేశారు..

ఇంకా చదవండి ...

సాధారణ ఎన్నికల్లో అక్రమాలు, ఉల్లంఘనలు చోటుచేసుకుంటే ఎన్నికల కమిషన్ స్పందించి చర్యలకు దిగుతుంది. ఎన్నికల కమిషనే తప్పులు చేస్తే కోర్టులు సరిదిద్దిన సందర్భాలున్నాయి. అయితే, వెల్ఫేర్ అసోసియేషన్లుగా రిజిస్టరైన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) లాంటి సంఘాల విషయంలో అంత సీన్ ఉండదని తెలిసిందే. కావడానికి మా అసోసియేషన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఏర్పడినప్పటికీ, వెల్ఫేర్ సొసైటీగా దానికంటూ ప్రత్యేక బైలాస్, రూల్స్ తోనే నడుస్తుంది. అసోసియేషన్ ఎన్నికలు కూడా పూర్తిగా అంతర్గత వ్యవహారంలానే కొనసాగుతుంది. మా పెద్దలే ఎన్నికల అధికారిని నియమించుకుంటారు. అయితే మా ఎన్నికలు, కార్యకలాపాలు చట్టవిరుద్దంగా సాగినప్పుడు లేదా వివాదాలు తలెత్తినప్పుడు కోర్టులు జోక్యం చేసుకునే వీలుంది. మొన్న జరిగిన మా ఎన్నికల్లో అక్రమాలు జరిగియాని ఆరోపించిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్.. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించే అవకాశాలనూ అధ్యయనం చేసింది. ఈ పరిణామాలపై మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ఘాటుగా స్పందించారు..

బ్యాలెట్ పేపర్లు ఎత్తుకెళ్లారు..

మా ఎన్నికలకు సంబంధించి ఆదివారం జరిగిన పోలింగ్, ఫలితాల ప్రకటన నిబంధనలకు విరుద్ధంగా ఉందని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఆరోపించింది. పోలింగ్ కేంద్రం బయట మంచు మోహన్ బాబు, ఆయన కొడుకు మంచు విష్ణు గుండాయిజానికి పాల్పడ్డారని, ఎదురుపడ్డవాళ్లందరినీ బండ బూతులు తిట్టారని ప్రకాశ్ రాజ్ వర్గం తెలిపింది. మోహన్ బాబు అనుచిత ప్రవర్తనను గుర్తుచేస్తూ నటుడు బెనర్జీ కన్నీళ్లు పెట్టుకోగా, నటుడు సమీర్, ఈటీవీ ప్రభాకర్ సంచలన విషయాలు చెప్పారు. పోలింగ్ రోజున ఎన్నికల అధికారలు బ్యాలెట్ పేపర్లను ఎత్తుకెళ్లారని, అదేంటని ప్రశ్నిస్తే అధికారిగా తనకు హక్కుంటుందని వాదించాడని ఆ ఇద్దరూ తెలిపారు. ఫలితాలను పూర్తిగా ప్రకటించకుండా, తారుమారు లెక్కలతో మరుసటిరోజు వివరణలు ఇచ్చారని సమీర్, ప్రభాకర్ ఆరోపించారు. విష్ణు అక్రమంగా గెలిచినప్పటికీ, గొడవలు వద్దనుకునే తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ చెప్పుకుంది. అయితే..

బాక్సుల తాళాలు తీసుకెళ్లా.. బ్యాలెట్ కాదు..

పోలింగ్ రోజున అక్రమాలపై మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ స్పందించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ చేస్తోన్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఆయన అన్నారు. ప్రభాకర్ లేదా సమీర్ చెబుతున్నట్లుగా బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లడం అవాస్తమన్నారు. ‘ఎన్నికల అధికారినైన నేను బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లానని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ చేసిన ఆరోపణ నిజం కాదు. బ్యాలెట్ పేపర్లు భద్రపర్చిన బాక్సుల తాళాలను మాత్రమే నేను ఇంటికి తీసుకెళ్లానుగానీ బ్యాలెట్ పేపర్లను కాదు’అని కృష్ణ మోహన్ వివరణ ఇచ్చారు. ప్రెస్ మీట్ లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఆరోపణలు, బ్యాలెట్ బాక్సుల్ని ఎవరో ఎత్తుకెళ్లారట అంటూ నటి అనసూయ ట్వీట్ తర్వాత మా ఎన్నికల అధికారిపైనా విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి..

20ఏళ్లుగా ఎన్నికల అధికారిని నేనే..

వృత్తిరీత్యా న్యాయవాది అయిన కృష్ణ మోహన్ ను మా ఎన్నికల అధికారిగా ఆ సంఘమే నియమించుకుంది. మా క్రమశిక్షణ (ప్రస్తుతం కృష్ణంరాజు, మోహన్ బాబు, మురళీ మోహన్, శివకృష్ణ సభ్యులుగా ఉన్న) కమిటీనే ఎన్నికల అధికారిగా ఎవరుండాలనేది డిసైడ్ చేస్తుంది. కాగా, కృష్ణ మోహన్ వివరణ ప్రకారం గడిచిన రెండు దశాబ్దాలుగా మా ఎన్నికలను ఆయనే నిర్వహిస్తున్నారు. ‘2002 నుంచి మా ఎన్నికలను నేనే నిర్వహిస్తున్నాను. ప్రజల జ్ఞాపకశక్తి చాలా తక్కువ. అందుకే ఈ సారి మాత్రమే మా ఎన్నికలు ఉత్కంఠభరితంగా లేదా ఉద్రిక్తంగా సాగాయని అనుకుంటారు. నిజానికి ప్రతిసారి ఇలానే జరుగుతుంది. ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఏ ఎన్నిక అయినా ఇలానే జరగాలి కూడా’అని కృష్ణ మోహన్ వ్యాఖ్యానించారు.

మంచు కోర్టులో బంతి..

ప్రకాశ్ రాజ్ రాజీనామాపై మా ఎన్నికల అధికారిగా తాను మాట్లాడకూడదని, అయితే, ఆరోపణలు నిజమైనా కాకున్నా మాట్లాడే హక్కు మాత్రం అందరికీ ఉంటుందని, రాజీనామాల వ్యవహారాలతో ఎన్నికల అధికారికి సంబంధం ఉండదని కృష్ణ మనోహర్ చెప్పారు. కాగా, గెలిచిన తన ప్యానెల్ సభ్యుల చేత రాజీనామాలు చేయించిన ప్రకాశ్ రాజ్.. మాలో ‘లోకల్ నాన్ లోకల్’తేడాల్లేవని మంచు విష్ణు చెబితే గనుక రాజీనామాను వెనక్కి తీసుకుంటానని సవాలు చేశారు. తద్వారా బంతిని మంచు కోర్టులోకి నెట్టారు. అసలు వివాదమే లోకల్ నాన్ లోకల్ అయినప్పుడు, ఆ పాయింటుపైనే విష్ణు గెలిచినప్పుడు మళ్లీ నాన్ లోకల్ ఇష్యూ కాదని చెబితే మంచువారు ఇన్నాళ్లూ చేసిన వాదన కరిగిపోయినట్లవుతుంది. అలాగని ప్రకాశ్ రాజ్ సవాలుకు స్పందించకుంటే మంచు వర్గం పక్షపాతంగానే ఉన్నట్లు తేలినట్లా?

First published:

Tags: MAA, MAA Elections, Manchu Family, Manchu Vishnu, Prakash Raj

ఉత్తమ కథలు