MAA ELECTIONS 2021 TOLLYWOOD ACTRESS HEMA BITES SHIV BALAJI HAND AT POLLING COUNTER SK
MAA Elections: శివ బాలాజీ చెయ్యి కొరికిన నటి హేమ.. 'మా' ఎన్నికల్లో రచ్చ.. రచ్చ..
శివ బాలాజీ చెయ్యిని చూపిస్తున్న నరేష్
MAA Elections 2021: మా ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Movie Artist Association) ఎన్నికలు టాలీవుడ్లో సెగలు రేపుతున్నాయి. రాజకీయ ఎన్నికలను తలదన్నేలా చిత్రసీమను వేడెక్కిస్తున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూళ్లో మా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఐతే పోలింగ్ కేంద్రం లోపల ప్రచారం చేశారంటూ.. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెళ్ల మధ్య గొడవ జరిగింది. గేటు బయటకు వెళ్లి ప్రచారం చేసుకోవాలంటూ ప్రకాశ్ వర్గం నటులపై మంచు విష్ణు గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే బెనర్జీపై మోహన్ బాబు మండిపడ్డారు. ప్రకాశ్ రాజ్ గన్‌మెన్ పోలింగ్ కేంద్రంలోనికి రాకుండా మంచు విష్ణు అడ్డుకున్నారు. అటు శివ బాలాజీ, హేమ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. అంతటితో ఆగలేదు. కోపంతో శివబాలాజీ చేతిని హేమ కొరికినట్లు నటుడు నరేష్ చెప్పారు. అతడి చేతిపై పళ్ల గాట్లను మీడియాకు చూపించారు.
ఉదయం 10.30 గం.లకు 240మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 'మా'లో మొత్తం 925 మంది సభ్యులు ఉన్నారు. అందులో 883మందికి ఓటు హక్కు ఉంది. మా ఎన్నికల్లో ఇప్పటికే చాలా మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, నాగబాబు, బాలకృష్ణ, మోహన్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, పోసారి కృష్ణమురళి, బ్రహ్మానందం, వడ్డె నవీన్, సుమన్, సాయికుమార్, శ్రీకాంత్, నరేష్, సుమన్, ఉత్తేజ్, సుడిగాలి సుధీర్, రాఘవ, జెనీలియా, నిత్యా మీనన్ ఓటువేశారు.
మా ఎన్నికల్లో ఇంత హడావిడి అవసమా, గతంలో ఎప్పుడూ ఇలా లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ఎన్నికల వల్ల సినీ ఇండస్ట్రీ చిలిపోదని చెప్పారు. తన అన్నయ్య చిరంజీవి, మోహన్‌బాబు స్నేహితులని ఆయన తెలిపారు. తన అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశానని చిరంజీవి అన్నారు. తాను మాత్రం ప్రకాశ్ రాజ్‌కే ఓటువేశానని నాగబాబు చెప్పారు. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు అన్నదమ్ముల్లాంటి వారని బాలకృష్ణ అన్నారు. ఎవరు మంచి చేయగలరో వారికే ఓటువేసినట్లు ఆయన చెప్పారు. ఎన్నికల్లో పోటీచేసిన వారిలో ఎవరు ఎవరికీ శత్రువులు కాదని.. సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కటేనని సినీ నటి, ఎమ్మెల్యే రోజా చెప్పారు.
మా ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత ఇవాళ రాత్రి ఫలితాలు వెల్లడిస్తారు. రాత్రి 8 గంటలకు విజేతలెవరో అధికారంగా ప్రకటిస్తారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.