తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. సాధారణంగా 2 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. కానీ ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి కూడా నటులు తరలివస్తున్న నేపథ్యంలో... ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్ల విజ్ఞప్తి మేరకు.. పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచారు. ఐతే ఎప్పుడూ లేనంతగా ఈసారి 'మా' ఎన్నికలు వివాదాల్లో నిలవడం.. ప్యానెళ్ల మధ్య మాటల యుద్ధం జరగడంతో.. చివరకు పోలింగ్ రోజు కూడా అదే వేడి కనిపించింది. పోటాపోటీగా ప్రచారాలు.. పరస్పర ఆరోపణలు, విమర్శలతో.. పోలింగ్ కేంద్రం వద్ద హడావిడి వాతావరణం నెలకొంది. అదే సమయంలో సినీ నటులు కూడా తమకు ఇష్టమైన వారికి ఓటు వేసేందుకు క్యూకట్టారు. అందుకే ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయినట్లు సమాచారం. 3 గంటల తర్వాత కూడా ఇంకా చాలా మంది క్యూలో ఉన్నారు. వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు.
ప్రస్తుతం మా అసోసియేషన్‌లో 925మంది సభ్యులు ఉన్నారు. అందులో 883మందికి ఓటు హక్కు ఉంది. ఐతే మధ్యాహ్నం 02.30 గంటల వరకు 626 మంది ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. 70శాతం పోలింగ్ నమోదయింది. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, నాగబాబు, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, అల్లరి నరేష్, తనికెళ్ల భరణి, మంచు మనోజ్, మంచు లక్ష్మి, పోసారి కృష్ణమురళి, బ్రహ్మానందం, అలీ, వడ్డె నవీన్, సుమన్, సాయికుమార్, శ్రీకాంత్, నరేష్, సుమన్, ఉత్తేజ్, సుడిగాలి సుధీర్, రోజా, రాఘవ, జెనీలియా, నిత్యా మీనన్, రాశి, కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్, ఆర్.నారాయణమూర్తి, చలపతిరావు, రవిబాబు, బండ్ల గణేష్, గిరిబాబు, బ్రహ్మాజీ, అనసూయ, అఖిల్, సుధీర్ బాబు, అనుపమ పరమేశ్వరన్‌తో పాటు మా అసోసియేషన్‌లో చాలా మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
MAA Elections 2021: వాళ్ల వల్లే గొడవలు.. 'మా' ఎన్నికల తీరుపై రోజా కీలక వ్యాఖ్యలు
మా ఎన్నికల్లో ఎప్పుడూ 500 మంది మించి పోలింగ్ నమోదవదు. 480-490 మంది మాత్రమే ఓట్లు వేస్తుంటారు. కానీ చరిత్రలో తొలిసారి దాదాపు 700 మంది ఓట్లు వేశారు. పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టడం కూడా పోలింగ్ శాతం పెరగడానికి కారణంగా తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ విధానంలో 60 మందికి పైగా ఓటు వేశారు. మరి భారీగా పెరిగిన పోలింగ్ శాతం.. ఎవరికి లాభం చేకూర్చుతుంది? ఎవరికి నష్టం మిగుల్చుతుంది? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై ఇటు ప్రకాశ్ రాజ్ ప్యానెల్, అటు మంచు విష్ణు ప్యానెల్ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
MAA Elections 2021: శివ బాలాజీని అందుకే కొరికా... ఆ గొడవపై నటి హేమ
మా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి 3 వరకు సాగింది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఇవాళ రాత్రి ఫలితాలు వెల్లడిస్తారు. రాత్రి 8 గంటలకు విజేతలెవరో అధికారంగా ప్రకటిస్తారు. మొదట కార్యనిర్వాహక సభ్యుల ఫలితాలను ప్రకటించి.. చివరకు అధ్యక్షుడి ఫలితాలను వెల్లడిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: MAA, MAA Elections, Manchu Vishnu, Prakash Raj, Tollywood