Manchu Vishnu: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం.. మోహన్‌బాబుపై తెలంగాణ మంత్రి ప్రశంసలు

మంచు విష్ణు

Manchu Vishnu: 'మా' అసోసియేషన్‌కు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్పారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.

 • Share this:
  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడిగా మంచు విష్ణు (Manchu Vishnu) ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల ఎన్నికైన 'మా' కొత్త కార్యవర్గం కొలువుదీరింది. మంచు విష్ణుతో పాటు తన ప్యానెల్‌కు చెందిన సభ్యులంతా ప్రమాణస్వీకారం చేశారు. ప్రకాశ్ రాజ్‌ ప్యానెల్‌కు చెందిన వారు మాత్రం గైర్హాజరయ్యారు.  ఉదయం 11 గంటలకు  ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది.  ఈ కార్యక్రమానికి తెలంగాణ పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌  (Talasani srinivas yadav)ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోహన్ బాబు, కృష్ణ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐతే చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), వెంకటేష్ (Venkaatesh) వంటి సీనియర్లు మాత్రం దూరంగా ఉన్నారు.

  ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మా అసోసియేషన్‌కు ప్రభుత్వం అన్ని విధాలా అండదండగా ఉంటుందని చెప్పారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.

  ''మా సభ్యులంతా కలిసి మంచి ప్యానెల్‌ను ఎన్నుకున్నారు. విష్ణు గెలుస్తాడని నాకు ముందే తెలుసు. 10 రోజుల ముందే ఫోన్ చేసి చెప్పా. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల స్థాయిలో మా ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్ సినిమా హబ్‌గా ఉండాలని కేసీఆర్ సంకల్పించారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంచు విష్ణుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. సినీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిర్మాతలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే సింగిల్ విండో అనుమతులు ఇచ్చాం. ప్రజలంతా థియేటర్లకి వెళ్లి సినిమాలు చూడండి. సినీ నటులంతా తమకు తోచిన సాయం చేస్తే 900 మందినే కాదు 9వేల మందిని ఆదుకునే సత్తా 'మా'కు ఉంటుంది. తెలంగాణలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, పర్యాటక క్షేత్రాలు ఉన్నాయి. వాటిని షూటింగ్‌లు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలి, దేశంలోనే ఆదర్శవంతంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు. త్వరలోనే విష్ణులతో పాటు సినీ పెద్దలను త్వరలో ప్రభుత్వంతో చర్చలకు ఆహ్వానిస్తాం. అర్హులైన కళాకారులకు పించన్లు, కల్యాణ లక్ష్మి,  డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వంటి పథకాలు అందేలా చూస్తాం. '' అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

  అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్... అనుకున్న సమయం కంటే ముందే...

  ఇక మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా మాట్లాడారు మంత్రి తలసాని. ఆయన మంచి మనసున్న వ్యక్తని, కానీ ఆవేశం ఎక్కువని చాలా మంది పొరపాటు పడతారని చెప్పారు. తనకు నష్టం జరిగినా.. ఎదుటి వారికి మేలు జరగాలని కోరుకునే గొప్ప వ్యక్తి మోహన్ బాబు అని కొనియాడారు.

  చప్పగా బిగ్‌బాస్ షో.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసింది...

  ''మోహన్ బాబుది, నాది అన్నాదమ్ముళ్ల అనుభవం. మోహన్ బాబుకు కోపం, ఆవేశం ఎక్కువగని అందరూ అనుకుంటారు. ఆయన ఆవేశం వల్ల ఆయనకే నష్టం జరిగింది తప్ప పక్కవారికి ఇబ్బందులు రాలేదు. తప్పును తప్పుగా ధైర్యంగా చెప్పే గొప్ప వ్యక్తి. అదే ఆవేశమని కొందరు అనుకుంటారు. కానీ నిజానికి మోహన్ బాబుది ప్రేమించే హృదయం. ఎవ్వరూ స్పందించనటువంటి సందర్భంలో ఆయన స్పందిస్తారు. తనకు నష్టం జరిగినా పరావలేదు గానీ ఎదుటి వారికి లాభం చేకూరాలని భావించే వ్యక్తి. మంచు విష్ణు చదువు, క్రమశిక్షణ కలిగినవారు. ఇలాంటి యంగ్‌ లీడర్ వల్ల మా  మరింత ముందుకు వెళ్తుందని భావిస్తున్నా. '' అని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

  అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రానా కొత్త సినిమా.. అధికారిక ప్రకటన..

  తలసాని ప్రసంగం అనంతరం ఆయనకు శాలువా కప్పి సత్కరించారు మా సభ్యులు. ఐతే ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, కృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ పేర్లను ప్రస్తావించిన తలసాని.. ఇండస్ట్రీ పెద్దగా పేరున్న చిరంజీవి గురించి మాట్లాడకపోవడం ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఐతే చివరగా  సభా వేదికపై ఎవరి పేరైనా మరిచిపోయి ఉంటే క్షమించాలని మంత్రి తలసాని  అనడం కొసమెరుపు.
  Published by:Shiva Kumar Addula
  First published: