MAA Elections 2021 : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Movie Artists Association) ఎన్నికలు గత కొన్నేళ్లుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. అధ్యక్ష బరిలో నిలిచేవాళ్లు ఒకళ్లపై ఒకళ్లు ఆరోపణలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు ’మా’ అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్ (Prakash Raj), మంచు విష్ణు(Manchu Vishnu)తో పాటు హేమా (Hema), జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar),సీవీఎల్ నరసింహారావు (CVL Narasimha Rao) పోటీలో ఉన్నారు. చివరకు నటుడు కాదంబరి కిరణ్ (Kadambari Kiran) కూడా ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక జీవిత, హేమా ఇద్దరు ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో చేరి పెద్ద షాక్ ఇచ్చారు. వచ్చే నెల 10వ తేదిన ‘మా’ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. దీంతో బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు పోటీలో నిలిచారు. ఇక కాదంబరి కిరణ్ అధ్యక్షుడిగా పోటీ చేయడంపై ఎలాంటి అప్డేట్ లేదు. ఎన్నికల తేది దగ్గర పడుతున్న కొద్ది ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఎవరికి వారు విందు రాజకీయాలకు తెరలేపారు.
‘మా’ సభ్యుల విషయానికొస్తే.. ఇందులో పట్టుమని 1000 మంది కూడా లేరు. మరీ ముఖ్యంగా మేమంతా ఒక్కటి అంటుంటారు కానీ లోపల మాత్రం చాలా గొడవలు జరుగుతూనే ఉంటాయి. మా అసోషియేషన్ పైకి చూడ్డానికి ఒక్కటిగా కనిపిస్తున్నా కూడా లోపల మాత్రం కావాల్సినంత కొట్లాటను దాచేసుకుంటున్నారు. తాజాగా ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేస్తోన్నప్రముఖ నటుడు న్యాయవాది సీవీఎల్ నరసింహారావు తన మ్యానిఫెస్టేను విడుదల చేసారు.
Maa Elections - Prakash Raj : మా అధ్యక్షుడిగా పోటీ చేస్తోన్న ప్రకాష్ రాజ్ పై సీనియర్ సభ్యుల అసహనం..
ఇప్పటి వరకు పోటీ చేస్తున్న వాళ్ళంతా అసోసియేషన్ బాగు కోసం.. ఆర్థిక ఇబ్బందులను తొలగించడం కోసం.. అన్నింటి కంటే ముఖ్యంగా బిల్డింగ్ కట్టించడం కోసం వస్తున్నామని చెప్పారు. కానీ సివిఎల్ మాత్రం కొత్త వాదంతో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు. అదే తెలంగాణ వాదం.
కళాకారులకు ప్రాంతంతో సంబంధం లేదని.. ఇక్కడ లోకల్, నాన్ లోకల్ ఉండరని ప్రకాశ్ రాజ్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ వేర్పాటు వాదమే నినాదంగా పోటీ చేస్తున్నారు సీనియర్ నటుడు నరసింహారావు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పేరులో ఇంకా ఏపీ అనే పదం ఎందుకు ఉందని ఈయన ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. తెలంగాణ కళాకారుల కోసం పాటు పడాల్సిన సమయం వచ్చిందని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ రావాలని ఆయన బలంగా వాదిస్తున్న సంగతి తెలిసిందే కదా.
1. 2011లో ‘మా’ అధ్యక్షుడిగా ఉన్నపుడు కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేసాం. పాతికేళ్ల తర్వాత వచ్చినవారికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలనే ఆలోచన ముందు నుంచే ఉంది. నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే వాటిని అమలకు కృషి చేస్తానన్నారు.
2. హీరోయిన్ ప్రత్యూష కన్నుమూసినపుడు జయసుధ చైర్ పర్సన్‌గా ‘ఆసరా’ అనే ఆర్గనైజేషన్ షురూ చేశాం. మీడియాలో సినిమాలో ఉండే లేడీస్ పై అత్యాచారాలు, ఇతర లైంగిక వేధింపులకు గురైతే వారిని ఆదుకోవడం కోసం ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాం. దీన్ని మళ్లీ యాక్టివ్ చేయాలనుకుంటున్నాం.
3. తెలంగాణకు చెందిన నటులను మరిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అలనాటి కాంతారావు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్, ప్రభాకర్ రెడ్డి వంటి నటలును గుర్తు చేయాలని పెట్టుకున్నా.
4. ‘మా’ సభ్యత్వం పొందాలంటే రూ. లక్షల్లో ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. వాటిని FNCCలో భాగంగా నామ మాత్రపు రుసుముతో ఇచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు.
5. ‘మా’లో సభ్యత్వం లేని ఆర్టిస్టులు సినిమాల్లో యాక్ట్ చేస్తే.. ఆ మూవీ నిర్మాత మెంబర్ షిప్ కట్టి వారిని సభ్యులుగా చేయాలనే నియమం పెట్టాలనుకుంటున్నాం.
6. ’మా’ ఓటింగ్ విధానంలో పలు మార్పులు చేయాలని అనుకుంటున్నాం.
7. ‘మా’ సభ్యులు ఏదైనా విరాళాల కోసం విదేశాలకు వెళ్లేటపుడు ఫేస్ వాల్యూ ఉన్న 25 ఆర్టిస్టులు కాకుండా.. చిన్న ఆర్టిస్టులను కూడా ఫారెన్‌కు తీసుకెళ్లే అవకాశం ఇవ్వాలని కోరిక.
8. ప్రస్తుతం సమాజం పాడుకావడానికి సినిమాలే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సినిమాలు తీసే దర్శక, నిర్మాతలతోపాటు బడా హీరోలు తమ చిత్రాల్లో డ్రగ్స్, వైలెన్స్ లాంటి సన్నివేశాలను సాధ్యమైనంతగా లేకుండా జాగ్రత్త పడితే సినీ ఇండస్ట్రీపై ఉన్న ఆ మచ్చను తొలిగించుకోవచ్చన్నారు.
మొత్తంగా సీవీఎల్ బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల కంటే విభిన్నంగా గతంలో ఏవైతే ’మా’లో అమలు చేయాలని ప్రవేశపెట్టారో.. తిరిగి వాటిని పునరుద్దరిస్తామని తన మ్యానిఫెస్టెలో ప్రకటించడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CVL Narasimha Rao, Hema, Jeevitha rajasekhar, Kadambari Kiran, MAA Elections, Manchu Vishnu, Prakash Raj