తన పాటలతోనే కాదు అప్పుడప్పుడూ వివాదాలతో కూడా హెడ్ లైన్స్‌లో ఉంటాడు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా. ఎప్పుడు ఏదో ఓ కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఈయన ప్రత్యేకత. కొన్నేళ్లుగా ప్రసాద్ స్టూడియోస్ యాజమాన్యంతో ఇళయరాజాకు గొడవలు జరుగుతున్నాయి. అయితే దీనికి ఇప్పుడు తెరపడింది. అసలు విషయం ఏంటంటే అప్పట్లో ఇళయరాజా చాలా బిజీగా ఉండేవాడు. రోజుకు 20 సినిమాలు కూడా రికార్డింగ్ చేసేవాడు. అలాంటి సమయంలో ఆయన కోసం ప్రసాద్ స్టూడియో యాజమాన్యం 1976లో ప్రత్యేక రికార్డింగ్ స్టూడియో కట్టించారు. కొన్నేళ్ల క్రితం ఇరువర్గాల మధ్య వచ్చిన ఘర్షణ కారణంగా దాన్ని వెంటనే ఖాళీ చేయాల్సిందిగా ఇళయరాజాపై ఒత్తిడి పెరిగింది. ప్రసాద్ స్టూడియోస్ యాజమాన్యం ఈ విషయంపై చాలాసార్లు ఇళయరాజాను అడిగారు కూడా. కానీ దీనికి మ్యాస్ట్రో నిరాకరించాడు. ఇది తన సొత్తు అంటూ అక్కడే ఉన్నాడు. ఈ వివాదంపై రెండేళ్లుగా మద్రాసు హైకోర్టులో వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని ఎలాంటి మనస్పర్థలు లేకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని న్యాయస్థానం సూచించింది. కోర్టు తీర్పు మేరకు ఇప్పుడు ఇళయరాజా వెనక్కి తగ్గాడు.
మొన్నటి వరకు తన వాయిద్యాలు తీసుకెళ్లడానికి ససేమిరా అన్న ఇళయారాజా ఇప్పుడు మాత్రం స్టూడియోలోని తన సంగీత పరికరాలు, అవార్డులను తీసుకునేందుకు ఒప్పుకున్నాడు. అయితే అక్కడ తను ధ్యానం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఇళయరాజా న్యాయస్థానంలో మరో పిటిషన్ దాఖలు చేసాడు. ఈ ప్రతిపాదనను మొదట వ్యతిరేకించిన స్టూడియో యాజమాన్యం ఆ తర్వాత కొన్ని షరతులతో అంగీకరించింది. ఏదో ఒక రోజు ఉదయం 9 నుంచి సాయత్రం 4 గంటల వరకు ధ్యానం చేసుకుని సంగీత పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతించాలని యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది.
ఈ ఆదేశాల మేరకు ఇళయరాజా డిసెంబర్ 29 ఉదయం ప్రసాద్ స్టూడియోకు వస్తారని ప్రకటన విడుదలైంది. చెప్పిన సమయానికి ఇళయరాజా, స్టూడియో తరఫు న్యాయవాదులు వచ్చారు. అయితే అక్కడ తనకు జరిగిన అవమానం తట్టుకోలేని రాజా.. సంగీత పరికరాలు తీసుకెళ్లేందుకు తన సహాయకులను పంపాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత చూస్తే ఇళయరాజా వినియోగించే రికార్డింగ్ థియేటర్ తలుపులు పగులగొట్టి అందులోని పరికరాలను మరో గదిలోకి తరలించి ఉన్నాయి. ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఇళయరాజా మరింత మనస్తాపానికి లోనయ్యాడని తెలుస్తుంది. అందుకే ఈయన లోపలికి కూడా రాలేదు. ఏదేమైనా కూడా కొన్నేళ్ల పాటు సాగిన వివాదం ఇలా ముగిసిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ilaiyaraaja, Telugu Cinema, Tollywood