సౌందర్య.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న మహానటి ఈమె. ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే ఎలా ఉంటుందో సినిమాల్లో మాత్రమే చూసారు. కానీ నటన పరంగా చూసుకుంటే ఆ సావిత్రి అచ్చంగా ఇలాగే ఉండేదేమో అనేంతగా సౌందర్య అందర్నీ మాయ చేసారు. కానీ దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది ఈమె. సరిగ్గా 16 ఏళ్ల కింద ఎప్రిల్ 17, 2004న సౌందర్య మరణించారు. అప్పటికి ఈమె వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే.. పైగా పెళ్లై ఏడాది కూడా కాకముందే ఆమె మరణించడం నిజంగానే విషాదం నింపేసింది.
ఈమె భౌతికంగా దూరమై 16 ఏళ్లు గడిచినా కూడా ఇంకా సౌందర్య అంటే ప్రేక్షకుల మనసుల్లో అలాంటి స్థానమే ఉంది. 100కు పైగా సినిమాల్లో నటించిన సౌందర్యకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అభిమానులున్నారు. పేరుకు కన్నడ కస్తూరి అయినా కూడా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది ఈమె. అప్పట్లోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న సౌందర్యకు ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయంటారు. అప్పటి లెక్క ప్రకారమే దాదాపు 100 కోట్ల ఆస్తులు సౌందర్యకు ఉన్నట్లు అప్పట్లో కుటుంబ సభ్యులే చెప్పారు.
ఇక ఇప్పటికీ ఈమె ఆస్తులపై గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తన సోదరుడు అమరనాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు సౌందర్య. అయితే ప్రమాదంలో ఇద్దరూ ఒకేసారి మరణించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. ఇప్పటికీ సౌందర్య ఇంటి నుంచి ఆమె స్థాపించిన కొన్ని విద్యాలయాలకు నిధులు వెళ్తూనే ఉన్నాయి. సౌందర్య చనిపోయిన కొన్ని నెలలకే కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఆమె ఆస్తి కోసం భర్త రఘు కూడా చాలా ప్రయత్నాలు చేసాడు.
తాను చనిపోయే ఏడాది ముందే అంటే 2003 ఫిబ్రవరి 15న సౌందర్య వీలునామా రాశారని.. అందులో ఉన్నదాని ప్రకారమే తమకు కూడా ఆస్తులు పంచాలని అమర్ నాథ్ భార్య నిర్మల.. ఆమె కుమారుడు సాత్విక్ 2009లో బెంగళూరులోని మెజిస్టేట్ కోర్టును ఆశ్రయించారు. అయితే సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని.. నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల, రఘు కోర్టుకు విన్నవించారు. అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తూనే ఉంది.
తన అత్త మంజుల, వరుసకు సోదరుడు అయిన రఘు తనపై కక్షసాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలు చేసింది. సౌందర్య రాసిన వీలునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల న్యాయవాది ధనరాజ్, సౌందర్య భర్త రఘు, ఆమె తల్లి మంజులపై పరువు నష్టం కేసు వేశారు. ఈ వివాదాలతో ఇంత కాలం వీరు కోర్టు చుట్టు తిరిగారు. 2013 డిసెంబర్ 3వ తేదీన రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తానికి సౌందర్య చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆస్తుల కోసం చాలా వరకు వివాదాలు జరిగాయి. ఏదేమైనా కూడా సౌందర్య లాంటి నటి మరొకరు రారని మాత్రం అంతా ఒప్పుకుని తీరాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Soundarya, Telugu Cinema, Tollywood