లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలై అప్పుడే మూడు రోజులు గడిచిపోయింది. నాలుగో రోజు కూడా ఈ చిత్రం చాలా చోట్ల తెలంగాణలో మంచి వసూళ్లను తీసుకొస్తుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు మూడు రోజుల్లో ఈ చిత్రం దాదాపు 10 కోట్లకు పైగా గ్రాస్.. 5.68 కోట్ల షేర్ వసూలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ చిత్రంపై ఉన్న అంచనాలకు.. విడుదలైన థియేటర్లకు ఇది చాలా ఎక్కువ మొత్తం. పైగా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా విడుదల కాలేదు. అంటే కేవలం తెలంగాణ, ఓవర్సీస్ కలెక్షన్లు మాత్రమే మూడు రోజుల్లో 6 కోట్ల వరకు వసూలు చేసింది ఈ చిత్రం.
ఎన్టీఆర్ మహానాయకుడు ఫుల్ రన్ వసూళ్లు రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి కనీసం 5 కోట్లు కూడా దాటలేదు. ఇలాంటి సమయంలో ఈ చిత్రం ఏకంగా 6 కోట్లు మూడు రోజుల్లో.. అది కూడా కేవలం తెలంగాణలో మాత్రమే రావడంతో వర్మ సినిమా అంటే ఏంటో మరోసారి ప్రూవ్ అయినట్లయింది. తాను ఏ ఉద్దేశంతో అయితే సినిమా తెరకెక్కించాడో.. అది నెరవేరిందని పండగ చేసుకుంటున్నాడు వర్మ. దానికి తోడు ఆన్ లైన్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒరిజినల్ ప్రింట్ విడుదలైందనే ఊహాగానాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇవన్నీ ఉన్నా కూడా సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతుంది. ఏపీలో ఇప్పుడు విడుదలైనా పెద్దగా ఇంపాక్ట్ ఉండదని భావిస్తున్న చిత్రయూనిట్.. ప్రమోషన్స్ చేసుకుని ఎప్రిల్ 5న మజిలీ సినిమా వచ్చే లోపు ఇంకొన్ని కోట్లు వెనకేసుకోవాలని చూస్తున్నారు. మరి అప్పటి వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్ని వసూలు చేస్తుందో చూడాలిక. ఏదేమైనా ఈ చిత్రం మహానాయకుడు కలెక్షన్లు దాటడం మాత్రం విశేషమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Box Office Collections, Lakshmis NTR, NTR Mahanayakudu, RGV, Telugu Cinema, Tollywood