ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ తర్వాత భారీ మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ టాలీవుడ్. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ సినిమాలకు ధీటుగా మనవాళ్లు ప్యాన్ ఇండియా సినిమాలను రూపొందిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కొత్త కాన్సెప్ట్ చిత్రాలు వస్తున్నాయి. అయితే ఇతర సినీ రంగాలతో పోల్చితే టాలీవుడ్లో హీరో వర్షిప్ ఎక్కువ ఇది ఎవరూ కాదనలేని నిజం. అందుకనే హీరోలు మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. ఒకవేళ చేసి ఏదైనా తేడా కొడితే అభిమానుల మధ్య గొడవలు పెట్టేసినవాళ్లవుతామని హీరోలు సోలోగానే సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇప్పుడిప్పుడే ఒరవడి మారుతుంది. మల్టీస్టారర్ సినిమాలు పెరుగుతున్నాయి.
ఈ విషయాన్ని పక్కన పెడితే ఒకప్పుడు హీరోలకు ఆదరణ ఉండేది. ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్‌లకు మాస్ ఇమేజ్ ఉన్నా కూడా అప్పట్లో హీరోయిన్ అయిన సావిత్రి పేరుని ముందు వేస్తే పట్టించుకునేవాళ్లు కాదు. కానీ క్రమంగా హీరో వర్షిప్ పెరిగింది. దీంతో హీరోలు ప్రతి చిన్న విషయంలో పర్టికులర్‌గా ఉండేవాళ్లు. సింపుల్‌గా చెప్పాలంటే పోస్టర్స్‌లోని పేర్లు, టైటిల్ కార్డ్స్‌లో వేసే పేర్లలో తమ పేరు ముందు ఉండాలని పట్టుబట్టేవాళ్లు. అంత ఇగోలుండేవి. ఇలాంటి పరిస్థితి ఇద్దరి హీరోల మధ్య క్రియేట్ అయ్యింది. అసలు విషయమేమంటే.. కృష్ణంరాజు, సుమన్ హీరోలుగా నటించిన చిత్రం లీడర్. ఈ సినిమా సమయంలో హీరో సుమన్ మంచి క్రేజ్మీదున్నాడు. అందుకని ఈయన పేరుని ముందు వేశారు. ఇది తెలిసితాను సీనియర్ హీరో, తన అభిమానులు ఫీల్ అవుతారని భావించిన కృష్ణంరాజు అలిగి సెట్స్ నుండి వెళ్లిపోయాడు.
చివరకు విషయం దర్శకుడు పి.ఎన్.రామచంద్రరావు, నిర్మాతలకు తెలిసింది. అలాగే సుమన్ వరకు కూడా విషయం చేరింది. వెంటనే స్పందించిన సుమన్..కృష్ణంరాజు పేరునే ముందుండాలని చెప్పడంతో విషయం వివాదం కాకుండా ఆగింది. దర్శక నిర్మాతలు కృష్ణంరాజుకు సారీ చెప్పి.. షూటింగ్‌కి వచ్చేలా చూసుకున్నారు. ఇదే కాదు.. అప్పట్లో కృష్ణ, శోభన్‌బాబు అభిమానులు కూడా ఇలాంటి విషయాలపై గొడవలు పడేవాళ్లు. అందుకనే వారి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకునే అప్పట్లో దర్శక నిర్మాతలు సన్నివేశాలను రాసుకునేవారు. ఇలా జరిగిన సందర్భాలు తెలుగు సినిమాల్లో కోకొల్లలు. అందుకనే అప్పట్లో రామానాయుడు ముందడుగు సినిమాలో హీరో పేర్లను వేయకుండా అందరూ మీ అభిమాన నటీనటులే అని వేసి తెలివిగా తప్పించుకున్నారు. తర్వాత ఎందుకొచ్చిన గొడవలంటూ హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేయడం మానేశారు. కానీ ఇప్పుడు ప్రేక్షకుడు సినిమా చూసే తీరు మారుతుండటంతో మళ్లీ మల్టీస్టారర్ సినిమాలు పురుడుపోసుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Krishnam Raju, Suman, Telugu Movie, Telugu Movie News