Director Krish: పవర్ స్టార్ పవన్ కల్యాణ్- వైవిధ్య దర్శకుడు క్రిష్ మూవీ షూటింగ్ మళ్లీ వాయిదా పడింది. ఇటీవలే వకీల్ సాబ్ షూటింగ్‌ని పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్.. క్రిష్ మూవీలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో క్రిష్ కూడా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నారు. మరోవైపు సెట్స్ పనులు కూడా పూర్తి అయ్యాయి. అందులో భాగంగా సోమవారం నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రిష్ పరీక్షలు చేయించుకున్నారు. అందులో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే ఆయన సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లడంతో షూటింగ్ మరోసారి వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. ఆయన కరోనా నుంచి కోలుకున్న తరువాత మూవీ షూటింగ్ గురించిన అప్డేట్ రానున్నట్లు సమాచారం.
అయితే పవన్, వకీల్ సాబ్ షూటింగ్లో ఉన్న సమయంలో క్రిష్.. వైష్ణవ్ తేజ్‌తో ఓ మూవీని తెరకెక్కించారు. 40 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్‌ని పూర్తి చేశారు క్రిష్. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించగా.. మూవీ షూటింగ్ పూర్తైన తరువాత ఆమెకు కూడా పాజిటివ్‌గా తేలింది. అయితే కరోనాను జయించిన రకుల్.. మళ్లీ షూటింగ్‌ల్లో బిజీ అయ్యారు. కాగా టాలీవుడ్లో ఇటీవల రామ్ చరణ్, వరుణ్ తేజ్‌లకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. వారు ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. ఇక వరుసగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినీ ప్రముఖులు మరింత అప్రమత్తమైనట్లు సమాచారం. షూటింగ్‌ల్లో మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.