టాలీవుడ్‌లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుది సుదీర్ఘ ప్రస్థానం. మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో కోవెలమూడి సుర్యప్రకాశ రావు దంపతులకు జన్మించిన ఈ రాఘవేంద్రుడు నేటితో 80 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తన పుట్టినరోజున 'నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు రాఘవేంద్ర రావు. సినిమాపై ఉన్న ప్రేమతో ఆయన స్వహస్తాలతో రాసిన పుస్తకం పేరే 'నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ'. ఈ బుక్ లాంచ్ తాలూకు వీడియోను కూడా తెలుగు ప్రేక్షకులతో పంచుకున్న రాఘవేంద్రుడు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
రాఘవేంద్ర రావు సినీ ఈ ప్రస్థానమే ఓ చరిత్ర అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందరో హీరో హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేసి వారి వారి కెరీర్‌ని మలుపుతిప్పుతూ స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టిన ఘనత ఆయనది. వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలు రాఘవేంద్ర రావు సినిమాలతోనే హీరోలుగా పరిచమయ్యారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోల కెరీర్‌లో ఆయన కీలక భూమిక పోషించారు. తనకు మాత్రమే సాధ్యం అనేలా ఎన్నో కుటుంబ కథా చిత్రాలను రూపొందించి తెలుగు చిత్ర పరిశ్రమకు ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు.
ఇన్నాళ్లు శతాధిక చిత్రాల దర్శకుడిగా తన మార్క్ చూపిస్తూ ప్రేక్షక మన్ననలు పొందిన రాఘవేంద్ర రావు ఇప్పుడు కలం పట్టారు. 'నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ' అనే పేరుతో ఓ బుక్ రాశారు. తన స్వహస్తాలతో రాసిన ఈ పుస్తకంలో తన సినీ ప్రయాణం తాలూకు జ్ఞాపకాలు, అనుభవాలు పొందుపరిచారట. ఈ పుస్తకాన్ని ఇటీవలే భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్. వెంకటరమణ అభినందనలతో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తి ఆవిష్కరించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ బుక్ తాలూకు విషయాలు చెప్పారు రాఘవేంద్రుడు.
నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ....
Book launch https://t.co/0seDW1gA0Y
— Raghavendra Rao K (@Ragavendraraoba) May 22, 2022
శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన అనుభవంతో ఈ పుస్తకం రాశాను. 1963లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆ రోజు ఇంకా నా కళ్లముందే ఉంది. అప్పటినుంచి ఇప్పటిదాకా సినీ జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలు, అనుభవాలు, అనుభూతులు అన్నీ కలగలుపుతూ తర్వాతి తరాలకు హెల్ప్ అయ్యేలా ఈ పుస్తకం రాశాను. ఏదీ కప్పిచెప్పకుండా చాలా ఓపెన్‌గా ఈ పుస్తకం రాశాను. తీపి, కారం మిక్స్ చేస్తూ ఎన్నో విషయాలను ప్రస్తావించాను. అబద్దాలు రాయడం అనర్థం, నిజాలు రాయడానికి భయం అంటూ మనసు పెన్‌తో ఈ బుక్ రాశాను. 48 ఏళ్ల సినీ ప్రయాణం గురించి ఎంతని చెప్పాలి. ఏమని చెప్పాలి. అందుకే 80 ఏళ్ల వయసులో నా జీవిత ప్రయాణాన్ని నెమరు వేసుకోవాలనే ఉద్దేశ్యంలో ఈ పుస్తకం రాశాను అని రాఘవేంద్ర రావు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.