కరోనా బెడద నుంచి కాస్తంత కోలుకున్న తర్వాత సినిమా థియేటర్లు ఈ మధ్యే తెరుచుకున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో సినిమాలను ఓటీటీలో చూసేందుకు అలవాటు పడ్డ జనం థియేటర్లు తెరిచినా.. ఇప్పట్లో వాటి వైపు చూడరనే ప్రచారం కూడా జరిగింది. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల మీద నమ్మకంతో ఆగస్ట్ 6న థియేటర్లలో విడుదలైన తొలి తెలుగు సినిమా ‘S.R కళ్యాణ మండపం’. తండ్రీకొడుకు సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఆశించిన స్పందనే రావడం విశేషం. ధైర్యం చేసి థియేటర్లలో విడుదల చేసినందుకు మంచి వసూళ్లనే రాబట్టింది. సినిమాలోని లిరికల్ సాంగ్స్ యూట్యూబ్‌లో సూపర్ హిట్ కావడం.. ట్రైలర్ కూడా వినోదాత్మకంగా ఉండటంతో కుర్రాళ్లు సినిమాకు బాగానే వెళ్లారు. ఈ సినిమాకు లాభాలు స్వల్పంగానే వచ్చినప్పటికీ నష్టాలు మాత్రం రాలేదు. త్వరలో ‘S.R కళ్యాణ మండపం’ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫాం ‘ఆహా’ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. త్వరలో ‘S.R కళ్యాణ మండపం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ‘ఆహా’ ప్రకటించనుంది. ఈ నెలాఖరులో ఓటీటీ వీక్షకులకు ఈ సినిమా అందుబాటులోకి రానుందనే ప్రచారం జరుగుతోంది.
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన ఈ సినిమాకు ప్రమోద్, రాజు నిర్మాతలుగా వ్యవహరించారు. ‘ప్రీ రిలీజ్ ఈవెంట్’కు బాగానే ఖర్చు చేశారు. హీరో రాజశేఖర్, జీవిత, అల్లరి నరేష్, ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హాజరై సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ ఆ ఊపును కొనసాగించలేకపోయింది. సినిమా యూనిట్ ‘బ్లాక్‌బస్టర్ హిట్’గా ప్రచారం చేసుకున్నప్పటికీ ఓకే అనిపించుకున్న సినిమాగానే ‘S.R కళ్యాణ మండపం’ చివరకు గట్టెక్కింది. ఇటీవల విడుదలైన విశ్వక్సేన్ ‘పాగల్’ సినిమా ప్రభావం కూడా ఈ సినిమా వసూళ్లపై కొంత పడింది. ఆగస్ట్ 27న ఆహాలో ‘S.R కళ్యాణ మండపం’ విడుదల కానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సినిమా విడుదలై నెల తిరగకుండానే ఓటీటీలో కిరణ్ అబ్బవరం సినిమా విడుదల అవుతుండటం గమనార్హం.
అయితే.. ఇలా థియేటర్లో విడుదలైన నెల లోపే ఓటీటీలో సినిమాలు విడుదల కావడం ఇది కొత్తేమీ కాదు. శ్రీవిష్ణు, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘గాలి సంపత్’ అనే సినిమా కూడా థియేటర్లలో విడుదలై.. ప్లాప్ టాక్‌ను మూటగట్టుకుని 20 రోజుల వ్యవధిలోనే ఓటీటీలో విడుదలైంది. ఓటీటీలో కూడా ఫలితం ఏమాత్రం మారలేదు. ఇక.. ఇతర దక్షిణాది భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్న ‘ఆహా’ ‘S.R కళ్యాణ మండపం’ చాన్నాళ్ల తర్వాత విడుదలవుతున్న స్ట్రయిట్ మూవీ కావడం విశేషం. థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న రవితేజ ‘క్రాక్’ సినిమా, డైరెక్ట్ ఓటీటీ సినిమా అయిన సుహాస్ ‘కలర్ ఫొటో’ సినిమాలు ‘ఆహా’లో విడుదలై ఆశించిన విధంగానే సత్తా చాటాయి. ‘S.R కల్యాణ మండపం’ సినిమాను ఓటీటీలో ఎలా ఆదరిస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aha app, Aha OTT Platform, Kiran abbavaram, Priyanka jawalkar, Sr kalyanamandapam