ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకోవడం చూస్తున్నాం. ఎంతో భవిష్యత్ ఉన్న సినీ తారలు కన్నుమూస్తుండటంతో ఇండస్ట్రీ అంతా కూడా విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. మొన్నటికి మొన్న టాలీవుడ్ నటుడు తారకరత్న మరణం యావత్ సినీ లోకాన్ని కలచి వేసింది. ఇంతలోనే తాజాగా యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ (Joseph Manu James) కన్నుమూశారు.
కేరళ రాష్ట్రానికి చెందిన యువ నిర్మాత మను జేమ్స్ అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు కేవలం 31 సంవత్సరాలు. గత కొని రోజులుగా జాండీస్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన.. గత రాత్రి మృతి చెందారు. ఆయన మృతితో మలయాళ చిత్ర సీమలో విషాదం అలుముకుంది. ఆయన నిర్మించిన తొలి సినిమా నాన్సీ రాణి విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇంతలోనే మను జేమ్స్ మరణించడం బాధాకరం.
మను నిర్మిస్తున్న తొలి చిత్రం నాన్సీ రాణిలో అహనా కృష్ణ, ధ్రువన్, అజు వర్గీస్, లాల్ నటించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సమయంలో చిత్ర దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ మరణం రూపంలో బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది.
జోసెఫ్ మను జేమ్స్ బాలనటుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. సాబు జేమ్స్ దర్శకత్వంలో 2004లో విడుదలైన అయామ్ క్యూరియస్ సినిమాలో ఆయన నటించారు. ఆ తర్వాత మలయాళం, కన్నడ, బాలీవుడ్ చిత్రాలలో అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 3.00 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన భార్య నైనా మను జేమ్స్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.