Kathika Deepam: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ మరింత రసవత్తరంగా మారింది. కార్తీక్ ప్రేమించిన హిమ.. యాక్సిడెంట్లో చనిపోలేదని, దారుణంగా హత్య చేయించారన్న నిజాన్ని దీప, కార్తీక్‌కి చెబుతుంది. ఇక ఇదే విషయాన్ని కార్తీక్, మౌనిత దగ్గర చెప్పగా.. టెన్షన్‌కి గురి అవుతుంది. ఇక అటు దీప చెప్పిన విషయం, ఇటు మౌనిత మాటలతో ఏం అర్థం కాని కార్తీక్.. ఢీలాగా ఇంటికి వెళతాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్లో కార్తీక్‌ని చూసి సౌందర్య.. ఏమైందిరా అని అడుగుతుంది. ఇంకా అఙ్ఞానమనే అంధకారంలోనే కొట్టుకుపోతున్నాను మమ్మీ అని అంటాడు. ఎందుకిలా మాట్లాడుతున్నావు కార్తీక్ అని సౌందర్య అడగ్గా.. ఙ్ఞానులతో, విఙ్ఞులతో ఇంతకన్నా ఏం మాట్లాడగలను మమ్మీ అంటాడు. ఇదంతా ఏంటి..? ఇప్పుడు ఎవరిని దోషిగా నిలబెట్టి మాట్లాడాలనుకున్నావు అని అక్కడికి వచ్చిన ఆనందరావు ప్రశ్నిస్తాడు. దోషులు ఎవరు ఇక్కడ...? అందరూ దొరలేనన్న కార్తీక్.. అయినా ఎవరు ఏంటి అన్నది తెలిస్తే ఎవరో వచ్చి ఏదో ఎందుకు చెప్తారు..? నేనేందుకు నమ్మేస్తాను అని కార్తీక్ అంటాడు. ఎవరు చెప్పారు..? ఏం చెప్పారు..? అని ఆనందరావు అనగా.. చెప్పిన మాటలా..? చెప్పుడు మాటలా..? అని సౌందర్య అంటుంది.
వెంటనే కార్తీక్.. నాకు తెలుసు మీ దృష్టిలో చెప్పిన మాటలకు నిలువెత్తు సాక్ష్యం వంటలక్క అని.. చెప్పుడు మాటలకు బ్రాండ్ అంబాసిడర్ మౌనిత అని.. ఇప్పుడు నేను చెప్పిన మాటలే విన్నాను, చెప్పుడు మాటల గురించి మీరు ఆలోచించకండి అని అంటాడు. దీప నీ దగ్గరకు వచ్చిందా..? అని సౌందర్య అడగ్గా.. వచ్చింది సర్వాంతర్యామి కదా.. అక్కడ,ఇక్కడ ఎక్కడెక్కడో ఉండగలదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లాగా తిరగగలదు. ఎలకను పట్టడానికి కొండను తవ్వగలదు అని అంటాడు. దానికి సౌందర్య.. ఇప్పుడు ఏం తవ్వింది అని ప్రశ్నించగా.. నా గతాన్ని అని కార్తీక్ అంటాడు. ఏం దొరికింది అని సౌందర్య అడగ్గా.. శూన్యం అని కార్తీక్ అంటాడు. కాకమ్మ కథల్లాగా ఏవో కాక్ అండ్ బుల్ స్టోరీలు చెప్పడానికి వచ్చింది. ఆ కథ కంచికి వెళ్లింది. నేను ఇంటికి వచ్చాను అని కార్తీక్ చెబుతాడు.
ఏమైంది అన్నయ్య..? ఎందుకలా మాట్లాడుతున్నావు..? అని అడిగిన ఆదిత్య.. సరే వదిన గురించి వదిలేసేయ్ అని అనగా.. వెంటనే కార్తీక్.. వదిననే వదిలేశాను. దాని సంగతి నాకెందుకురా. కానీ అదే వదల్లేదు. సాలిగూడు అల్లినట్లు అల్లుకుంటూ పోతోంది. పడతానేమోనన్న వెర్రి ఆశ అంటాడు. అవును ఆ ఆశే దాన్ని బతికిస్తోంది అని సౌందర్య అనగా.. ఇంకెన్నాళ్లు అలానే బతుకుతుంది...? అని కార్తీక్ అడుగుతాడు. ఆ ఆశను నిజం చేసుకునే టైమ్ వచ్చింది అని సౌందర్య చెబుతుంది. అంటే ఏం చేయబోతోంది..? తిరుగుబాటు మొదలుపెడుతుందా..? విప్లవం లేవదీస్తుందా..? ప్రజల్లో చైతన్యం పెంచి ప్రభంజనంలా మీద పడుతుందా..? అని అంటాడు. వెంటనే సౌందర్య స్త్రీ శక్తి ఏమైనా చేయగలదు అని అంటుంది.
అవునా ఒకటి అడుగుతా చెబుతావా మమ్మీ.. ఇది నీ సమస్య..? స్త్రీ సమస్య..? ఇది దాని సమస్య..? మొత్తం స్త్రీ సమస్యసా..? ఒకవేళ స్త్రీల హక్కుల కోసం జరిగే పోరాటం అయితే అదంతా నా ముందర ఎందుకు మమ్మీ.. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక ఉంటుంది. అత్తా కోడళ్లు అభిమాన సంఘాలను తీసుకెళ్లి ఒక టెంట్ వేసి అక్కడ ధర్నా చేయండి. స్త్రీ జనోద్ధారణ కోసం నడుము బిగించిన అత్తా కోడళ్లుగా పిడికిలి ఎత్తి, కనుబొమ్మలు పైకెత్తి పురుషాధిక్యతను ఎండగట్టి స్త్రీ శక్తిని ఎలిగెత్తి చాటండి. కానీ చిన్న రిక్వెస్ట్.. లేదు ఇది నా సమస్య అంటారా..? అయితే నాతోనే మాట్లాడండి. నన్ను మాట్లాడనివ్వండి. సత్యం గొంతు నొక్కి నిజం కావాలనుకోవడం కరెక్ట్ కాదు. అబద్దాన్ని ప్రచారం చేస్తూ అన్యాయం అనడం కరెక్ట్ కాదు అని కార్తీక్ అంటాడు. వెంటనే సౌందర్య.. నువ్వు కళ్లు మూసుకొని మాట్లాడుతున్నావు..? ఎదురుగా ఉన్నది మీ అమ్మ. సత్యం గొంతు నొక్కి, అబద్ధాన్ని ప్రచారం చేసే తప్పుడు మనిషిని నీకు అంటగట్టాలని ఏ తల్లి కోరుకోదు. ఎంత స్త్రీ హక్కుల కోసం పోరాడే స్త్రీ అయినా అందుకు ఒప్పుకోదు అని చెబుతుంది. ఈ ఫ్రస్టేషన్ అంతా ఏంటి రా.. వచ్చి ప్రశాంతంగా భోజనం చేయ్ అని ఆనందరావు అంటాడు.
వెంటనే కార్తీక్.. ఎక్కడ దొరుకుతుంది డాడీ అనగా.. ఏంటి అని ఆనందరావు అడుగుతాడు. ప్రశాంతత.. నేను అక్కడికి వెళితే దొరుకుతుందా..? అది ఇక్కడకు వస్తే దొరుకుతుందా..? నేను ఎక్కడికైనా వెళితే దొరుకుతుందా..? అని అంటాడు. దానికి సౌందర్య.. నీ ఆవేదన అఙ్ఞానం అనే సుడిగుండంలో పడి అక్కడక్కడే తిరుగుతోందిరా.. నీలో నువ్వే బాధపడి, మదనపడి, ఆవేశపడి, ఆరాటపడి, పడి, పడి, నైరాశ్యంలో పడి, దుఃఖపడి, నీ మీద, మా మీద, మనసులందరి మీద విరక్తిని పెంచుకుంటున్నావు. ఇది ప్రమాదకరమైన జాఢ్యం. ఈ జాఢ్యాన్ని వదిలించుకో. జీవితాన్ని ప్రేమించడం నేర్చుకో. మనుషులను నమ్మడం మొదలుపెట్టు. నీకు మళ్లీ ప్రపంచం పవిత్రంగానే కనిపిస్తుంది. లోకమంతా నా సుపుత్రుడి మనసంత స్వచ్ఛంగా కనిపిస్తుంది అని అంటుంది. దానికి నవ్విన కార్తీక్.. పవిత్రత ప్రపంచంలో ఉంది మమ్మీ.. నాకు కావాలసిన చోటే లేదు. స్వచ్ఛత నాలో ఉందని నీకు తెలిస్తే నా మనసు కూడా నీకు తెలిసే ఉండాలిగా మరి అని అంటాడు.
వెంటనే శ్రావ్య.. అత్తయ్యా ఇప్పుడు అవన్నీ ఎందుకు..? రండి అందరం కలిసి భోజనం చేద్దాం. రండి బావగారు అని పిలుస్తుంది. దానికి కార్తీక్.. వద్దమ్మా నువ్వు దీపుగాడిని సరిగా చూసుకోచాలు. కనీసం నువ్వు అయినా నీ కొడుకును సరిగా పెంచు. మా అమ్మ లాగా సుపుత్రుడిని చేయకు. ఉత్త పుత్రిడిలా ఉన్నా చాలు.. మీ ఆయనలా ప్రశాంతంగా ఉంటాడు. సుపుత్రులకు ఏం ఒరగదు. బిరుదులు, సన్మానాలు లభిస్తాయేమో కాని మనిషిగా ఎవరికీ నచ్చడు అని అంటాడు. వెంటనే సౌందర్య నీకు ఏదో అయ్యిందిరా అని అనగా.. అవును కొన్నేళ్ల క్రితం యాక్సిడెంట్ అయ్యింది. ఇవాళ ఎందుకో గుండెలో ఆ శబ్దం వినబడుతోంది. అది చావు కేకో..? ఆర్థనాధమో..? ఏంటో..? అని బాధపడుతూ పైకి వెళతాడు. ఇక కార్తీక్ మాటలకు సౌందర్య ఏడుస్తుంది.
మరోవైపు ఇంటికి వెళ్లిన దీప.. సౌర్య, హిమలను పిలుస్తుంది. ఇదుగో మీ కోసం ఏం తీసుకొచ్చానో చూడండి అని స్వీట్ బాక్స్ తీస్తుంది. ఇవాళ ఏంటి స్పెషల్ అని హిమ అడగ్గా.. మనమందరం కలిసే దాకా స్పెషల్ ఏం ఉండదమ్మా.. తల్లి బయటకు వెళితే వచ్చేటప్పుడు పిల్లల కోసం ఏదైనా తీసుకురావడం మామూలే.. బయటకు వెళితే అమ్మ ఏం తీసుకొస్తుందోనని అందరూ ఎదురుచూస్తుంటారు.. కానీ నా పిల్లలు అమ్మ త్వరగా వస్తే చాలు అనుకుంటారు అని చెబుతుంది. ఇక వాటిని తిన్న సౌర్య, హిమ ఇద్దరు బావున్నాయి అంటారు.
ఇక ఇవాళ ఏంటమ్మా.. ఎప్పటిలాగా దిగులుగా లేవు అని సౌర్య అడగ్గా.. అవునమ్మా చాలా హ్యాపీగా ఉన్నావు, నాన్న కలిశాడా..? అని హిమ అడుగుతుంది. వెంటనే కార్తీక్‌కి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకునే దీప.. చాలా దైర్యం చేసి చెప్పాను. ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను చెప్పానని పెడ చెవిన పెట్టకుండా, లోతుగా ఆలోచిస్తే బావుండు.. మౌనిత విషయం బయట పడుతుంది. నా జీవితంలో ముందు ఆ పీడ విరుగుడు అయితే నేను నిర్దోషిని అని నిరూపించుకోవడం సులువు అవుతుంది.. అదే జరిగిన రోజు నేను, నా పిల్లలు, ఆయన అందరం కలిసిపోవచ్చు.. ఆహా ఊహ ఎంత బావుంది అని దీప మనసులో అనుకుంటుంది. ఏంటమ్మా నీలో నువ్వే సంతోషపడుతున్నావు అని సౌర్య అడగ్గా.. ఏం లేదమ్మా.. ఊహలు బావుంటాయి. ఆ ఊహలు నిజమైన రోజు మనిషికి రెక్కలు వచ్చి గాల్లో తేలిపోతున్నట్లు ఉంటుంది అని దీప అంటుంది. అర్థం కాలేదని హిమ అనగా.. ఏం లేదమ్మా.. మనకు మంచి రోజులు వస్తే ఆ మంచి ఎలా ఉంటుందో మీకన్నా నాకు బాగా తెలుసు. ప్రపంచంలోని అబద్ధాలన్నీ అంతరించిపోయి, ఒక నిజం మాత్రం బతికే రోజు వస్తే ఆ రోజును చూడాలని ఉబలాటంగా ఉంది. సమస్యలన్నీ దూరం అయిపోయి, అంతా ఒక్కటి అయిపోయి, సమిష్టిగా ఉండే రోజు వస్తే ఆ రోజు ఎంత బావుంటుందో నాకు కుతూహలంగా ఉంది. ఎందుకో ఇవాళ మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తోంది. ఏదో ఆశ కొలనులో పద్మంలా వికసిస్తోంది అని దీప అంటుంది. వెంటనే హిమ.. అమ్మా నువ్వు కవిత్వం చెబుతున్నావు. కవిత్వం అంటే డాడీకి ఇష్టం ఉండదని నువ్వేగా అన్నావు అని అంటుంది.
అవును నిజమే.. మీ డాడీకి ఇష్టం లేనిది నాకు మాత్రం ఎందుకు ఇష్టం అవుతుంది..? బాగా గుర్తుచేశావమ్మా.. నేను ఇవాళ్టి నుంచి మనకు పనికిరానివి ఏం మాట్లాడను అని దీప అంటుంది. అమ్మా ఏమైందమ్మా నీకు.. ఇప్పుడే సంతోషంగా ఉన్నావు. ఇప్పుడే దిగులుగా మారిపోయావు ఎందుకమ్మా నీకు అని సౌర్య అడగుతుంది. కాసేపు చీకటి, కాసేపు వెన్నెల.. కాసేపు వెలుగు, కాసేపు శూన్యం.. అదేంటో వెర్రి మనసు. కానీ ఒక్కటి చంద్రుడిని మబ్బులు కమ్మేసినంత మాత్రానా అది అమావాస్య కాదు. తినండి అని చెబుతుంది. ఇక మనసులో నేను చెప్పిన నిజాన్ని డాక్టర్ బాబు కచ్చితంగా మౌనితతో చెబుతాడు. అప్పుడు మౌనిత ఆ నిజాన్ని కచ్చితంగా అబద్దంగా మార్చకూడదు అని అనుకుంటుంది.
ఇక ఇంట్లో మౌనిత అటూ ఇటూ తిరుగుతూ.. కార్తీక్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏంటి.. ఇన్ని సంవత్సరాలు సమాధి అయిన నిజం ఇప్పుడు దెయ్యం అయి పట్టి పీడించబోతోందా..?ఆ అంజిని నేను చాలా తక్కువ అంచనా వేశాను. వాడు ఎప్పటికీ కనిపించకుండా ఉండాల్సింది. చాలా మొండిగా వెళ్లాను. వాడు ఆ దీపకు చెప్తాడనుకోలేదు. ఇక చాలు, చాలు.. ఆ దీపకు నా పూర్తి నిజ స్వరూపం తెలిస్తే నా పరిస్థితి ఏంటి..? ఎవరు ఏది చెప్పినా కార్తీక్ నమ్మడు కానీ రేపటి రోజు నమ్మితే.. దీపకు చెప్పిన వాడు కార్తీక్‌కి చెప్పడని గ్యారెంటీ ఏంటి..? ఆ అంజిని ఏదో ఒకటి చేయాలి..? ఆ దుర్మార్గుడిని మాయం చేస్తా.. కానీ అదంతా ఈజీ కాదు. అయినా అంజిని తప్పించడం తప్పా మరో మార్గం లేదు అని అనుకుంటుంది.
ఇక దేవుడికి మొక్కే దీప.. స్వామి నా భర్త నీలాగే దేవుడు. కానీ నీ లాగే పలకడు, మీరెప్పుడు వరాలిస్తాడో తెలీదు, నా భర్త ఎప్పుడు కరుణిస్తాడో తెలీదు. అసలు నా పెళ్లి గురించి మా వాళ్లు ఎవ్వరూ పట్టించుకోలేదు. నన్ను చేసుకోవడానికి ఎవరు వస్తారులే అని పెదవి విరిచాను. అలాంటి సమయంలో దేవుడిలా డాక్టర్ బాబు వచ్చాడు. నన్ను ఇష్టపడ్డాడు. నాలో ఏం చూసి ఇష్టపడుతున్నారు అని అడిగితే ఆత్మ సౌందర్యం చూశానన్నారు. పెళ్లైంది. నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరనుకున్నాను. మూడునాళ్ల ముచ్చటగా అది ముగిసిపోయింది. భర్త నుంచి వేరైనా.. నా కడుపు పండిందని పోనీలే ఆ బిడ్డను చూసుకొని బతుకుదాం అనుకున్నాను. పదేళ్ల తరువాత నాకు పుట్టింది ఒకరు కాదు, ఇద్దరు అని తెలియజేశావు, ఆనందమే. కానీ ఏం లాభం, ఎవరికెవరు ఏం కాకుండా చేశావు. మనుషులందరూ నువ్వు చేసిన బొమ్మలే, అయినా నేను మాత్రం నీకు బాగా నచ్చిన బొమ్మను అందుకే నాతో ఎక్కువగా ఆడుకుంటావు. ఇన్నాళ్ల నుంచి ఈ నిందాస్థితి మనకు మామూలుది అయిపోయింది. కానీ ఒక ఆధారం ఇవాళ్టికి దొరికింది. అంజి.. సంజీవని లాంటి ఒక నిజాన్ని మోసుకొచ్చాడు. డాక్టర్ బాబు ఎంతో గాఢంగా ప్రేమించిన హిమను.. మౌనిత అనే రాక్షసి పొట్టన పెట్టుకుంది అని చెప్పాడు. ఆ నిజాన్ని ఆ భర్త చెవిన వేశాను. కానీ నా భర్త తెలివైన వాడే కదా.. వెంటనే కాకపోయినా కాస్త ఆలస్యంగా అయినా నిజం తెలుసుకుంటాడు అనే ఆశతో ఉన్నాను. నా మీద ఉన్న ద్వేషం వల్ల ఆయన చెవికి ఎక్కించుకోకపోతే నాకు దొరికిన ఆధారం కూడా నిరాధరంగా మిగిలిపోతుంది. అలా జరగకూడదు అనుకుంటే డాక్టర్ బాబులో నా మీద ద్వేషం పోవాలి. అప్పుడే నా మాటలు ఆలకిస్తాడు. నేను చెప్పిన నిజాన్ని నమ్ముతాడు. ఇంకా కొన్ని నిజాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఆ నిజాలన్నీ సఫలం కావాలి.ఈలోగా మౌనిత కూడా మాలో ఎవరికీ ఎలాంటి అపకారం జరగనివ్వకుండా చూడు స్వామి అని కోరుకుంటుంది.
ఇక ఉదయం సౌందర్య కాఫీని కార్తీక్‌కి తీసుకెళ్లాలనుకుంటుంది. దానికి ఆనందరావు రాత్రి అన్నది చాలదా.. ఇంకా ఏమైనా మిగిలాయా..? అని అంటాడు. నేనన్నానా..? వాడన్నాడా..? అని సౌందర్య అడగ్గా.. వాడు అన్నదే అని ఆనందరావు అంటాడు. రాత్రంతా వాడు అన్న మాటలే గుర్తు చేసుకుంటూ పడుకున్నావు. ఇప్పుడు ఏదైనా అంటే సాయంత్రం దాకా భోజనం చేయకుండా కూర్చుంటావు అని అంటాడు. వెంటనే సౌందర్య.. ఏమనడులెండి. ఎప్పుడైనా చివరకు గిల్టీగా ఫీల్ అయ్యి సారీ చెప్పేది వాడే. ఈ సారి కూడా అలానే ఉంటుంది అని కార్తీక్ రూమ్ దగ్గరకు వెళ్లి పెద్దోడా అని పిలుస్తుంది. అయితే కార్తీక్ గదిలో ఉండదు. దీంతో ఎక్కడికి వెళ్లాడు అని సౌందర్య కార్తీక్‌ని పిలిచి, కిందకు వెళుతుంది. ఇక ఆనందరావు ఏమైంది అని అడగ్గా.. వాడు పైన లేడు అని చెబుతుంది. బయట కూడా లేడని ఆనందరావు అంటాడు. అంటే ఇంట్లో లేడా..? అని సౌందర్య అనగా.. చిన్నపిల్లాడా ఎక్కడైనా తప్పిపోవడానికి అని ఆనందరావు అంటాడు. వెంటనే సౌందర్య.. హిమ, దీప దగ్గరకు వెళ్లినప్పటి నుంచి వాడు జిమ్‌కి వెళ్లడం, వాకింగ్‌కి వెళ్లడం మానేశాడండి. లేదు ఇంత పొద్దున్నే వెళ్లాడంటే ఏదో కారణం ఉంటుంది. ఎక్కడికి వెళ్లాడు అని సౌందర్య చెబుతుంది. కార్తీక దీపం సీరియల్ కొనసాగనుంది.