Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ రసవత్తరంగా కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్లో దీప దగ్గరే ఉంటానని చెప్పిన మురళీకృష్ణ పిండి రుబ్బుతూ ఉంటాడు. అటుగా ఒక మనిషి వచ్చి ఏంటి సర్ మీరు రుబ్బుతున్నారు. నేను చేస్తాను అని చెబుతాడు. పర్లేదయ్యా మన పని మనం చేసుకుంటే తప్పేముంది అని మురళీకృష్ణ అనగా.. చాలా ఉంది సర్ అని అతడు చెప్తాడు. అదే సమయానికి దీప వచ్చి ఏంటి నాన్న ఇది అడుగుతుంది. నాన్న టిఫిన్ సెంటర్లో నేను ఒక ఎంప్లాయిని అమ్మా అని మురళీకృష్ణ అనగా.. భలే వాడివి నాన్న. నేను రుబ్బుతాను లేయ్ నాన్న దీప అని అంటుంది. పర్లేదమ్మా అని మురళీకృష్ణ అనగా.. దేవుడు ఎవరు ఏం చేయాలి అన్నది ముందే నిర్ణయించేసి ఉంటాడు అని దీప అనగా.. అదేంటమ్మా అని మురళీకృష్ణ అడగ్గా.. పుట్టగానే అమ్మను తీసుకొని పోయాడు. అమ్మే ఉంటే నేను ఎంత చదువుకుంటానంటే అంత చదివించేది. చదువుకునే వయసులో వంట నేర్చుకునే దాన్ని కాదు. మీరేమో నా పెంపకం కోసం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. పిన్ని నన్ను బాగా చూడకపోవడం కూడా నాకు ఇప్పుడు కలిసి వచ్చింది అని దీప చెబుతుంది. అదేంటమ్మా అలా అంటావు అని మురళీకృష్ణ అడగ్గా.. నిజమే కదా నాన్న. చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టి వంట పనులు అప్పజెప్పింది. అదే ఇప్పుడు నాకు అన్నం పెడుతుంది. ఈ జీవనోపాధి పిన్ని వలనే దొరికింది. దీప వంటలక్క అయ్యింది. నా పిల్లలను పోషించుకోవడానికి, నా కాళ్ల మీద నేను నిలబడటానికి ఒక మార్గం దొరికింది అని దీప అంటుంది.
దానికి మురళీకృష్ణ.. నీ నుంచి నేను చాలా నేర్చుకోవాలమ్మా. నిరాశలో నుంచి కూడా నువ్వు ఆశను వెతుకుంటున్నావు అని అనగా.. అనుభవమే అన్నీ నేర్పిస్తుంది అంటారు. అవసరం అనుభవాలను పెంచుతుంది అని దీప అంటుంది. నిన్ను, నీ పిల్లలను ఈ పరిస్థితుల్లో డాక్టర్ బాబు చూస్తే అని మురళీకృష్ణ అనగా.. చెంప చెళ్లుమనిపించి నీ చావు నువ్వు చాలు. పిల్లలను మాత్రం కష్టపెట్టడానికి వీల్లేదు అని పిల్లలను తీసుకెళ్లిపోతారు. దేశోద్దారకుడు అని దీప అంటుంది.
మరోవైపు మోనిత ఇంటికి వచ్చి ఆవేశంతో రగిలిపోతూ ఉంటుంది. ప్రియమణి వచ్చి.. అమ్మా వచ్చారమ్మా. ఏది అమ్మ హిమమ్మా. వెనకాల వస్తుందా, బెడ్రూమ్లోకి వెళ్లిపోయిందా.. ఎక్కడుందమ్మా హిమ. ఎంచక్కా హిమను కార్తీక్ అయ్యకు అప్పజెప్పేస్తే వెంటనే మీకు, కార్తీక్ అయ్యకు పెళ్లి అయిపోతుంది. ఇన్నేళ్ల తపస్సు ఫలిస్తుందమ్మా. ఈ గోడకు మాత్రం మీ పెళ్లి ఫొటో పెద్దది చేసి తగిలించాలమ్మా. ఏంటి అమ్మా ఏం మాట్లాడరు. కుక్కర్ విజిల్ లాగా పొగలు కక్కుతున్నారు ఏంటి.. ఏమైంది. వెళ్లిన పని కాయా, పండా అని అడుగుతూ ఉండగా.. పుచ్చు అని మోనిత అంటుంది. ఏంటి అని ప్రియమణి మళ్లీ అడగ్గా.. కాఫీ పెట్టు, వాష్‌రూమ్‌లో టవల్ పెట్టు, గీజర్ ఆన్ చేసి పెట్టు అని పనులు పురమాయిస్తుంది. అసలు ఏమైందమ్మా అని ప్రియమణి అడగ్గా .. ప్లవర్ వాజ్ని పట్టుకొని నా బొంద అయ్యిందే నా బొంద అని మోనిత అరుస్తుంది. ఖరీదైన ఫ్లవర్ వాజ్ అమ్మా. మీ బొంద అయ్యిందని దాన్ని బొంద పెడతారా.. మీ బొందకు, నా తలకు సంబంధం ఏంటమ్మా. కోపం తగ్గించుకోండమ్మా. ఇంకోసారి మీ బొంద గురించి అడగను లేండమ్మా అని అంటుంది. ఇక మోనిత వెళ్లు అని అనగా.. ఇంట్లోకా, బయటికా అని లోపలికి వెళుతుంది.
ఆ తరువాత మోనిత.. దీప వాళ్లు కనిపించారని కార్తీక్‌తో చెప్పాలా వద్దా.. వద్దు నో.. చెప్తే కార్తీక్ వెళతాడు, పిల్లలను తెచ్చుకుంటాడు, నన్ను మర్చిపోతాడు. వాళ్లకు దూరంగా ఉంటే వాళ్లనే మర్చిపోతాడు. అవును. నేను అయితే చెప్పను. చచ్చినా చెప్పను, చెప్పలేను అని అంటుంది. మళ్లీ.. నేను చెప్పను సరే. ఆ మురళీకృష్ణ రామ్మా అని దీపను బ్రతిమలాడితే, దీపను రమ్మంటే, రానంటే, కార్తీక్‌కి ఫోన్ చేస్తే, మురళీకృష్ణ దీప ఆచూకీ చెప్పేస్తే అప్పుడు మాత్రం వెళ్లడన్న గ్యారెంటీ ఏంటి.. దేవుడా.. కార్తీక్ వెళ్తే అయిపాయే అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఇక సౌందర్య ఇంటికి రాగా.. వచ్చారా అత్తయ్య అని శ్రావ్య అడుగుతుంది. సౌందర్య సోఫాలో కూర్చోగా ఏమైంది అత్తయ్య. మా ఇంటికి వెళతా అన్నారు కదా వెళ్లారా.. నాన్న ఏమైనా మా అమ్మకు ఫోన్ చేశాడా.. అత్తయ్య. ఏంటి అత్తయ్య ఏమైంది. ఏం మాట్లాడట్లేదు ఏంటి అని శ్రావ్య అడుగుతుంది. దానికి సౌందర్య.. ఫస్ట్ టైమ్, లైఫ్‌లో ఫస్ట్ టైమ్ మీ అమ్మ దీప కన్నతల్లిలా మాట్లాడింది. నన్నే నోరు మూయించింది అని అనగా.. ఏంటి, ఏం వాగింది అని శ్రావ్య అడుగుతూ ఫోన్ తీస్తుండగా.. సౌందర్య ఆపుతుంది. ప్రపంచం అడగాల్సిన ప్రశ్నలే అడిగింది. నేను జవాబు చెప్పలేని ప్రశ్నలు. వైద్య వృత్తిలో విఙ్ఞాన ఖని , సమాజసేవలో దేశోద్దారకుడు అయినటువంటి డాక్టర్ బాబు విని ఉంటే ఎంత బావుండు అనిపించింది అని సౌందర్య అనగా.. ఏమైంది అత్తయ్యా అని శ్రావ్య అడుగుతుంది. భాగ్యానికి నోరు వచ్చింది అని సౌందర్య అనగా.. అసలు ఏమంది మా అమ్మ అని శ్రావ్య అంటుంది. మీ అమ్మ కాసేపట్లో అర్ధపావు భాగ్యంగా మారి మీ అత్తను కడిగేశాను అంటూ నీకు ఫోన్ చేస్తుందిలే అని సౌందర్య అంటుంది. మా అమ్మ మాటలు మీరు పట్టించుకోకండి అత్తయ్య అని శ్రావ్య అనగా.. పట్టించుకోవాల్సిన మాటలే అంది. పనికొచ్చే మాటలే మాట్లాడింది. నా సుపుత్రుడి నిర్వాకం గురించి అని సౌందర్య అంటుంది. అదే సమయానికి కార్తీక్ ఇంట్లోకి వస్తాడు. అప్పుడు భాగ్యం మాటలను సౌందర్య గుర్తు చేసుకుంటుంది.
ఇంట్లోకి వచ్చిన కార్తీక్ డాడీ ఎక్కడ మమ్మీ అని అడగ్గా.. ఎందుకు అని సౌందర్య ప్రశ్నిస్తుంది. ఎందుకేంటి ఎలా ఉంది ఒంట్లో అని కార్తీక్ అడగ్గా.. ఏం. నువ్వు వెళ్లి పక్కన కూర్చొని అడగలేవా., మధ్యలో నీకు ఇంకొకరు చెప్పాలా అని సౌందర్య ఆవేశంతో అంటుంది. ఏమైంది ఇప్పుడు అని కార్తీక్ అడగ్గా.. నీకెందుకు మూడో వ్యక్తి చెప్పాలి. నేను బాగానే ఉన్నారంటాను. అంతే నీ పని అయిపోతుంది. అడగలేదు అన్న మాట రాకుండా పోతుంది. దులిపేసుకొని పోతావు. మళ్లీ ఎవరో ఏదో చెప్తారు. మళ్లీ వచ్చి మమ్మల్ని శత్రువుల్లా చూస్తావు అని సౌందర్య కోపంగా అంటుంది. ఎవరు చెప్తారు, ఏం చెప్తారు అని కార్తీక్ అడగ్గా.. చెప్పుడు మాటలు అని సౌందర్య అంటుంది. ఏమైంది నీకు అని కార్తీక్ అనగా.. ఒక అఙ్ఞాని కూడా నాకు ఙ్ఞానబోధ చేసింది. అలాంటి పరిస్థితి నాకు నీ వల్లే వచ్చింది. నేను ఫస్ట్ టైమ్ జవాబు చెప్పలేక నోరు మూసుకొని ఇంటికి వచ్చాను అని సౌందర్య అనగా.. అర్థమైంది. నువ్వు అనుకునే ఆ ఙ్ఞానబోధ కూడా చెప్పుడు మాటలే అంటాను. అవివేకంలో ఉన్నావు నువ్వు అని అంటాను. దానికి నువ్వు ఏమంటావు మమ్మీ అని కార్తీక్ అంటాడు. దాంతో సౌందర్య కోపంగా.. ఏమన్నావురా అని అనగా.. అదే సమయానికి ఆనందరావు కిందికి వస్తాడు. ఏంటి ఏవో అరుపులు వినిపిస్తున్నాయి అని ఆనందరావు అనగా.. ఏం లేదులే డాడీ. ఎలా ఉంది మీ ఒంట్లో అని కార్తీక్ అడగుతాడు. ఒంట్లో బావుందిరా. నువ్వే కదా మంచి మందులు ఇస్తున్నావు. మనసులోనే బాలేదు. దానికి ఎలాంటి మందు కావాలో నీకు తెలుసు అని ఆనందరావు అనగా.. తెలుసు డాడీ. ఆ మందు గురించి మాట్లాడే ముందు మీ మనసు గురించి మాట్లాడాలి. మీ ఇద్దరినీ కలిపి అడుగుతాను. మనసు నుంచే సమాధానం చెబుతారని ఆశిస్తాను అని కార్తీక అంటాడు. దానికి నేను చెబుతాను అని ఆనందరావు అనగా.. నన్ను ఎందుకు కలుపుతావు అని సౌందర్య అంటుంది.
దానికి కార్తీక్.. నేను చెప్పుడు మాటలు వినే కారెక్టర్నే సరేనా. మీరు ఎవరి మాటలు వినరు. మీ మనసు నమ్మిందే నిజం. మీ మనసు నమ్మిందే పవిత్రత, మీ మనసు నమ్మిందే న్యాయం కాబట్టి మనసును అడిగి నిజం చెప్పండి అని అనగా.. ఏంటో అడగనివ్వు సౌందర్య అని ఆనందరావు అంటాడు. ఇక కార్తీక్.. అమ్మ గారు నోరు విప్పట్లేదు అనగా.. దీప గురించేనా అని సౌందర్య అంటుంది. అవును, మీ కోడలు గురించే. ఆ రోజు నాకు ఏదో తులసి గురించి చెప్పింది. నేను నమ్మను, మారను, అర్థం చేసుకోను అన్నాను గానీ దాన్ని ఊరు వదిలిపెట్టి వెళ్లిపోమన్నానా. పిల్లలను తీసుకొని మరీ వెళ్లిపోమన్ననా.. మరి అది నిర్ధాక్షణ్యంగా పిల్లలను నా నుంచి లాక్కొని మరీ తీసుకెళ్లిందే మీరు అప్పుడు ఎందుకు మమ్మీ ఆపలేదు. నేను నమ్మినా నమ్మకపోయినా పిల్లలు వాళ్లు మీ మనవరాళ్లే అని నమ్ముతున్నారు కదా ఎందుకు వెళ్తావే అని ఆపారా.. కనీసం పిల్లలను అయినా ఉంచవే అని అన్నారా.. తెల్లారిలేస్తే నా కోడలు నిప్పు, అగ్ని జ్వాల అంటూ నెత్తిన పెట్టుకుంటారే. ఇప్పుడు మీ కోడలు మీతో కూడా చెప్పకుండా ఎటో వెళ్లిపోయింది. కనీసం మమ్మీకి అయినా చెప్పలేదని, ఎక్కడుంటుందో మమ్మీకి అయినా తెలీదని నేను నమ్మకపోయినా.. ఆ సంగతి పక్కనపెడదాం. ఇప్పుడు కనపడకుండా పోయిన దీప గురించి ఫలానా సౌందర్య, ఆనందరావుల కోడలు పిల్లలతో సహా ఎటో వెళ్లిపోయింది. వెతికి పెట్టినవారికి పదివేల వరహాలు ఇస్తామని పేపర్లో ప్రకటన ఇస్తే అప్పుడు ఎవరి పరువు పోతుంది. నేను ఎప్పుడూ నాలుగు గోడల మధ్యనే మాట్లాడాను. కానీ అది నాలుగు గోడలు కాదు. మా కుటుంబ పరువునే వీధిన పడేసి పోయింది. అయినా మీకు కోపం రాదు. నా మీద కోపం పోలేదు అని కార్తీక్ అంటాడు.
వెంటనే సౌందర్య.. మేం ఆపలేదు సరే, మా చేతులు కట్టుకుపోయాయి. మా గొంతు మూగబోయిందని నోరు మూసుకున్నాము. అది వెళుతుంటే శిలా ప్రతిమల్లాగా చూస్తూ నిల్చున్నాము. మరి నువ్వు ఎందుకు ఆపలేదు. నా కోడలను అంటే ఊపలేవు. వాళ్లు నీ కూతుర్లు అని నమ్మినా నమ్మకపోయినా పిల్లల మీద నీకు తండ్రి ప్రేమ మెండుగానే ఉంది కదా. నీతో పాటు పిల్లలను కష్టపెట్టే హక్కు నీకు లేదు. నేనే పెంచుకుంటాను. వాళ్లకు ఒక ఉజ్వలమైన భవిష్యత్‌ని ఇస్తాను అని నువ్వెందుకు పిల్లలను నీ వైపుకు లాక్కోలేకపోయావు అని అంటుంది. దానికి కార్తీక్.. చాలా మంచి ప్రశ్న వేశావు మమ్మీ. దీనికి ఆన్సర్ నా దగ్గర ఉంది. పిల్లలు నాకు కావాలి అని అడిగితే నీ సో కాల్డ్ పవిత్రమూర్తి ఉరఫ్ దీప గారు ఏమంటారో తెలుసా.. వీళ్లను మీరు కనలేదు కదా. ఏ హక్కుతో అడుగుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు నేను నోరు విప్పి దాని చరిత్ర చదివి అయినా సరే నేను విశాలమైన హృదయంతో నీ పిల్లలను పెంచుకోవాలనుకుంటున్నాను అని పిల్లల ముందే చెప్పాలా, వాళ్ల ముందు ఇవన్నీ మాట్లాడాలా.. మీరు నేర్పిన విద్యనే ఈ సంస్కారం అదే నన్ను ఆపింది. అందుకే నేను ఆగింది. అందుకే వాళ్లను ఆపలేకపోయాను. అర్థమైందా. అసలు నేనే పెద్ద తప్పు చేశాను. ఏనాడో దానికి విడాకులు ఇవ్వాల్సింది. అప్పుడు అది ఎటు వెళ్లినా నాకు బాధ ఉండేది కాదు. ఇన్ని ప్రశ్నలు వేయాల్సిన పని ఉండేది కాదు. అదేమైపోయిందన్న సంగతి నాకు తెలిసేది కాదు. ఈ నరకం ఉండేది కాదు. డాడీ.. నేను మిమ్మల్ని పట్టించుకోనట్లు మాట్లాడుతుంది మమ్మీ. వేళకు మందులిస్తున్నా, మిమ్మల్ని మందలిస్తున్నా.. మిమ్మల్ని పట్టించుకోని వాడినే అయ్యాను. నేను ఏం చేసినా నన్నే ఎందుకు అపార్థం చేసుకుంటారు. నాకు అర్థం కావడం లేదు అని కార్తీక్ అంటాడు.
ఏదో కోపంలో అని ఆనందరావు అనగా.. పోనీ అవన్నీ వదిలేయ్ డాడీ. ఇప్పుడు ఏమన్నావు మమ్మీ. నేను చెప్పుడు మాటలు వింటానా.. అంటే నాకు మెదడు లేదు, వివేకం లేదు, విచక్షణ లేదు, ఆలోచించే శక్తి లేదు, సెల్ఫ్ జడ్జిమెంట్ లేదు అని నువ్వే డిసైడ్ చేశావా.. ఎలా డిసైడ్ చేస్తావు మమ్మీ. నా నమ్మకాల మీద నాకు నమ్మకం ఉంది. నా అభిప్రాయం మీద నాకు గౌరవం ఉంది. అవి ఎవరు చెప్తేనే మారవు. నువ్వు గానీ, ఆ రోడ్డు నంబర్ 25లో ఉందే ఆ ఫ్రెండ్ చెప్పినా గానీ నేను వినను. ఇప్పుడు ఇవాళ వాళ్లను వెతకాల్సిన పరిస్థితి ఎవరు కల్పించారు. నేనా,, మీరా.. ఆ చెప్పుడు మాటలు చెప్పేవాళ్లా.. ఎవరు.. నీ కోడలే కదా. మన పరువును బజారున పెట్టి పోయింది అదే కదా. దాన్నితిట్టండి నన్ను కాదు. అర్థమైందా అని పైకి వెళుతుంటాడు. వెంటనే సౌందర్య.. పెద్దోడా. నీ మీద ప్రేమ లేక కాదు, కోడలిని వెనకేసుకొచ్చి కొడుకును శత్రువుగా చూడాలనే దురుద్ధేశం మాకు లేదు. ఆల్రైట్ ఈ అమ్మ మీద నీకు కోపం వచ్చింది. అది పోగొట్టుకోవాల్సిన బాధ్యత నా మీదనే ఉంది. ఇప్పుడు నువ్వు అన్నావే నీ నమ్మకం, నీ అభిప్రాయం అని.. నీ నమ్మకమే నిజమైతే నీ నమ్మకాన్ని నేను నమ్ముతాను. నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఇప్పుడు వెళ్లరా నిజం చేయ్. నీ నమ్మకాన్ని నిజం చేయ్. ప్రపంచం అంతా వ్యతిరేకించినా సరే నేను నీ పక్షానే నిలబడతాను. ఐ ప్రామిస్ యు. గో అహెడ్ మై డియర్ సుపుత్రా అని అంటుంది.
ఇక మోనిత, కార్తీక్‌కు ఫోన్ చేస్తుంది. చెప్పు మోనిత హిమను తీసుకొస్తా అని బయలుదేరావు కదా. హిమ కనిపించిందా, తీసుకొస్తున్నావా, హిమ ఒప్సుకుందా.. తల్లి పంపించిందా.. పోనీ అడ్రస్ తెలిసిందా.. ఏమైంది అని ప్రశ్నలు కురిపిస్తూ ఉంటాడు. ఇక మోనిత టెన్షన్ పడుతూ.. ఒక్క గంట ముందు నేను దీపను చూసి ఉంటే నా పెళ్లి కార్తీక్‌తో జరిగిపోయి ఉండేది. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం అని మనసులో అనుకుంటుంది. ఏమైంది మోనిత, మాట్లాడట్లేదు ఏంటి. ఏం జరిగింది. హిమ రానందా అని కార్తీక్ అడగ్గా.. లేదు కార్తీక్. నాకు దీప వాళ్లు కనిపించలేదు. నాకు వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్, నేను వెళ్లిన ఊర్లో దీప వాళ్లు లేరు అనగా.. దీప వాళ్లు కనిపించలేదా..నువ్వు కచ్చితంగా తీసుకొస్తావన్న నమ్మకంతో ఉన్నాను అని కార్తీక్ అనగా.. నా ఖర్మ కార్తీక్, నా ఖర్మ అని మోనిత అనగా.. సర్లే నేను రేపు వచ్చి కలుస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. మరోవైపు సౌర్య, హిమ మురళీకృష్ణను వెక్కిరిస్తూ ఉంటారు. కార్తీక దీపం కొనసాగుతోంది.
Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News