Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్లో హిమతో సౌందర్య మాట్లాడుతూ.. మీ అమ్మ, నువ్వు, సౌర్య మీ నాన్నతో కలిసిపోయి అందరూ మాతో పాటే ఉంటారు అని అంటుంది. దానికి హిమ అవునా అమ్మా అనగా.. దీప సైలెంట్‌గా ఉంటుంది. వెంటనే సౌందర్య.. అవునని చెప్పవే. ఏంటి నిజం కాదా అని అనగా.. మీ నానమ్మ మీద నాకు చాలా నమ్మకం హిమ. ఆవిడ కచ్చితంగా మనల్నందరినీ కలుపుతారు అని దీప అంటుంది. వెంటనే హిమ అవునా.. సూపర్ అంటూ దీప, హిమలకు థ్యాంక్స్ చెబుతుంది. ఆ తరువాత సౌందర్య ఫోన్ తీసుకొని పాట పెట్టుకొని డ్యాన్స్ వేస్తుంటుంది. అదే సమయానికి కారులో నుంచి దిగుతారు కార్తీక్, సౌర్య. పాట విని పక్కన ఏమన్నా పెళ్లి జరుగుతుందా అని కార్తీక్ అడగ్గా.. ఏమో అని అటూ ఇటూ చూసి హిమ డ్యాన్స్ వేయడం చూపిస్తుంది. ఇక హిమ సంతోషంగా ఉండటం చూసిన కార్తీక్ కాస్త ఫీల్ అవుతాడు. ఆ తరువాత రా నాన్న అని సౌర్య అడగ్గా..నేను వెళ్తాలే రౌడీ. నువ్వు నానమ్మ కారులో రా అని కార్తీక్ అంటాడు. ఇక రా నాన్న అని సౌర్య అనగా.. హిమకు బోరు కొట్టడం లేదమ్మా. అందుకే వెళతాను అని అక్కడి నుంచి వెళతాడు.
ఆ తరువాత దీప, సౌందర్య, హిమల దగ్గరకు వెళ్లిన సౌర్య.. సౌందర్య ఫోన్ తీసుకొని పాటను ఆఫ్ చేస్తుంది. సౌర్యను చూసి అత్తమ్మా నువ్వెప్పుడు వచ్చావు అని దీప అడగ్గా.. వచ్చావు కదా నువ్వు డ్యాన్స్ చేయి అని సౌందర్య అంటుంది. వెంటనే సౌర్య కోపంతో.. ఎందుకు.. ఇక్కడేమైనా పెళ్లి జరుగుతుందా.. ఫంక్షన్ జరుగుతుందా.. కనీసం ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారు కూడా పట్టించుకోరా అని అరుస్తుంది.
ఎవరొచ్చారే అని సౌందర్య అడగ్గా.. నాతో పాటు మా నాన్న వచ్చాడు అని సౌర్య అంటుంది. ఏడీ అని సౌందర్య, హిమలు అడగ్గా.. నువ్వు డ్యాన్స్ చేయడం చూసి వెళ్లిపోయాడు అని సౌర్య చెబుతుంది. ఎందుకు హిమ డ్యాన్స్ చేయడం మీ నాన్నకు నచ్చదా అని దీప అడగ్గా.. ఎందుకు నచ్చదు హిమను చూడాలనిపించి నన్ను కూడా తీసుకొచ్చాడు. దారంతా పాపం హిమ ఒక్కటే ఉంటుంది. బోరు కొడుతుందేమో. బయటకు తీసుకెళదాం. కబుర్లు చెబుదాం అంటూ హిమ గురించి మాట్లాడుతూ వచ్చాడు అని సౌర్య చెబుతుంది. వెంటనే సౌందర్య.. అలాంటి వాడు ఎందుకు వెళ్లిపోతాడు అని ప్రశ్నించగా.. హిమకు బోరు కొట్టట్లేదని అని సౌర్య అంటుంది. ఏంటి అని సౌందర్య మళ్లీ అడగ్గా.. మీరేమో ఇక్కడ పండుగ చేసుకుంటున్నారు కదా. పాపం నాన్న హిమను కలవకుండానే వెళ్లిపోయాడు అని చెబుతుంది. దాంతో సౌందర్య.. నీకు, వాడికి కాస్త తిక్క ఉందా ఏంటే, రాగానే మామీద విరుచుకుపడుతున్నావు. అవును పండుగనే చేసుకుంటున్నాము. విషయం వింటే నువ్వు కూడా పండుగ చేసుకుంటావు. హిమతో పాటు నువ్వు కూడా డ్యాన్స్ చేస్తావు అని అంటుంది.
ఇక సౌర్య.. నేనా. నాకు డ్యాన్స్ చేసే మూడ్ లేదు. మా నాన్న మూడ్ పాడై వెళ్లిపోయాడు అని చెబుతుంది. ఇక హిమ.. నిజంగా నేను నాన్నను చూడలేదు హిమ అనగా.. నువ్వు చూసే పరిస్థితిలో ఉన్నావా.. డ్యాన్స్ పోటీలకు వెళ్లినట్లు డ్యాన్స్ చేస్తున్నావు కదా.. అయినా ఈ డ్యాన్స్ ఎందుకు అని సౌర్య అంటుంది. వెంటనే దీప నువ్వు లోపలికి రా నానమ్మ చెబుతుంది అని అంటుంది. ఇక సౌందర్య.. ఎగిరి పడింది చాలు. నాన్న పాట పాడింది చాలు. రెండు రోజులు వాడితో ఉండేసరికి వాడిలా గయ్యిమనడం అలవాటు అయిపోయింది. రా లోపలికి, నీకు కారణం కావాలి అంతే కదా నేను చెబుతాను పద అని సౌర్యను లాక్కొని వెళుతుంది.
ఇక మోనిత.. సౌందర్య మాటలను గుర్తు చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అది గమనించిన ప్రియమణి.. ఏంటమ్మా.. ఇందాకటి నుంచి గడియారంలో గెంట లాగా అంటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. సొరకాయ గింజ వేస్తే కాకరకాయ కాస్తుందా.. కాకరకాయకు కాకరపువ్వొత్తులు వస్తాయా.. అయినా అనుమానంతో విడిపోయిన పెళ్లాం మొగుడు కలిసిపోయినట్లు సినిమాల్లో తప్ప ఎక్కడా చూడలేదమ్మా. కలిసి పోయారు అంటే రాజీ పడి బతకడం తప్ప ఇష్టపడి కాదమ్మా. కార్తీక్ అయ్య రాజీ పడతాడా అని అనగా.. చాలు ఆపవే నీ మెట్ట వేదాంతం అని మోనిత అంటుంది. ఆ సమయానికి కార్తీక్ రాగా.. అతడిని చూసి నువ్వెప్పుడు వచ్చావు కార్తీక్ అని అడుగుతుంది. వెంటనే కార్తీక్.. ఈ ప్రియమణి ఏదో మెట్ట వేదాంతం చెబుతుంది అనగా.. పెళ్లి, పెటాకులు లేని పనివాళ్లకు కూడా ఇలాంటి విషయాలు తెలుస్తాయా అని అంటాడు. వెంటనే ప్రియమణి.. నమస్కారం కార్తీక్ అయ్య అని.. పెళ్లి పెటాకులు లేని వాళ్లని ఎవరిని అన్నారయ్యా అని.. అక్కడి నుంచి వెళుతుంది.
ఇక మోనిత దానికి కాస్త మెంటల్లే అనగా.. మెంటల్ ఆ పెంటమ్మకు కాదు నీకు. నా పర్సనల్ విషయాలు నాతో కాకుండా నీ పని వాళ్లతో కూడా డిస్కస్ చేస్తుంటే అందరికీ ఇలాగే లోకువ అయిపోతాము. అది సరేలే. మా వాళ్లు ఏదో కొత్త కథ మొదలు పెట్టారన్నావు ఏంటది అని కార్తీక్ అడుగుతాడు.
మరోవైపు సౌర్య.. ఏంటి మళ్లీ చెప్పండి అనగా.. నా వళ్ల కాదని సౌందర్య అంటుంది. వెంటనే సౌర్య.. ఇంత అర్జెంట్‌గా నాన్న, అమ్మ ఎలా కలుస్తారు అని అడగ్గా.. ఎలాగో కలుస్తారు అని సౌందర్య అంటుంది. దానికి సౌర్య అదే ఇన్ని రోజులు కలవంది, ఇప్పుడు ఇంత త్వరగా ఎలా కలుస్తారు అని అనగా.. ఏయ్ స్టుపిడ్ ఎదురు ప్రశ్నలు వేయకు కలుస్తారు అంతే అని సౌందర్య అంటుంది. ఇక దీప.. నానమ్మ చెబుతున్నారు కదా అనగా.. ఇన్ని రోజులు చెప్తూనే ఉన్నారు అని సౌర్య అంటుంది. వెంటనే సౌందర్య దీనికి నా కెపాసిటీ మీద డౌట్లు ఉన్నాయే అనగా.. మీరు ఏదైనా సగం సగమే ఎందుకు చెప్తారు అని సౌర్య అడుగుతుంది. దానికి సౌందర్య అసలు ఆ సగం అయినా ఎందుకు చెప్పాలే. పూర్తి అయ్యాక మొత్తం ఒకేసారి చెబుతాను అనగా.. ఇప్పుడు నాకు ఏమీ అర్థం కావడం లేదని సౌర్య అంటుంది.
ఇక సౌందర్య.. నీకు చిన్నప్పటి నుంచి ఏమైతే అర్థం కాలేదో వాటన్నింటికి సమాధానం దొరికింది కదా అనగా.. నేను కనుక్కున్నాను కాబట్టి దొరికింది అని సౌర్య అంటుంది. వెంటనే సౌందర్య.. అబ్బా నీకు అన్ని తెలివి తేటలే ఉండి ఉంటే ఇప్పుడు ఇది కూడా కనుక్కోవే అని అంటుంది. దానికి సౌర్య కనుక్కుంటాను. కావాలంటే చూడండి. మీరు చెప్పే లోపే తెలుసుకుంటాను. నేను ఎవరు అనుకున్నారు. సౌందర్య గారి మనవరాలిని అని అంటుంది. దీంతో సౌర్యను సౌందర్య ముద్దు చేస్తుంది. ఇక హిమ ఏదో ఆలోచనలో ఉండగా.. ఏం ఆలోచిస్తున్నావు అని దీప అడుగుతుంది. వెంటనే హిమ.. పాపం డాడీ నన్ను చూడాలని వచ్చాడమ్మా. నేనేమో డ్యాన్స్ చేస్తూ చూడలేదు. డాడీ ఫీల్ అయ్యి వెళ్లిపోయాడంట కదా. అందుకే బాధగా ఉంది అని అంటుంది. దానికి సౌందర్య.. మీ డాడీ నీ విషయంలో ఏం ఫీల్ అవ్వడులేవే. వెంటనే మర్చిపోతాడు. మళ్లీ నీకు ఫోన్ చేస్తాడు చూడు అనగా.. ఇప్పుడు డాడీ ఎక్కడికి వెళ్లాడో అని హిమ అంటుంది.
ఇక మోనిత దగ్గర కార్తీక్ ఉండగా.. ఆ అత్తాకోడళ్లు కలిసి తులసి విషయం కార్తీక్ దగ్గర చెప్పకముందే నేను చెబుతా. వాళ్ల మాటలు వినకుండా ముందే ప్రిపేర్ చేసి పెడతా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్.. వాళ్లేదో చెప్పబోతున్నారు అని పిలిచి అసలు ఏం చెప్పవేంటి అనగా.. చెప్తే నువ్వు నమ్ముతావా లేదా అని ఆలోచిస్తున్నా అని మోనిత అంటుంది. అదేంటి అంతలా నమ్మలేని విషయమా అని కార్తీక్ అనగా.. నమ్మలేని నిజం. మీ అమ్మ గారు దీప, తులసితో కలిసి ఒక అద్భుతమైన కథను అల్లుతున్నారు. అది ఇవాలో రేపో నీకు వినిపించబోతున్నారు. దాంతో నువ్వు కదిలిపోయి, కరిగిపోయి, కన్నీళ్లు పెట్టుకొని కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను తెచ్చుకొని అందరినీ అక్కున చేర్చుకొని కాపురం చేసుకుంటావని వాళ్ల ప్లాన్ అని మోనిత అంటుంది. అంత పెద్ద ప్లాన్ వాళ్లు ఏం చేస్తున్నారు అని కార్తీక్ అడగ్గా.. దీప ఇంకా తులసి ఇంటికి వెళ్లి వస్తుందన్న సంగతి నీకు తెలుసు కదా. దీప కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఏ దారి లేక మీ అమ్మ గారి దగ్గర ఒక అద్భుతమైన కథ అల్లింది అని విహారికి పిల్లలు పుట్టరు అన్న విషయాన్ని చెబుతుంది. అది కథ అని అంటుంది.
ఇక ఏంటి ఆలోచిస్తున్నావు. మీ అమ్మ అంటే వంటలక్క అభిమాన సంఘానికి ఫౌండర్ కాబట్టి నమ్మింది. నువ్వెందుకు ఆలోచిస్తున్నావు. నువ్వు కూడా మీ అమ్మలాగే నమ్ముతున్నావా అని మోనిత అడగ్గా.. అది కరెక్ట్ కాదేమో. అందులో నిజం ఉందేమో అని కార్తీక్ అంటాడు. ఇక మోనిత తడబడుతూ ఏంటి నువ్వు నమ్మేశావా అనగా.. మొన్న ఆ మధ్య తులసి డాక్టర్ గోవర్ధన్‌ని కలవడానికి హాస్పిటల్‌కి వచ్చింది. నాతో్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తే నేను అవాయిడ్ చేశాను. ఆ తరువాత వారణాసి, దీపతో చెబుతున్నప్పుడు తులసి ఏడుస్తూ వెళ్లిందని తెలిసింది. అంటే అందులో నిజం ఏదైనా ఉందనేగా. తులసి అందుకే దీపను కలవడానికి వచ్చిందేమో అని అంటాడు. వెంటనే మోనిత., చీ నా మొహం మీద మన్ను పొయ్య. నా నోట్లో నేనే మట్టి కొట్టుకోవడానికి పిలిచి మరీ చెప్పానేమో అని మనసులో అనుకుంటుంది. ఆ తరువాత బయటకు మోనిత.. మంచిది. నేను మన కోసం కొన్న విల్లాను నీకు అమ్మేస్తాను. కొంటావా అని అనగా.. ఎందుకు అని కార్తీక్ అంటాడు.
వెంటనే మోనిత.. మరి వాళ్లు కల్పించింది నువ్వు నమ్ముతున్నావంటే పెళ్లాం, పిల్లలను తెచ్చుకుంటావు కదా. పదేళ్లు ఎడబాటుగా ఉన్నారు. ఇంట్లో అయితే ప్రైవసీ ఉండదు. అందుకని నా విల్లా రాసిస్తాను. అందుకే నా విల్లా ఇస్తాను తీసుకొని అందులో పాత భార్యతో కొత్త కాపురం వెలగబెట్టు అని అంటుంది. చీచీ వెటకారంగా ఉందా అని కార్తీక్ అనగా.. లేకపోతే ఏంటి కార్తీక్. కోపం పక్కనపెట్టి లాజిక్ ఆలోచించు. ఒక గైనకాలజిస్ట్‌గా నా దగ్గరకు కొత్తగా పెళ్లైన వాళ్లు, పెళ్లై సంవత్సరం గడిచినా పిల్లలు లేని వాళ్లు.. ఐదేళ్లు దాటినా పిల్లలు కలగని వాళ్లు వస్తుంటారు. నేను, నాలాంటి గైనకాలజిస్ట్లు ఇద్దరిలో ఎవరిలో లోపం ఉందో కనిపెట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. కానీ ఒక దశాబ్దం పాటు పిల్లలు లేని వాళ్లు తిరిగేది హాస్పిటల్ చుట్టూ కాదు. దత్తత తీసుకోవడానికి అనాథ శరణాల చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు నీకు క్లియర్‌గా అర్థం అయ్యింది అనుకుంటాను అని మోనిత అంటుంది. ఇక కార్తీక్.. మరి తులసి హాస్పిటల్ చుట్టూ ఎందుకు తిరుగుతుంది అనగా.. హాస్పిటల్‌కి తిరిగింది తులసి విహారి కాదు. అతనిలో లోపం ఉంటే తులసి ఎందుకు తిరుగుతుంది. అతడినే తిప్పుతుంది. అయినా అది కూడా నిన్ను నమ్మించడానికే కావాలనే నువ్వు ఉండగానే అక్కడికి వచ్చిందని నేను అంటాను. ఇంకా చెప్పాలంటే డాక్టర్ గోవర్ధన్‌ని కూడా మేనేజ్ చేసి ఉంటారని అంటాను. నిజం చెబుతున్నాను కార్తీక్. నువ్వు కళ్లారా చూసిందే నిజం. దీప నిన్ను మాయ చేస్తుంది. ఇప్పుడు అత్తాకోడల్లు నీకు ఇదే కథ చెప్పి కన్నీళ్లు కారిస్తే కరిగిపోకు. అవి కన్నీటి చుక్కలు కాదు. నీ జీవితాన్నే కాల్చేస్తాయి వెళ్లు. నేను అర్జెంట్‌గా ప్రియమణి చేత ముద్దపప్పు, చారు పెట్టించుకుంటా. ఎందుకో పప్పన్నం తినాలపిస్తోంది అని అంటుంది.
ఇక కార్తీక్.. నీకు వెటకారం బాగా ఎక్కువైంది అనగా.. నాకు కాదు నీ భార్యకు ఎక్కువ అయ్యింది అని మోనిత అంటుంది. ఇక వెళుతున్నానని అక్కడి నుంచి కార్తీక్ వెళతాడు. ఆ తరువాత మోనిత నవ్వుతూ.. ఇక నువ్వు వాళ్లు ఎంత నమ్మకంగా చెప్పినా నమ్మలేవు కార్తీక్ అని అనుకుంటుంది.
మరోవైపు సౌందర్య, దీపతో ఇక నువ్వు ఎలాంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకోకు. నేను కార్తీక్‌కి చెబుతాను. వాడు కచ్చితంగా నమ్మి తీరుతాడు అని అంటుంది. ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది అత్తయ్యా. నా మనసు ఒప్పుకోకపోయినా మీ మాటలు ఒప్పించాయి. కాబట్టి ఆయనను నేను ఒప్పించలేకపోయినా మీరు ఒప్పిస్తారనే నమ్మకం పెరిగింది అని దీప అనగా.. అదే నమ్మకంతో ఉండు. ధైర్యంగా ఉండు, నేను బయలుదేరతాను అని అంటుంది. ఇక సౌందర్య వెళుతుండగా.. నేను వస్తాను అని హిమ చెబుతుంది. అదేంటి.. నాన్న మన అందరినీ తీసుకెళ్లిన రోజే వస్తానని అన్నావు కదా అని సౌర్య అడగ్గా.. నాన్న మనలను రేపే తీసుకెళతాడని అమ్మ, నానమ్మ చెబుతున్నారు కదా అని అంటుంది. మరి రేపే రావొచ్చు కదా అని సౌర్య అడగ్గా.. నాన్న నా కోసం వచ్చి వెళ్లిపోయాడు కదా. అందుకే చూడాలనిపిస్తోంది అని అంటుంది. వెళ్లిరా హిమ అని దీప అనగా.. వెళ్లి రా నా.. రావడం ఎందుకు. మేమిద్దరం అక్కడే ఉంటాము. నువ్వు రా అక్కడికి అని చెబుతుంది. ఇక సౌందర్యతో సౌర్య, హిమలు వెళతారు.
ఆ తరువాత దీప మనసులో ఆయన ఏమంటాడో అనుకుంటుంది. ఇక ఇంట్లోకి వెళ్లగానే అవును నా బుక్స్ ఏ సెల్ఫ్‌లో పెట్టుకోవాలి సౌర్య అడగ్గా.. నన్నెందుకు అడుగుతున్నావు. నీకు ఇష్టం వచ్చిన చోట పెట్టుకో అని హిమ అంటుంది. మరి నేను నాన్న గదిలో ఉంటా అని సౌర్య అడగ్గా.. మరి అమ్మ అని హిమ అడుగుతుంది. నలుగురం పడతామా ఆ బెడ్ మీద ఇద్దరం కింద పడిపోతాం అని సౌర్య చెప్పగా ఇద్దరూ నవ్వుతారు. ఇక ఆదిత్య, శ్రావ్యలు అదే సమయానికి పైనుంచి కిందికి వస్తారు. ఎందుకు అంత హుషారుగా ఉన్నారని ఆదిత్య, శ్రావ్యలు అడుగుతారు. దాంతో అమ్మ, నాన్న, నేను, సౌర్య అందరం కలిసిపోతామంట బాబాయ్. నానమ్మ చెప్పింది అని హిమ అంటుంది. అదే సమయానికి కార్తీక్ వచ్చి మోనిత మాటలను గుర్తు చేసుకుంటాడు. ఇక ఆదిత్య.. ఏయ్ నిజం చెప్పండి. ఆ బండరాయి కరుగుతుంది. మీ అమ్మకు, మా అమ్మకు ఎలా తెలుసే అని అడుగుతాడు. ఇక కార్తీక్‌కి చూసిన శ్రావ్య.. ఆదిత్యకు సైగలు చేస్తుంది. కార్తీక్‌ని చూసిన హిమ, సౌర్య ఇద్దరు అతడిని హత్తుకుంటారు. అదే సమయానికి పైనుంచి వచ్చిన సౌందర్య నవ్వుతుంది. ఇక కార్తీక్.. హిమ నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానమ్మా. ఇక్కడే ఉండిపోమ్మా ప్లీజ్ అని అంటాడు. ఇక ఏంటే రౌడీ.. హిమను ఉండమంటే నిన్ను వెళ్లిపోమని కాదు. ఇద్దరు ఇక్కడే ఉండిపోండి అని అంటాడు. కార్తీక దీపం కొనసాగుతుంది.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.