Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ రసవత్తరంగా కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్లో సౌర్య, హిమ ఇద్దరు సౌందర్య ఇంటికి వెళతారు. అక్కడ కార్తీక్‌ని చూసి ఇద్దరు హత్తుకుంటారు. ఆ తరువాత కార్తీక్.. హిమ నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానమ్మా. ఇక్కడే ఉండిపోమ్మా ప్లీజ్ అంటాడు. ఇక సౌర్య కార్తీక్ తన మీద వేసిన చేయిని తీసేయగా.. ఏంటే రౌడీ హిమను ఉండిపోమంటే నిన్ను వెళ్లిపోమని కాదు ఇద్దరూ ఇక్కడే ఉండిపోండి అంటాడు. ముగ్గురం కలిసి రోడ్డు పక్కన బండి మీద టిఫెన్ తిందాం, టెర్రస్ మీద పడుకొని చుక్కలు లెక్కపెడదాం, దోమలు వస్తే బ్యాట్‌తో కుస్తీ పడుతూ ఎన్ని దోమలు చంపామో లెక్క వేసుకుందాం. ఇంకా అని కార్తీక్ అంటూ ఉండగా.. మరి అమ్మను ఎప్పుడు రమ్మంటావు డాడీ, ఇవాళ, రేపా.. అని హిమ అడుగుతుంది. దాంతో కార్తీక్.. ఏమ్మా నాతో ఉండాలని లేదా అని అడగ్గా.. అందరం కలిసి ఉంటామని అమ్మా, నానమ్మ చెప్పారు డాడీ అని హిమ అంటుంది. ఇక కార్తీక్ నేను ఒక్కడినే ఉంటే ఉండవా అని అడగ్గా.. హిమ కార్తీక్ చేతులను తీసేసి.. అంటే రేపు అమ్మ రాదా డాడీ అని అడుగుతుంది. దాంతో కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మరోవైపు దీప, సౌందర్య ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు అత్తయ్యా. చెప్పేసి ఉంటారా.. ఏంటి ఇంత గుబులుగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది... అదే సమయంలో సౌర్య ఫోన్ నుంచి కాల్ రావడంతో దీప ఎత్తుతుంది. హిమ ఏడుస్తూ.. సౌర్య కాదమ్మా. నేను. నువ్వు ఎప్పుడూ నిజం చెప్పవా అమ్మ. నువ్వు అన్నీ అబద్ధాలు చెప్తావేంటమ్మా. అందరం కలిసి పోతామన్నావు, కలిసి ఉందామన్నావు, డాడీ కూడా ఒప్పుకున్నాడన్నావు. ఈ నానమ్మ కూడా అవుననే అంది. డాడీని అడిగితే ఏం మాట్లాడకుండా వెళ్లిపోయాడు. నేను ఒక్కడినే ఉంటే ఉండవా అని అడిగి వెళ్లిపోయాడమ్మా. మీరెవరు నిజం చెప్పరా అమ్మా. మమ్మల్ని ఎందుకు ఇలా ఏడిపిస్తారు. మాట్లాడమ్మా. చెప్పమ్మా అని ప్రశ్నిస్తూ ఉండగా.. సౌర్య ఫోన్ తీసుకొని.. ఏం లేదులే హిమ ఊరికే ఫీల్ అవుతుంది. నువ్వు హిమ మాటలు ఏం పట్టించుకోకు ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఆ తరువాత ఊరుకో హిమ.. మనకేం తెలుసు. అమ్మ రేపు అని చెప్పింది కదా. రేపు కలుస్తుందేమో. అది ఇప్పుడే ఎందుకు అడిగేశావు. ఏడవకు అని అంటుంది. ఆ తరువాత శ్రావ్య, ఆదిత్యలు హిమ, సౌర్యలను తీసుకెళతారు.
ఇక దీప ఏడుస్తూ.. ఏం జరుగుతుంది..అత్తయ్య డాక్టర్ బాబుతో చెప్పలేదా.. పిల్లలు ముందే మేం కలవబోతున్నాము అని చెప్పేశారా.. మౌనంగా వెళ్లిపోయాడంటే అత్తయ్య చెప్పలేదనే కదా అర్థం అని సోఫాలో పడుతుంది. హిమ దృష్టిలో నేను అబద్ధం చెప్పిన దాన్ని అయ్యానే.. కలవబోయే విషయం ముందే చెప్పేసరికి ఆయన ఏం సమాధానం చెప్పాలో తెలీక వెళ్లిపోయి ఉంటారు. హిమకు ఎలాగోలా సర్దిచెప్పొచ్చు. కానీ డాక్టర్ బాబుతో అత్తయ్య మాట్లాడే వరకు నాకు ఈ టెన్షన్ తప్పదేమో అని దేవుడి దగ్గరకు వెళుతుంది. దేవుడికి మొక్కుకుంటూ అత్తయ్య ఈ విషయం డాక్టర్ బాబుతో చెప్పాక, ఆయన నిజాన్ని విన్నాక అప్పుడు గానీ మా కుటుంబం కలవదు. చెప్తే వింటారా.. వింటే నమ్ముతారా.. అని అనుకుంటూ ఉంటుంది.
ఇక మురళీకృష్ణ ఇంటికి వస్తాడు. తన ఇంట్లో పరిస్థితిని చూసి పక్కింటికి వచ్చానేమో అని వెళ్లిపోతుంటాడు. అదే సమయానికి భాగ్యం పూజ చేస్తూ ఉంటుంది. ఆమెను చూసి నువ్వా.. నువ్వేనే అని అనగా.. అబ్బా ఇటు రావయ్య అని చెప్పి మురళీకృష్ణ కాళ్లకు మొక్కుతుంది. వెంటనే మురళీకృష్ణ.. నా పెళ్లానికి ఏమో అయ్యింది. ఎవరో భక్తురాలు చచ్చి నా భార్యకు పట్టుకున్నట్లు ఉంది అని ఇరుగు పొరుగు వారిని పిలుస్తుంటాడు. ఇక భాగ్యం.. నాకు దెయ్యం పట్టుకోవడం ఏంటయ్యా. వస్తే గిస్తే దాన్ని పట్టుకుంటా నేను. నాకు భక్తి పట్టుకుంది. పుణ్య క్షేత్రాలన్నీ తిరగే సరికి నాలో అఙ్ఞానం తగ్గి విఙ్ఞానం పెరిగి పతివ్రత్యం మీద పరిఙ్ఞానం పెరిగి ఇల్లు అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి.. ఇలాంటి ప్రవచనాలన్నీ వినీ వినీ నేను మారిపోయానయ్యా అని అంటుంది. వెంటనే మురళీకృష్ణ.. భాగ్యం నీకు భక్తి పెరిగిందా.. ముదిరిందా అని అనగా.. గంగలో మునిగాక బ్రెయిన్లో వ్యర్థాలన్నీ తొలిగిపోయాయి అని అంటుంది. అంటే నీ బ్రెయిన్ కొట్టుకుపో్యిందా. అదే కదా వ్యర్థమైంది అని మురళీకృష్ణ అనగా.. చూడు పతే ప్రత్యక్ష దైవం అని తెలుసుకున్నా. కాబట్టి బతికిపోయావు. పైగా వచ్చే వారం నేను వ్రతం చేయాలనుకుంటున్నా తెలుసా అనగా. వ్రతమా, నీ చేతిలో నేను ఖతమా అని మురళీకృష్ణ అంటాడు. వెంటనే భాగ్యం.. చీచీ అవేం మాటలయ్యా అని నల్లపూస దండను ముక్కుకుంటుంది. అవేంటే నల్లపూసలే ఉన్నాయి, తాళి ఎక్కడా అని అడగ్గా.. ఇందాక ఫ్రిజ్‌లో పెట్టానయ్యా. నా పసుపు కుంకుమ పచ్చగా ఉండాలని అని భాగ్యం అనగా.. మరి నీ పసుపు కుంకాలను ఏం చేశావు అని అడగ్గా.. అవి డీఫ్రిజ్‌లో పెట్టానయ్యా. ఇంకా చల్లగా ఉండాలని అని అంటుంది.
సరేగానీ నేను చేయబోయే వ్రతానికి అతిరథ మహారథులు రావాలి అని భాగ్యం అనగా.. వాళ్లు ఎక్కడ ఉంటారే అని మురళీకృష్ణ అడుగుతాడు. దానికి భాగ్యం అయ్యో మన వియ్యంకుల వారయ్యా అని చెబుతుంది. సౌందర్య వదిన, ఆనందరావు అన్నయ్య, శ్రావ్య, ఆదిత్య, నా మనవడు దీపుతో పాటు మన దీప, డాక్టర్ బాబును కూడా పిలవాలి అని అంటుంది. ఏంటి దీప, డాక్టర్ బాబును మన ఇంటికి పిలవాలా.. నువ్వు ఎలాంటి కోరికను అడుగుతున్నావో తెలుసా..నిజంగా పోయింది వ్యర్థాలు కాదే. నీ మెదడు అని అంటాడు. ఇక భాగ్యం.. నువ్వు ఎవరు మురళీకృష్ణ. మురళీకృష్ణ అంటే ఎవరు బాహుబలికి డూప్లికేట్. నువ్వు తలుచుకుంటే శివలింగాన్నే ఎత్తగలవయ్యా.. నీ బలం నీకు తెలీదు. నువ్వు అమ్మా దీప అంటే దీప వస్తుంది. అయ్యా డాక్టర్ బాబు అంటే అల్లుడు వస్తాడు. అందరూ వస్తేనే నేను వ్రతం చేస్తాను. తీసుకురాకపోయావే నిరాహార దీక్ష చేస్తాను అని అనగా.. ఆ పని చేయవే కాస్త ఒళ్లు అయినా తగ్గుతుంది అని మురళీకృష్ణ అంటాడు. వెంటనే భాగ్యం.. అంతేగానీ నా మాట వినవా.. వంటలక్కకు, డాక్టర్ బాబును పిలవవా అనగా.. పిలవలేను అని మురళీకృష్ణ అంటాడు. దానికి భాగ్యం.. నో నేను ఒప్పుకోను. నువ్వు వాళ్లిద్దరిని పిలవాల్సిందే అని చెబుతుంది. వెంటనే మురళీకృష్ణ.. అరవకే.. తీర్థయాత్రల ద్వారా నీకు పిచ్చి కుదురుతుంది అనుకున్నాను. ఇలా భక్తి ముదురుతుంది అనుకోలేదు. సరే వచ్చే వారం కదా. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. సరే కానీ ఆకలవుతుంది అన్నం పెడతావా అని అడగ్గా.. ఇవాళ ప్రసాదం పెడతాను. అర్ధ పావులో చెరో చటాకు అని అంటుంది.
ఇక కార్తీక్, అంజి దగ్గరకు వచ్చి.. అంజి కారు ఏంటి యాక్సలేటర్ రైజ్ చేస్తుంటే సౌండ్ వస్తుంది అనగా.. అవును సర్ అని అంజి సమాధానం చెప్తాడు. వెంటనే కార్తీక్.. అవును కాదు ఒకసారి మెకానిక్‌కి చూపించు, మధ్యలో బ్రేక్‌డౌన్ అయితే ఎలా అని అంటాడు. అలాగే ఆ డిక్కీలో చాలా చెత్త ఉంది ఒకసారి క్లీన్ చేయ్యి అంటాడు. దానికి అంజి సరే అంటాడు. ఇక కార్తీక్ దగ్గరకు వచ్చిన సౌందర్య.. పెద్దోడా.. నీతో కొంచెం మాట్లాడాలి. ఇలా రా అని పక్కకు తీసుకెళుతుంది. ఆ తరువాత పెద్దోడా.. నువ్వు ఇన్ని రోజులు దేంతో మదనపడుతున్నావో, ఏ అనుమానంతో ప్రతిక్షణం నరకం అనుభవిస్తున్నావో ఆ సంగతి చెప్పాలనే పిలిచాను రా అని అంటుంది. ఏంటది అని కార్తీక్ అడగ్గా.. ఈ సంగతి తెలిశాక నేను ఎంత ప్రశాంతంగా ఉన్నానో.. నువ్వు కూడా నీ భ్రమల నుంచి బయటపడిపోతావు అని సౌందర్య అంటుంది. ఆ మాటలకు మోనిత గుర్తు చేసుకుంటాడు. ఇక తన సంభాషణను కొనసాగిస్తూ సౌందర్య.. ఈ మ్యాటర్ నీకు చెప్తామని ఎంత ఆత్రంగా వచ్చానో తెలుసా. భగవంతుడు ఇంత త్వరగా ఈ నిజాన్ని బయటపెడతాడు అనుకోలేదురా. పోనిలే మొత్తానికి మీ కాపురం చక్కగా సాగే అదృష్టం దొరికింది అని అంటుడగా.. ఏంటి మమ్మీ అది అని కార్తీక్ అడుగుతాడు.
అదేరా.. ఆ విహారీ లేడు. తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదట. ఎప్పటికీ అతడికి సంతానం కలగదని డాక్టర్లు చెప్పారట అని అంటుండగా.. మధ్యమధ్యలో అంజికి పనిని పురమాయిస్తుంటాడు కార్తీక్. ఇక సౌందర్య.. మీ సంసారంలో కూడా వచ్చిన మరకలను తుడిచే ఛాన్స్ ఇప్పుడు నీ చేతిలో ఉంది. దీప మీద కూడా మచ్చ పడింది. అసలు విహారికి పిల్లలే పుట్టరని తెలిశాక ఇక ఏ మచ్చా లేనట్లే. ఇక నీ మనసులో ఏ సందేహాలున్నా తుడిచేయ్ కార్తీక్. దీపను తీసుకురా. కార్తీక్ వింటున్నావా.. దీప నిప్పురా. వెంటనే తీసుకువచ్చేద్దామా అని అనగా.. అంతా నాకు చెప్పేవాళ్లే, మాయ చేసేవాళ్లే అని కార్తీక్ అంటాడు. పెద్దోడా ఇంతకు అనగా.. బాగా ఇబ్బందిగా ఉంది. అదే కారు. కంపెనీ వాడేమో బ్రాండెడ్ సర్ అంటాడు. తీరా చూస్తే అన్నీ ట్రబుల్సే. అన్బేరబుల్. భరించలేనంతగా ఇబ్బంది పెడుతుంది. అర్జెంట్‌గా మార్చేయాలి. ఎన్నాళ్లని భరిస్తాము. మార్కెట్లోకి మంచి కారు వచ్చిందట. మోనిత చెప్పింది. తను చెప్తే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గానే ఉంటుంది అని అక్కడి నుంచి అంజి దగ్గరకు వెళ్లి.. అలా చూస్తావేంటి.. ఇక్కడ చూడి ఎలా ఉందో అని అంటుంటాడు.ఇక సౌందర్య మనసులో వీడికి ఎంత చెప్పినా వినేలా లేడు అనుకొని లోపలికి వెళుతుంది.
మరోవైపు దీప ఇంటికి మురళీకృష్ణ వెళతాడు. దీప పాయసం చేస్తూ ఉంటుంది. ఆ వాసనను చూసి ఏవో పిండి వంటలు చేస్తున్నట్లు ఉంది మనవరాళ్లు అడిగినట్లు ఉన్నారు అని అనుకుంటూ దీపను పిలుస్తాడు. వెంటనే దీప బయటకు రాగా.. ఏంటమ్మా. ఏదో స్వీట్ చేస్తున్నట్లు ఉన్నావు. ఏంటమ్మా విశేషం, అల్లుడు గారి నుంచి ఏవైనా అని మురళీకృష్ణ అడుగుతుండగా.. మంచి నీళ్లు తాగుతావా నాన్న అని లోపలికి వెళుతుంది. వెంటనే మురళీకృష్ణ.. ఏమైందమ్మా అని ప్రశ్నించగా.. ఏం కాలేదు నాన్న అని దీప అంటుంది. లేదమ్మా. నాకు ఏదో అనుమానంగా ఉంది అని మురళీకృష్ణ అడగ్గా.. నరాలు తెగిపోయి చచ్చిపోతానేమోనని భయంగా ఉంది నాన్న అని దీప అంటుంది. అంత మాట ఎందుకు వచ్చిందమ్మా. అంత పెద్ద సమస్య మళ్లీ ఏమొచ్చింది. ఏమైందమ్మా అని మురళీ కృష్ణ అడుగుతాడు.
దానికి దీప.. పరీక్ష ఎదురైంది నాన్న. అందుకే టెన్షన్ మొదలైంది. ఆందోళన పెరిగినప్పుడు ఖాళీగా ఉంటే చెమటలు పట్టేసి గుండెదడ పెరిగిపోయి తలలో నరాలు చిట్లిపోతాయేమో అనిపిస్తుంది. అందుకే ఏదొక వ్యాపకం పెట్టుకుంటున్నాను. ఇవాళ అది మరింత పెరిగిపోయి మెదడంతా గందరగోళంగా మారిపోయి అని అంటుండగా.. అర్థమైంది. ఏదో ఒక ఆలోచన నిన్ను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ముందు నువ్వు ఇలా కూర్చో. ప్రశాంతంగా కూర్చో అమ్మా అని కుర్చీలో కూర్చోబెడతాడు. ఇక దీప కాళ్ల దగ్గర మురళీకృష్ణ కూర్చోగా.. నాన్న అని లేపుతుండగా.. ఏం కాదులేమ్మా నీ తండ్రినే కదా అని మురళీకృష్ణ అంటాడు. వెంటనే గతాన్ని తలచుకొని దీప నవ్వుతూ, ఏడుస్తూ ఉంటుంది. వెంటనే మురళీకృష్ణ అమ్మా దీప అనగా.. నా వల్ల కావడం లేదు నాన్న అని ఏడుస్తూ ఉంటుంది. దానికి మురళీకృష్ణ.. ఇప్పుడు నిన్ను అంతలా కలవరపెడుతున్న ఆ సమస్య ఏంటో చెప్పుకుంటేనే ఇప్పుడు నీ గుండె భారం తగ్గిపోతుందమ్మా అని అంటాడు. దానికి దీప.. ఇది నా జీవన్మరణ సమస్య నాన్న. భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మా అత్తగారు వదులుకోవద్దు అని చెప్పారు. నా తరఫున నిలబడి నా కాపురాన్ని నిలబెట్టే ప్రతినిధిలాగా మధ్యవర్తిత్వం చేయడానికి వెళ్లారు. పాసో , ఫెయిలో అర్థం కాగా నలిగిపోతున్నాను అని అంటుంది. అవునా నిజమా.. అంత మంచి అవకాశం నీకు ఏ రూపంలో వచ్చిందమ్మా అని మురళీకృష్ణ అడగ్గా.. తులసి రూపంలో అని దీప చెబుతుంది.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.