KARTHIKA DEEPAM SERIAL UPDATE KARTHIK KNOWS DEEPA ADDRESS ELSEWHERE DEEPA IS IN HOSPITAL MNJ
Karthika Deepam: దీప అడ్రస్ తెలిసి పిల్లల కోసం బయలుదేరిన కార్తీక్.. ఆసుపత్రిలో చేరిన వంటలక్క
కార్తీక దీపం
Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్తీక దీపం సీరియల్ రసవత్తరంగా కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్లో కార్తీక్ ప్రవర్తనతో విసుగుచెందిన ఆనందరావు వీడు మారడు అని డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి వెళ్లిపోతాడు. ఆ తరువాత కార్తీక్, సౌందర్య మధ్య సంభాషణ కొనసాగుతుంది. ఇవాళ్టి ఎపిసోడ్లో వారి మధ్య సంభాషణ కొనసాగుతుంది. ఆస్తి కోసం పిల్లలను అమ్ముకునేంత స్థాయికి దిగజార్చకురా ఒక అమ్మను అని అనగా
Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్తీక దీపం సీరియల్ రసవత్తరంగా కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్లో కార్తీక్ ప్రవర్తనతో విసుగుచెందిన ఆనందరావు వీడు మారడు అని డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి వెళ్లిపోతాడు. ఆ తరువాత కార్తీక్, సౌందర్య మధ్య సంభాషణ కొనసాగుతుంది. ఇవాళ్టి ఎపిసోడ్లో వారి మధ్య సంభాషణ కొనసాగుతుంది. ఆస్తి కోసం పిల్లలను అమ్ముకునేంత స్థాయికి దిగజార్చకురా ఒక అమ్మను అని అనగా.. నా బిడ్డ కావాలంటే ఏం చేయాలో, ఇంకేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు మమ్మీ అని కార్తీక్ అంటాడు. నేను ఏమన్నా పిల్లలకు అన్యాయం చేశానా.. హిమ అనాథ అని తెలిసినప్పుడు ఎంత ప్రేమించానో, అది దీప కూతురు అని తెలిసిన తరువాత కూడా అంతే ప్రేమించాను కదా.. సౌర్య, దీప కూతురు అని తెలిసినా ఏ రోజు అయినా దాన్ని ఇబ్బంది పెట్టే మాట అన్నానా..తెచ్చి హిమను ఎలా చూసుకున్నానో, అంతకన్నా ఎక్కువగానే చూసుకున్నాను. సౌర్య నా దగ్గర ఉన్న నాలుగు రోజుల్లో అది పోగొట్టుకున్న నాన్న ప్రేమను అంతా ఇచ్చాను. నేనేం పుట్టుకతో ముడిపెట్టి పిల్లలను దూరం పెట్టలేదే. మరి నాకు ఆ ఇద్దరు పిల్లలు దూరం అయిపోతే బాధ ఉండదా.. నా వైపు నుంచి ఎవరు ఎందుకు ఆలోచించరు మమ్మీ. అఙ్ఞానిలాగే అడుగుతున్నాను ఙ్ఞానిగా సమాధానం చెప్పు అని కార్తీక్ అనగా.. నీ ప్రశ్నను ఒక స్త్రీగా జవాబు చెప్పనా, ఒక తల్లిగా జవాబు చెప్పనా, ఒక అత్తగా చెప్పనా, నానమ్మగా చెప్పనా.. ఏం చెప్పనురా. నీ ప్రేమ నిజం. మా నమ్మకం నిజం. ఈ రెండింటి సరిహద్దు రేఖ మీద నిలబడి నువ్వు, ఏ వైపు వెళతావో తెలీక మేము, మా అందరికీ ఆ సరిహద్దు ఎప్పుడు చెరిపోతుందా అన్న ఆశ.. నీకు ఒక ఆట, ఆడపిల్లలు ఆటబొమ్మలు కాదురా. ఆడుకునేటప్పుడు ఒక చోట, ఆట ముగిశాక అటకమీద ఉండటానికి అని సౌందర్య అంటుంది.
మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు మమ్మీ. ఎప్పుడు చెప్పే మాట కాదు, అది వినను. ఇంకో పరిష్కారం చెప్పు, అమ్మ మాటగా వింటాను అని కార్తీక్ అనగా.. నువ్వు నిజంగా పిల్లల మీద ప్రేమతో వాళ్ల క్షేమం గురించి, వారి భవిష్యత్ గురించి, వాళ్లకు జీవితాంతం ఉన్న సెక్యూరిటీ గురించి ఆలోచించేవాడివే అయితే అమ్మగా ఒక పరిష్కారం చెబుతాను అని సౌందర్య అంటుంది. చెప్పు అని కార్తీక్ అడగ్గా.. నీకు దీప భార్యగా అక్కర్లేదు. ఆ బిడ్డలకు తల్లిగా తీసుకురా. పోనీ అలా కూడా కాదు అంటావా..నా ఇంటి కోడలిగా తీసుకురా. అంతే తప్ప పిల్లల కోసం, పిల్లను, తల్లిని వేరు చేయకు. అది న్యాయం కాదు, భావ్యం కాదు. అమానుషం అని సౌందర్య అనగా.. ప్లేట్లో చేయిని కడుక్కొని అక్కడి నుంచి వెళతాడు కార్తీక్.
ఇక భాగ్యం, మురళీకృష్ణకు ఫోన్ చేయగా.. వారిద్దరి మధ్య కాసేపు సంభాషణ కొనసాగుతుంది. దీప కనిపించిందా అని భాగ్యం అడగ్గా.. కళ్ల ముందు కనిపిస్తుంది, కలలాగే కరిగిపోతుంది అని మురళీకృష్ణ అంటాడు. భ్రమపడుతున్నావా. అసలే ఎండలు మండుతున్నాయి. వెనక్కి వచ్చేయకూడదు అని భాగ్యం అడగ్గా.. నువ్వేదో వ్రతం చేస్తున్నావు కదా దాని వల్ల నాకేం కాదులే అని మురళీకృష్ణ అంటాడు. ఇక తొందరగా వెతికి దీపను తీసుకురా, వాళ్ల అత్తగారు మనిషి మనిషిలా లేరు, మనసు మనసులో లేదు అని భాగ్యం ఇంకా ఏదో చెప్పబోతుండగా.. మురళీకృష్ణ ఫోన్ పెట్టేస్తాడు.
ఇక మోనిత ఇంట్లో ప్రియమణికి టీ తీసుకురమ్మని చెబుతుంది. ఇవాళ హాస్పిటల్‌కి వెళుతున్నారా అమ్మా అని ప్రియమణి అడగ్గా. అవును చాలా మంది పేషెంట్లు నేను లేనని వెనక్కి పోతున్నారంట అని అంటుంది. ఇంతకు దీప, పిల్లలు శ్రీకాకుళంలో ఉన్నట్లు కార్తీక్ అయ్యకు చెప్పారా అమ్మ అని ప్రియమణి అడగ్గా.. శ్రీకాకుళంలో కాదే పిచ్చిమొహమా విజయనగరంలో ఉన్నారు. విజయనగరంలో గంట స్తంభం దగ్గరే ఉంటున్నారు అని మోనిత అంటుంది. ఒక గంట ముందు నేను వెళ్లి ఉంటే బావుండేది. ఆ మురళీకృష్ణ వాళ్లను వెతుక్కుంటూ వెళ్లాడు.అదే సమయానికి మోనిత గుమ్మం దగ్గరకు వచ్చిన కార్తీక్ ఆ మాటలను వింటాడు. పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలిసిపోయింది, హిమ, సౌర్య ఎక్కడున్నారో తెలిసిపోయింది అని అనుకుంటాడు. ఇక మోనిత తన మాటలను కంటిన్యూ చేస్తూ.. నాకు నచ్చనిది అబద్ధం చెప్పడం, కార్తీక్‌కు అబద్ధం అంటే అసహ్యం అని అనగా.. మరి నాకు నిజం ఎందుకు చెప్పనట్లు అని బయట కార్తీక్ అనుకుంటాడు. లోపల మోనిత.. ఆ మురళీకృష్ణ వారిని వెతుక్కుంటూ వచ్చాడు అనగా.. ఆ మురళీకృష్ణ అక్కడే ఉంటే మా అమ్మ అంత ఖర్చు పెట్టి వాళ్లను వెతకడానికి పంపిస్తే కనీసం మమ్మీకి కూడా చెప్పలేదా.. ఇవన్నీ కాదు. నాకు నా పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలిసింది. అంతకన్నా సంతోషం ఇంకేం లేదు. నాకు కావల్సింది నా పిల్లలు, ఇక దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని కారులో విజయనగరం బయలుదేరుతాడు కార్తీక్.
ఇక దీప బండి దగ్గర కస్టమర్లకు అన్నీ అందిస్తూ.. కళ్లు తిరిగి పడిపోతుంది. ఆ తరువాత మురళీకృష్ణ, వారణాసిని పిలిచి దీపను ఆసుపత్రికి తీసుకెళతారు. మరోవైపు కార్తీక్ కారులో వెళుతూ మోనిత మాటలను గుర్తు చేసుకుంటాడు. మోనిత కూడా నా దగ్గర నిజం దాచింది. మురళీకృష్ణ వెళ్లకపోయి ఉంటే మోనితనే హిమను తీసుకొచ్చేది. అప్పుడు నేను మాట ఇచ్చినట్లు పెళ్లి చేసుకుంటానని ఆశ పడిందా.. ఈ మాట నాకు ముందే చెప్తే పెళ్లి చేసుకోనని దాచిందా.. ఏదేమైనా మోనిత నా దగ్గర దాచడం తప్పు. పోనీలే నాకు నా పిల్లలు ముఖ్యం, అడ్రస్ అయినా మోనిత వల్లనే తెలిసింది కదా. మా వాళ్లకు తెలిస్తే నేను పూర్తిగా దిగొచ్చేదాకా చెప్పకూడదని దాచి ఉంటారు. ఆ మురళీకృష్ణలాగే అనుకుంటాడు.
మరోవైపు దీప ఆసుపత్రిలో బెడ్‌పై ఉంటుంది. అటుగా మురళీకృష్ణ రాగా.. పిల్లలు ఇద్దరే ఉన్నారు. తోడుగా ఎవరూ లేరు. డాక్టర్ ఉండమని ఏం చెప్పలేదు కదా అని దీప అడగ్గా.. లేదమ్మా అని మురళీకృష్ణ అంటాడు. అసలు ఏమన్నారు డాక్టర్. నాకు మళ్లీ మాయదారి రోగం మొదలైందంటనా, నన్నుపీల్చి పిప్పి చేయడానికి, వేలకు వేలు డబ్బులు ఖర్చు చేయడానికి, నా ఓపికను పరీక్షించడానికి ఏదైనా కొత్త దరిద్రం పట్టబోతుందా అని దీప అడగ్గా.. ఏం లేదని చెప్పారమ్మా, నీరసం మాత్రమేనంట. ఎందుకైనా మంచిది అని మురళీకృష్ణ ఆగిపోగా.. ఏమైంది అని దీప అడగుతుంది. పెద్దాసుపత్రిలో కొన్ని టెస్ట్‌లు చేయమన్నారు. అవే రాశారు అని మురళీకృష్ణ అనగా.. చింపి చెత్త బుట్టలో పడేసేయ్ నాన్న అని దీప అనగా.. అదేంటమ్మా నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నేను చేయిస్తాను కదా. ఖర్చుకు నువ్వేం భయపడకు అమ్మా అని మురళీకృష్ణ అంటాడు. నీ దగ్గర డబ్బు ఉంటే నీది మాత్రం డబ్బు కాదా. వద్దు నాన్న. ఇప్పుడేంటి మనం వెళ్లొచ్చు అన్నారా అని అనగా.. అవును వారణాసి బయట ఆటోలో ఉన్నాడు అని మురళీకృష్ణ అంటాడు.
ఆ సమయానికి భాగ్యం, మురళీకృష్ణకు ఫోన్ చేస్తే కట్ చేస్తాడు. మా అత్తయ్య గారా నాన్న అని అడగ్గా.. మీ పిన్ని అని మురళీకృష్ణ అంటాడు. అక్కడ పిన్ని ఒక్కడే ఒంటరిగా ఎలా ఉంటుందో అని దీప అనగా.. నేను వెళ్లిపోతే నువ్వు ఇక్కడ ఇద్దరు పిల్లలను పట్టుకొని ఒంటరిగా ఉండాలి కదమ్మా అని మురళీకృష్ణ అనగా.. తప్పదు కదా. నా తలరాత అదే కదా. చచ్చే దాక అలానే బతకాలి కదా అని దీప అనగా.. నా మాట విని మీ అత్త గారికి ఫోన్ చేసి చెబుదాం అమ్మా. ఈ సారి ఆవిడ నిన్ను ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే పెట్టుకుంటుంది అని మురళీకృష్ణ అంటాడు. దానికి దీప.. నన్ను వెళ్లి ఆవిడ ఇంట్లో పెట్టుకుంటే వాళ్ల కొడుకు వెళ్లి ఆ మోనిత ఇంట్లో దుకాణం పెడతాడు. కోడలి కోసం కొడుకును దూరం చేసుకుంటారా అని అంటుంది. వెంటనే మురళీకృష్ణ కాదమ్మా. ఈ టెస్ట్‌లు అవీ చూస్తుంటే ఎందుకో నాకు భయంగా ఉంది. అక్కడైతే అని అనగా.. అందరూ ఉంటారు. అత్త, మామ, మరిది, చెల్లెలు అందరూ ఉంటారు. ఉండాల్సిన ఆయన మాత్రం ఇంట్లో ఉండరు. ఆయనంతకు ఆయన నిజం తెలుసుకొని నా దగ్గరకు వచ్చి రమ్మంటే అంతకుముందు ఎన్ని మాటలు అంటే ఏంటి, ఎన్ని తిడితే ఏంటి. పనికిమాలిన సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలిపడేసి మొగుడు దగ్గరకు నేను వెళతాను. నా పిల్లల భవిష్యత్ కన్నా నా ఆత్మగౌరవం ఎక్కువ కాదని ఇన్ని రోజులు ఎదురుచూశాను కదా. రమ్మంటే రానంటానా, పొమ్మంటే పోలేదా. ఊరు విడిచి వచ్చేశాను కదా అని దీప అంటుంది. ఇంటికి వెళ్లగానో బోలెడు పనులు ఉన్నాయి అని దీప అనగా.. పోనీ రేపు ఇడ్లీ బండి తెరవద్దులేమ్మా అని మురళీకృష్ణ అంటాడు. భలే వాడివి నాన్న, ఇలా ఏవో కారణాలకు బండి తెరవకపోతే కస్టమర్లు ఇటువైపు రారు నాన్న.ఒక్క రోజు కూడా మూతపడకూడదు. డాక్టర్ ఏం లేదని అన్నాడని నువ్వే కదా చెప్పావు అని అంటుంది. ఇద్దరు ఆసుపత్రి నుంచి బయలుదేరతారు.
మరోవైపు సౌర్య ఇంటిని శుభ్రం చేస్తుండగా.. తాతయ్య ఎప్పుడు వస్తాడు అని హిమ అడుగుతుంది. అమ్మను తీసుకొని రావాలి కదా అని సౌర్య అనగా.. ఇంకా లేటు అవుతుందా అని హిమ అంటుంది. అవును ఇంకో గంట అయినా పట్టొచ్చు, ఎందుకు అని సౌర్య అడగ్గా.. ఏం లేదులే అని హిమ నీళ్లు తాగేందుకు వెళుతుంది. అది చూసిన సౌర్య.. హిమ ఏం లేదు అంటావేంటి ఆకలి అవుతుందని చెప్పొచ్చు కదా అని అనగా.. నీకు ఎలా తెలుసు అని హిమ అడుగుతుంది. నాకు ఆకలి వేస్తుందని సౌర్య అనగా.. ఇప్పుడెలా పొద్దుటి ఇడ్లీలు ఉన్నాయేమో చూద్దామా అని హిమ అంటుంది. దానికి సౌర్య.. వద్దు, ఉన్నా అవి బావుండవు అనగా.. మరి ఏం చేద్దాం అని హిమ అనగా.. నేను ఇందాక మనకోసం బ్రెడ్, జామ్ తెప్పించాను రా తిందాం అని సౌర్య అంటుంది. నువ్వు సూపర్ సౌర్య అని హిమ అంటుంది. ఆ తరువాత ఇద్దరు బ్రెడ్ జామ్ తినేందుకు కూర్చుంటారు. బెడ్‌కు జామ్ పూసి సౌర్య, హిమకు ఇవ్వగా.. ముందు నువ్వు తిను అని హిమ అంటుంది. ఎవరికైనా ఆకలేస్తే ఆపుకోలేరు కదా అని హిమ అనగా.. నేను ఆపుకోవడం అలవాటు చేసుకున్నానులే. ఒక్కోసారి ఇంట్లో బియ్యం అయిపోతే అమ్మ అప్పు తెచ్చి బియ్యం తెచ్చేదాకా నాకు ఆకలి వేసినట్లు ఉండేదాన్ని కాదు. పాపం అమ్మకు కూడా ఆకలేస్తూ ఉండేది. అయినా ముందు నాకే తినిపించేది అని సౌర్య అంటుంది. ఆ తరువాత తిను అని హిమకు బ్రెడ్ ఇస్తుంది. కార్తీక దీపం కొనసాగుతుంది.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.