Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్లో సౌర్య, హిమకు బ్రెడ్‌కు జామ్ పూసి తినమని ఇస్తుంది. తనకు ఆకలిని చంపుకోవడం అలవాటు అయ్యిందని సౌర్య చెబుతుంది. హిమ మాట్లాడుతూ.. నాకేం ఇంట్లో తినడానికి బోలెడు ఉండేవి. చేసి పెట్టడానికి మాలతి ఉండేది. శ్రావ్య పిన్ని కూడా ఏది అడిగితే అది చేసి ఇచ్చేది. అమ్మ గనుక ఆ ఇంట్లో ఉండకుండా నానమ్మ ఇంట్లో ఉండి ఉంటే నీకు, అమ్మకు ఎప్పుడూ ఆకలేసేదే కాదు. టైమ్‌కి అన్నీ రెడీగా ఉండేవి కదా అని హిమ అంటుంది. దానికి సౌర్య మాట్లాడుతూ.. ఇప్పుడు మనకు ఒక సాకు దొరికింది. ఆ పని చేస్తే అమ్మను నాన్న కాకపోయినా నానమ్మ వచ్చి తీసుకెళుతుంది అనగా.. ఏంటది అని హిమ అడుగుతుంది. అమ్మకు ఆరోగ్యం బాలేదు కదా అని సౌర్య అనగా.. అయితే అని హిమ అనగా.. నాన్న అంత పెద్ద డాక్టర్ అయ్యి కూడా అమ్మకు అంత చిన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం నాకు నచ్చలేదు అని సౌర్య అనగా.. నాకు బాధగానే ఉంది, అయినా ఏం చేస్తావు అని హిమ అనగా.. నేను నాన్నకు ఫోన్ చేస్తాను అని సౌర్య అనగా.. చేసి అని హిమ అనగా.. అమ్మకు బాలేదని చెప్పి వచ్చి అమ్మను, మనల్ని తీసుకెళ్లమని చెప్తాను. అక్కడైతే అందరూ ఉంటారు. అమ్మ మన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకొని తొందరగా కోలుకుంటుంది. ఇక్కడైతే అమ్మ మళ్లీ ఇడ్లీ బండి దగ్గరే కష్టపడాలి. ఉన్న ఆరోగ్యం పాడు అయిపోతుంది. అమ్మకు ఏదైనా అయితే అందుకే నాన్నకు ఫోన్ చేసి చెబుతాను అని సౌర్య అనగా.. నాన్న వచ్చి మన ఇద్దరినే తీసుకెళతాను అంటే అమ్మను వదిలేసి పోదామా అని హిమ అడగ్గా.. ఛీ ఛీ అలా ఎలా వదిలేసి పోతాము అని సౌర్య అనగా.. నాన్న వస్తే అదే జరుగుతుంది. అందుకే ఫోన్ చేయకు అని హిమ అనగా.. అవును కదా అయితే అస్సలు చేయను అని సౌర్య అంటుంది. ఆ తరువాత నిజమే నాన్న మన ఇద్దరినీ తీసుకెళితే, అసలే అమ్మకు బాలేదు. ఏమైపోతుంది అని సౌర్య బాధపడుతుండగా.. ఊరుకో సౌర్య తిను అని హిమ చెబుతుంది.
మరోవైపు మోనిత, కార్తీక్‌కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే కార్తీక్ ఫోన్ కట్ చేస్తుంటాడు. దానికి మోనిత.. ఏమైంది. కార్తీక్ నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేయడం లేదు ఎందుకు, ఏం జరుగుతుంది. నాకు వ్యతిరేకంగా ఏమైనా జరుగుతుందా.. ఏమైపోతుంది. ఒకవేళ ఆ మురళీకృష్ణ గానీ దీపను, పిల్లలను ఇంటికి తీసుకువచ్చాడా.. పిల్లలతో ఉండి నన్నుపట్టించుకోవడం లేదా.. ఏదో అయ్యింది. అది తెలుసుకోవడం ఎలా ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తరువాత ఎక్కడికో బయలుదేరుతుంది.
ఇక దీప ఇంటికి రాగా.. ఆ సమయానికి సౌర్య ఒడిలో హిమ నిద్రపోతూ ఉంటుంది. అక్కా కూర్చో అక్క, ఎలా ఉంది అక్క అని చలం అడగ్గా.. నాకేం పర్లేదు చలం అని దీప అంటుంది. ఇక చలం, వారణాసిలను ఇంటికి వెళ్లమని మురళీకృష్ణ చెబుతాడు. వస్తామక్కా అని వారిద్దరు అక్కడి నుంచి వెళతారు. ఆ తరువాత పిల్లలను చూసి.. నాకు ఏమైనా అయితే వీళ్లు ఏమైపోతారు అని మనసులో అనుకుంటుంది. ఇక అమ్మ వచ్చింది లేయ్ అని సౌర్య, హిమను లేపగా.. పడుకోనిలేమ్మా అని దీప అంటుంది. నువ్వు ఇంకా రాలేదని అడిగి అడిగి పడుకుందమ్మా. వస్తే లేపమని చెప్పింది అని సౌర్య అంటుంది. ఇక ఇద్దరు దీప దగ్గరకు వెళ్లగా.. ఎలా ఉందమ్మా. ఏమైందమ్మా అని సౌర్య అడగ్గా.. ఏదో కాస్త నీరసం అంతే అని దీప అంటుంది. ఆ తరువాత ఏమైనా తిన్నారా అని దీప అడగ్గా.. బ్రెడ్ తిన్నాము అని సౌర్య చెబుతుంది. ఇదుగో మీ కోసం భోజనం తీసుకొచ్చాము. తాతయ్యతో కలిసి తినండి అని దీప చెప్పగా.. మరి నువ్వు అని సౌర్య అడగ్గా.. నాకు వాంతి వచ్చేలా ఉంది. పాలు తాగి పడుకుంటాను అని దీప చెబుతుంది. నీకు ఈ టిఫిన్ సెంటర్ పెట్టినప్పటి నుంచి అస్సలు ఖాళీ లేదు కదమ్మా అని సౌర్య అడగ్గా.. ఎందుకమ్మా. నువ్వు ఇంత కష్టపడుతున్నావు. తీసేద్దాం అని హిమ అంటుంది. తీసేస్తే ఎలా బతుకుతాము అని దీప అనగా.. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా ఆలోచించడం. పదండి తిందాం అని మురళీకృష్ణ అంటాడు.
అది కాదు తాతయ్య. అమ్మ ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. టైమ్‌కు తినదు, టైమ్‌కు నిద్రపోదు. ఇప్పుడు చూడు హాస్పిటల్‌కి వెళ్లాల్సి వచ్చింది అని సౌర్య అనగా.. అమ్మ మాత్రం ఏం చేస్తుంది అమ్మా. ఈ టిఫిన్ సెంటర్ అంటే రోజంతా చాకిరి చేస్తూనే ఉండాలి అని మురళీకృష్ణ అనగా.. పోనీ నువ్వు కోలుకునేదాకా ఇంట్లోనే ఉండు అమ్మా. మేము, తాతయ్య, వారణాసి, చలం ఐదుగురుం ఉన్నాము. మేం చూసుకుంటాము సరేనా అని సౌర్య అనగా.. మీరా.. మీరు బండి దగ్గరకే రావొద్దని ఎన్ని సార్లు చెప్పాను అని దీప అనగా.. నీకు బాలేనప్పుడు కూడా రావద్దు అంటే ఎలా అమ్మా అని హిమ అనగా.. ఏం కాదు నువ్వు రెస్ట్ తీసుకో. నాలుగు రోజులే కదా మేము చూసుకుంటాములే అని సౌర్య అనగా.. వద్దు అన్నాన అని దీప అంటుంది. దానికి సౌర్య.. అయితే ఇలానే కళ్లు తిరిగి పడిపోతూ ఉంటావా..నీకు ఏదైనా అయితే నిన్ను ఎవరు చూసుకుంటారు. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు. ఇడ్లీ బండి ఎలా నడుస్తుంది. నాలుగు రోజులు చూసుకుంటే ఏమైపోతుంది. మేమేమీ ఫలానా సౌందర్య గారి మనవరాళ్లమని, డాక్టర్ బాబు కూతుర్లమని చెప్పములే అమ్మా. నువ్వు వద్దన్నా సరే కోలుకునేదాకా మేము వెళ్తాం అని కోపంగా అంటుంది. ఆ తరువాత తాతయ్య నువ్వు మాకు అన్నం వడ్డించు. నేను ఆ లోపు అమ్మకు పాలు ఇస్తాను. హిమ తాతయ్యకు ఆ ప్లేట్లు ఎక్కడ ఉన్నాయో చూపించు అని సౌర్య అనేసి అక్కడి నుంచి హిమతో పాటు వెళుతుంది. వెంటనే మురళీకృష్ణ.. అచ్చం మీ అత్తగారే అని అనగా.. స్టుపిడ్ అని తిట్టలేదు సంతోషం అని దీప నవ్వుతుంది.
మరోవైపు సౌందర్య, ఆనందరావులు కార్తీక్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వీడు ఇంత రాత్రి అయినా ఇంటికి రాలేదు అని సౌందర్య అనగా.. డాక్టర్‌కు పగలు ఏమిటి, రాత్రి ఏమిటి అని ఆనందరావు అంటాడు. దానికి సౌందర్య.. వాడు డాక్టర్లా కనిపించడం లేదు. డాక్టర్ బాబులా కనిపిస్తున్నాడు అని అనగా.. నువ్వు ఏమైనా అన్నావా అని ఆనందరావు అడుగుతాడు. చాలా అన్నాను అని సౌందర్య అనగా.. ఏ విషయంలో అని ఆనందరావు అడుగుతాడు. మన అందరం అనడానికి ఇంకేం టాపిక్ ఉంటుందండి అని సౌందర్య అనగా.. పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావించినంత మాత్రాన పపరిస్థితులు మారిపోతాయా అని ఆనందరావు అనగా.. పరిస్థితులు మారవన్న నిరాశతో ప్రయత్నాలు మానేస్తే ఫలితం ఎప్పటికీ వస్తుందండి అని సౌందర్య అంటుంది. మన ప్రయత్నాలన్నీ సమసిపోయి చాలా రోజులు అయ్యింది సౌందర్య, దీప ఓపిక పట్టి పట్టి వెళ్లిపోయింది చూశావా.. అది దీప విరక్తే కాదు. మన పెద్దరికం తాలూకూ నిస్సహాయత. ఇక్కడ న్యాయం జరగలేదని ఎప్పుడైతే వెళ్లిపోయిందో.. అప్పుడే ఈ కథ ముగిసింది అని ఆనందరావు అనగా.. మీలో ఏ మాత్రం ఆశావాదం లేదా అని సౌందర్య అడుగుతుంది. వాదించే సత్తువు లేదు అని ఆనందరావు అనగా.. మరి దీప వైపు నిలిచేదెవరు అని సౌందర్య అడగ్గా.. అసలు దీపనే లేదు, దీపను వెనక్కు తీసుకువచ్చేది ఎవరు అని ఆనందరావు అనగా.. వాడే అని సౌందర్య అంటుంది.
ఆనందరావు నవ్వుతూ ఉండగా.. నేను నిజమే చెబుతున్నానండి. వాడికి నేను ఒక మాట చెప్పాను. నీకు భార్య కాకపోయినా నాకు కోడలు కావాలి. నా కోడలిగా దాన్ని ఈ ఇంటికి తీసుకురా అన్నాను అని సౌందర్య అనగా.. తీసుకువస్తాడే అనుకో దీపను ఎక్కడ పెడతావు. ఏ షోకేజ్‌లో బొమ్మలా పెడతావు. ఏ పూజా పటాల మధ్య శిలావిగ్రహంలా కూర్చోబెడతావు. వంట గదిలో పాత్రలాగా తిరగమంటావా.. గార్డెన్లో పడి ఉండమంటావా.. ఇంటి ముందు నిన్నటి ముగ్గులాగా మాసిపొమ్మంటావా.. గడప దగ్గర కాలి బట్ట లాగా ఆత్మగౌరవాన్ని తొక్కుతున్నా భరిస్తూ ప్రాణం లేని దానిలా ఉండమంటావా.. దీప దీపం భర్త గుండెల్లోనే వెలగాలి. నువ్వు తీసుకొచ్చి గాలిలో పెడతానంటావు. అడ్డు పెట్టే చేతులు కావాలి. ఆశీర్వదించే చేతులతో ఆ దీపానికి పని లేదు. మనకు ఆ కోడలు వద్దు. వస్తే దీపగానే వస్తే, వాడికి భార్యలాగానే రావాలి అని ఆనందరావు అంటాడు. నేను అంత దూరం ఆలోచించలేదండి, అంత లోతుగా ఆలోచించలేదు అని సౌందర్య అనగా.. లేదు సౌందర్య, ఇదే సత్యం. భార్యకు భర్తనే కావాలి. మిగతా వాళ్లంతా కూడా భర్త తరువాతే. ఇలాంటి ఆస్తులన్నీ కూడా భర్త తరువాతే. విడిపోయిన చాలా మంది భార్యలు కొన్నేళ్ల దాకా భరణం కోసం కోర్టుల చుట్టూ తిరగడం నాకు తెలుసు. భర్త ఇచ్చే భరణం కన్నా భర్తనే పెద్ద ఆభరణం అనుకొని గుండెల మీద మంగళసూత్రాన్ని అయినా మోసుగొని తిరుగుతోంది దీప. అంతే తప్ప మనం ఇచ్చే అండను చూసుకొని, ఈ ఆస్తిని అనుభవించాలని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి దీప కోడలిగా ఎందుకు వస్తుంది అని ఆనందరావు అంటాడు. దానికి సౌందర్య.. ఒకవేళ వాడికి దీప ఎదురుపడితే నా కోరిక ప్రకారం వాడు కోడలిగా తీసుకువస్తే అని అనగా.. దీపనే గనుక ఎదురుపడితే సౌందర్య, ఆనందరావుల కోడలిగా రమ్మని వాడు అంటే వచ్చిన దారినే వెళ్లమంటుంది. అయినా వాడు ఆ మాట అనడు. ఎందుకంటే ఒకవేళ దీప వాడికి కనిపించినా, వాడు పిల్లలను మాత్రమే తీసుకొస్తాడు తప్ప పిల్లలను వాడు వెనక్కి తీసుకురాడు అని ఆనందరావు అంటాడు. దానికి సౌందర్య మనసులో.. అయితే దీప కోడలిగా రమ్మంటే రాదు, వాడు తీసుకురాడు. అంటే దీప ఎప్పటికీ రాదు అని అనుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఇక మోనిత, భాగ్యం ఇంటికి వెళుతుంది. మురళీకృష్ణ రాలేదా అని మోనిత అడగ్గా.. రాలేదు కదా అని భాగ్యం అంటుంది. ఏంటమ్మా సడన్‌గా వచ్చి మా ఆయన రాలేదా అని అడుగుతున్నావు అని భాగ్యం అనగా.. ఏమీ లేదు. ఏ ఊర్లో ఉన్నారో తెలుసా అని మోనిత అడగ్గా.. నీకెందుకే అని తిట్టారమ్మా. ఏ ఊర్లో ఉన్నావు అని అడిగాను అంతే. నీకెందుకు ఇన్ని ఆరాలు, అడ్డమైన గడ్డి తినే అడ్డగాడిద అని కూడా తిట్టారమ్మా అని భాగ్యం అంటుంది. అయితే ఆ దీప దొరకలేదా అని మోనిత అడగ్గా.. దీప దొరికితే నేను ఇక్కడ వెతుకుతూ ఎందుకు తిరుగుతానే వెర్రిపీనుగా, పింజారి మొహం వేసుకొని పిచ్చి ప్రశ్నలు వేస్తావేంటి అని కూడా పరమ బూతులు తిట్టాడమ్మా. ఒకసారి ఫోన్ చేస్తాను నువ్వే అడుగు అని భాగ్యం అనగా.. వద్దు వద్దు మీరు తిన్న తిట్లు చాలు అని మోనిత అంటుంది. దానికి భాగ్యం.. అది కాదమ్మా. నీ డౌట్ తీరిపోతుంది. నాకు క్లారిటీ వస్తుంది అని అనగా.. వస్తాను అని మోనిత అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. అమ్మా అని భాగ్యం మోనితను ఆపి.. సరే నువ్వు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నావని మా ఆయనకు చెబుతానులేమ్మా. ఆయన ఏమన్నారో మళ్లీ నీకు ఫోన్ చేస్తాను అని అనగా.. దీంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని మోనిత వెళుతుంది. ఆ తరువాత భాగ్యం.. మా ఆయన ఏ ఊర్లో ఉన్నాడో దీనికి కావాలా, మా దీప దొరికిందో లేదో కనుక్కోవడానికి వచ్చావా..నువ్వు కూఫీ లాగుతున్నావని నాకు తెలీదా.. ఇంకొకసారి వచ్చావనుకో దేత్తడి పోచమ్మ గుడి భాగ్యమా మజాకా అని మళ్లీ నిద్రపోతుంది.
ఇక హిమ దీపకు మందులు ఇస్తూ ఉండగా.. ఏం ఇవ్వాలో నీకు బాగా తెలుసే అని మురళీకృష్ణ అంటాడు. డాక్టర్ బాబు కూతుర్ని కదా తాతయ్య ఆ మాత్రం తెలీదా అని హిమ అంటుంది. ఆ తరువాత ట్రీట్మెంట్ కోసం మా డాడీ దగ్గరకు ఎప్పుడైనా వెళ్లావా తాతయ్య అని హిమ అడగ్గా.. చాలా సార్లు వెళ్లాడమ్మా. మీ డాడీ ఫీజు తీసుకోరు. పైగా మందులు కూడా ఫ్రీగా ఇస్తారు అని దీప అంటుంది. అప్పుడు మురళీకృష్ణ, కార్తీక్ మాటలను గుర్తు చేసుకుంటాడు. బయటకు మాత్రం.. మీ నాన్న పెద్ద డాక్టర్ కదమ్మా. ఆయన హస్తవాసి కూడా మంచిదే. ఒకసారి నాకు బాగా జబ్బు చేసింది. అప్పుడు మీ నాన్నకు తెలిసింది. చూడటానికి వచ్చారు. మందులన్నీ ఫ్రీగా ఇస్తూ పూర్తిగా నయం అయ్యేదాకా ట్రీట్మెంట్ చేశారు అని మురళీకృష్ణ అంటాడు. దానికి దీప.. ఒక్క తాతయ్యకు ఏంటి. మన సరోజక్క వాళ్ల చెల్లి అరుణ లేదు. వాళ్ల ఆయనకు హార్ట్ ప్రాబ్లమ్ వస్తే సౌర్య మేడమ్ రెకమెండేషన్‌తో పూర్తిగా నయం అయ్యేదాకా ట్రీట్మెంట్ చేశారు. పైగా పని చేయొద్దని పదివేలు కూడా ఇచ్చారు అని అనగా.. మీ కుటుంబం అంతా అంతేనమ్మా. పరోపకారం కోసం ప్రాణం అయినా ఇస్తారు అని మురళీకృష్ణ అనగా.. మరి మా అమ్మను ఎందుకు వదిలేశారు. మా అమ్మ ఏం తప్పు చేసింది. మా అమ్మ ఎప్పుడూ మా నాన్నను గానీ ఎవ్వరినీ గానీ ఏమీ అనదు కాదా. అలాంటి మంచి అమ్మ మా నాన్నకు ఎందుకు నచ్చట్లేదు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. వాళ్లు మంచి వాళ్లే, మా అమ్మ మంచిదే. కానీ అమ్మ ఎందుకు ఆ ఇంట్లో ఉండకూడదు అని సౌర్య అడుగుతుంది. అవన్నీ ఇప్పుడు ఎందుకు అత్తమ్మ అని దీప అనగా.. మరి వాళ్లందరూ మంచి వాళ్లని మీరే అంటున్నారు కదమ్మా. అయినా నువ్వే మమ్మల్ని తీసుకొని ఊరు వదిలి రావాల్సి వచ్చింది. నువ్వు కూడా నాన్న గురించి మంచిగా చెప్తావు. నాన్న అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఇంత దూరం రావడం ఎందుకు అని సౌర్య అడుగుతుంది. ఆలస్యం అయ్యింది అమ్మను పడుకోనివ్వు అమ్మా అని మురళీకృష్ణ అనగా.. మనం చూసినప్పుడు అమ్మ పడుకుంటుంది తాతయ్య. కానీ రాత్రి పూట లేచి చూస్తే అమ్మ అసలు నిద్రపోదు అని సౌర్య అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ ప్రోమోలో కార్తీక్, దీప వాళ్ల దగ్గరకు వస్తాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News