Karthika Deepam Serial: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. తన మీద పడ్డ నిందను ఎలా తొలగించుకోవాలన్న ఆలోచనలో దీప పడింది. మరోవైపు దీప, విహారి మధ్య ఉన్న సంబంధం నిజమని నిరూపించమని కార్తీక్, మౌనితకు చెబుతాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్లో దీపతో మాట్లాడేందుకు ఆదిత్య ఆమె ఇంటికి వెళతాడు. అక్కడ కారు రావడాన్ని చూసి కార్తీక్ అని భావించిన హిమ.. డాడీ అంటూ వెళుతుంది. కానీ లోపలి నుంచి ఆదిత్య దిగుతాడు. దీంతో హిమ కాస్త చిన్నబుచ్చుకుంటుంది. వారి దగ్గరకు వెళ్లిన ఆదిత్య.. ఏంటి హిమ.. డాడీ అనుకున్నావా..? వస్తాడులే.. నీ కోసం అయినా వస్తాడులే అని చెప్పి.. ఎక్కడికి వెళుతున్నారంటూ ప్రశ్నిస్తాడు. దానికి దీప కూరగాయాలకు వెళుతున్నాము ఆదిత్య అని చెబుతుంది. వెంటనే సౌర్య క్యాబ్ బుక్ చేశాము. హిమకు ఆటో పడదు కదా అని చెబితే.. ఎప్పుడు బుక్ చేశావు సౌర్య, అయినా ఆటోలోనే వెళ్లిపోయే వాళ్లము కదా అని చెబుతుంది.
నీకు చెబితే వద్దంటావని చెప్పలేదు అని సౌర్య చెబుతుంది. అయితే ఏ క్యాబ్ వద్దు.. నా కారులోనే వెళదాము అని ఆదిత్య చెబుతాడు. దానికి సౌర్య.. ఇప్పుడు క్యాబ్ క్యాన్సిల్ చేస్తే 50 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అని చెబుతుంది. ఏం కాదులే అని ఆదిత్య చెబుతాడు. ఇక వారిద్దరికి డబ్బులు ఇస్తుండగా.. వద్దు బాబాయి అని చెబుతుంది హిమ. అదేంటే అప్పుడైతే అడిగి మరీ తీసుకునేదానివి. ఇప్పుడు ఏంటి వద్దు అంటున్నావు. తీసుకో అని చెబుతాడు. ఆ తరువాత డబ్బులను తీసుకొని సౌర్య, హిమ ఇద్దరు అక్కడి నుంచి వెళతారు.
ఆదిత్య ఏం మాట్లాడుతాడో అని బయపడుతున్న సౌందర్య టెన్షన్‌కి గురి అవుతూ ఉంటుంది. వెంటనే పనిమనిషి మాలతి కాఫీ తీసుకురానా..? అమ్మా అని అడుగుతుంది. తీసుకురా అని చెప్పగా.. అదేంటి నీకు కాఫీ కావాలని అడగకుండానే మాలతికి ఎలా తెలిసింది అని ఆనందరావు అంటాడు. తలనొప్పి అని చెబుతున్నా. ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా. ఇప్పుడు కాఫీ అవసరం కాబట్టే కాఫీ కావాలా అని అడిగింది అని సౌందర్య చెబుతుంది. అసలు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు సౌందర్య అని ఆనందరావు అడగ్గా.. నాకు తలనొప్పి ఉందని తెలిసి కాఫీ కావాలా..? అని మాలతి అర్థం చేసుకుంది. కానీ నా మనసులో ఏం ఆలోచిస్తున్నానో మీకు అర్థం కావడం లేదా..? అని ప్రశ్నిస్తుంది.
ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని టెన్షన్‌గా ఉంది అని చెబుతుంది. దానికి బయటకు చెప్పకపోయినా నాకు బుర్ర వేడెక్కుతోంది. చిన్నోడు ఏం మాట్లాడుతాడో తెలీదు. పెద్దోడు ఆసుపత్రికి వెళ్లకుండ ఎక్కడికి వెళ్లాడో తెలీదు. అసలు ఏం జరుగుతుందోనని నాకు టెన్షన్‌గా ఉంది అని ఆనందరావు అనగా.. మీరు ఎక్కువ టెన్షన్ పడకండి. ప్రశాంతంగా ఉండండి. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి. డాడీ అని పిలిచే హిమ డాక్టర్ బాబు అన్నందుకే వాడు చాలా బాధపడ్డాడు. ఇప్పుడు హిమ లేకుండా వాడు ఉండలేడు. పెంచిన ప్రేమతో పాటు పేగు బంధం కూడా ఉంది. అందుకోసమైనా వాడు రాజీకి వచ్చి అందరం కలిసి ఉందాం అని చెప్పే రోజు వస్తుంది అని చెబుతుంది. వెంటనే నీ ఊహ అందంగా ఉంది అని ఆనందరావు చెప్పగా.. ఆ ఊహే నిజమైతే ఎలా ఉంటుంది అని సౌందర్య అడగ్గా చాలా సంతోషంగా ఉంటుందని చెబుతాడు. అందుకే బీ పాజిటివ్‌గా ఉండండి అని చెబుతుంది.
మరోవైపు ఏదో చెప్పాలని వచ్చావు కదా ఆదిత్య అని దీప అడగ్గా.. నిజానికి ఇది ఎప్పుడో చెప్పాల్సింది వదిన. కానీ ధైర్యం రాలేదు. ఇప్పుడు మాట్లాడి రావాల్సింది. అందుకే మొదటిసారి ఈ టాపిక్ నీ దగ్గర తీసుకురావాల్సి వచ్చింది. దేని గురించి ఆదిత్య అని అడగ్గా.. నీ గురించి, అన్నయ్య గురించి అని ఆదిత్య చెబుతాడు. వెంటనే నేను నిన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయను వదినా. అమ్మ దగ్గర నేర్చుకున్న సంస్కారం అన్నయ్య దగ్గరే కాదు నా దగ్గర ఉంది అని అడిగాడు. మరిదివో, కొడుకువో, తమ్ముడివో నా శ్రేయోభిలాషిలాగా వచ్చావు. నువ్వు చెప్పాలనుకున్నది సంకోచం లేకుండా చెప్పొచ్చు అని చెబుతుంది.
నువ్వు, అన్నయ్య విడిపోయి ఎన్ని రోజులు అయ్యింది వదినా అని అడుగుతాడు. పది సంవత్సరాలు అని దీప చెబుతుంది. ఈ పదేళ్లలో నువ్వు కొన్ని సంవత్సరాలు ఇక్కడ లేవు. వేరే చోట ఉన్నావు ఎందుకు వదినా అని అడుగుతాడు. మీ అన్నయ్య అర్థం చేసుకోడని తెలిసి వెళ్లిపోయా అని చెబుతుంది. మరి మళ్లీ ఎందుకు వచ్చావు వదినా అని ప్రశ్నించగా.. కూతురిని చూసి అయినా మారుతాడని వచ్చా అని చెబుతుంది. మరి అది జరిగిందా వదినా అని అడుగుతుంది. లేదు అని దీప చెబుతుంది. నువ్వు అబద్దం అంటున్నావు. అన్నయ్య నిజం అంటున్నాడు. అన్నయ్య అబద్దం అంటున్నాడు. నువ్వు నిజం అంటున్నావు. ఇన్ని రోజులు అన్నయ్య అంటూనే ఉన్నావు నువ్వు పడుతూనే ఉన్నావు అని అంటాడు. మీరు కలవాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు వదినా. నువ్వు కూడా వారిలోనే ఉన్నావు అంతేకానీ.. నీ మీద పడ్డ నిందను మాత్రం తొలగించేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు అని చెబుతాడు. నేను అదే నిర్ణయం తీసుకున్నా ఆదిత్య. ఇప్పుడు నువ్వు చెప్పడం వలన మరింత బలం వచ్చింది అని దీప చెబుతుంది. అందరూ ఇప్పుడు బాధలో ఉన్నారు వదినా. ఇప్పుడు పిల్లలపై దీని ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది అని చెబుతాడు.
మరోవైపు కార్తీక్ ఇచ్చిన టాస్క్‌తో మౌనిత మరో కుట్రకు తెర తీస్తుంది. దీప, విహారి మధ్య రిలేషన్ ఉందని నిరూపిస్తే కార్తీక్ నా విషయంలో గట్టి నిర్ణయం తీసుకుంటా అని చెప్పాడు. అంటే నన్ను పెళ్లి చేసుకుంటాడు. నిజంగానే ఆ దీప, విహారి మధ్య రిలేషన్ ఉంటే బావుండేది అని అనుకుంటుంది. ఒకవేళ హిమ కోసం కార్తీక్ కాంప్రమైజ్ అయితే నో నో అలా జరగకూడదు. నేను ఏదో ఒకటి చేయాలి. పది సంవత్సరాల క్రితం నేను చెప్పిన అబద్దం ఇప్పుడు అబద్దమని నిరూపించాలి. ఆ విహారి ఎప్పుడు ఇండియా వస్తాడో. అతడు రాగానే ఎలాగోలా దీపను అక్కడకు పంపిస్తా. వారిద్దరు క్లోజ్‌గా ఉన్నప్పుడు దాన్ని కార్తీక్‌కి చూపిస్తా అని ప్లాన్ చేస్తుంది.
కాగా హిమను మర్చిపోలేకపోతున్న కార్తీక్.. కారులో వెళుతుంటాడు. అక్కడ సౌర్య, హిమ ఇద్దరు రోడ్డుపై వెళుతుండగా.. దూరంగా ఉండి వారిని చూస్తూ ఉంటాడు. ఓ పాత సామాన్ల షాపు దగ్గరకు వెళ్లిన సౌర్య, హిమ ఇద్దరు.. అక్కడ కుర్చీని కొనాలని చూస్తారు. ఇక్కడ పాతగా ఉన్నాయి ఎందుకు సౌర్య అని అడగ్గా.. అమ్మ నిలబడి వంట చేస్తూ ఉంటుంది. కాళ్లు నొప్పులు వస్తాయి అందుకే కుర్చీ కొందామనుకుంటున్నా అని చెబుతుంది. కానీ ఇక్కడ బాగలేవు కదా అని హిమ చెప్పగా.. దీన్ని బాగా క్లీన్ చేస్తే కొత్తగా ఉంటుంది. అలా చేసుకోలేని వాళ్లే ఇలా పడేస్తారు అని సౌర్య చెబుతుంది. అయినా వంటిట్లోకి కొత్తదేం అవసరం లేదు కదా. ఇది చాలు. నేను దీన్ని మొన్ననే బేరం ఆడాను ఇప్పుడు తీసుకెళ్దాం అని సౌర్య వివరిస్తుంది. దానికి అయిష్టంగానే ఒప్పుకుంటుంది హిమ. అయితే ఎండగా ఉండటంతో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటుంది హిమ. చలికాలంలో కూడా ఇంత ఎండ ఎందుకో అని అంటుంది. దానికి సౌర్య.. ఇది మామూలు ఎండనే. కానీ నువ్వు ఎప్పుడూ ఏసీలో ఉంటావు కదా అందుకే ఇబ్బంది పడుతున్నావు. ఇదుగో ఈ కుర్చీని పైన పెట్టుకో. పెద్ద బరువు కూడా ఉండదు. నీకు ఎండ తగలదు అని కొన్న కుర్చీని ఇస్తుంది. ఇదంతా దూరంగా ఉండి గమనిస్తోన్న కార్తీక్.. లోలోపల బాధపడుతూ ఉంటాడు. ఆ తరువాత సౌర్య, హిమ ఇద్దరు జామ పండు తినుకుంటూ వెళుతూ ఉంటారు.
ఇక దీపతో మాట్లాడిన ఆదిత్య, ఆ తరువాత ఇంటికి వెళతాడు. వెంటనే సౌందర్య. అసలు ఎక్కడికి వెళ్లావురా అని అడుగుతుంది. డాడీ చెప్పే ఉంటాడుగా అని ఆదిత్య సమాధానం ఇస్తాడు. ఎందుకు వెళ్లావు రా అని మళ్లీ సౌందర్య అడగ్గా.. అది కూడా చెప్పే ఉంటాడుగా అని చెప్తాడు. అక్కడకు వెళ్లి ఏం చెప్పావురా. పంచాయితీ పెట్టించమని చెప్పావా..? కోర్టుల ద్వారా తేల్చుకోండి అని చెప్పావా..? అసలు ఇక్కడ మేము పెద్దవాళ్లము ఉన్నాము కదా అని సౌందర్య అంటుండగా.. మీ పెద్దరికం ఇక్కడే మగ్గిపోతుంది. మీరు చెప్పలేనిది నేను చెప్పి వచ్చా. వదిన మీద పడ్డ నిందను చెరుపుకోమని చెప్పి వచ్చా అని ఆదిత్య చెప్తాడు. ఇక రేపటి ఎపిసోడ్ ప్రోమోలో.. హిమను చూసేందుకు డాక్టర్ బాబు రాలేదేంటి అని ఇంటి బయట దీప ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ లోపే వచ్చేసిన కార్తీక్.. నేను దొంగచాటుగానైనా హిమను చూసి వెళదాము అనుకుంటే.. ఇది ఇంటి ముందే ఉంది అని మనసులో అనుకుంటాడు. ఇక డాక్టర్ బాబు లోపలికి రావడనికి తటపటాయిస్తున్నట్లు ఉన్నాడు. నేనే లోపలికి పిలుస్తా అని చెప్పి దీప, కార్తీక్ దగ్గరకు వెళుతుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karthika deepam, Karthika deepam telugu serial, Television News