రివ్యూ : సర్ధార్ (Sardar)
నటీనటులు : కార్తి, రాశీ ఖన్నా, రజిషా విజయన్, చంకీ పాండే, లైలా తదితరులు.. ..
ఎడిటర్: రూబెన్
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్
సంగీతం: G.V.ప్రకాష్ కుమార్
నిర్మాత : S. లక్ష్మణ్ కుమార్, అన్నపూర్ణ స్టూడియోస్
దర్శకత్వం: P.S. మిత్రన్
విడుదల తేది : 21/10/2022
కార్తి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్ధార్’. విశాల్‌తో అభిమన్యుడు వంటి చిత్రాన్ని తెరకెక్కించిన పి.యస్.మిత్రన్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా తమిళంతో పాటు తెలుగులో విడుదలైంది. తొలిసారి కార్తి ఇందులో తండ్రీ తనయులుగా ద్విపాత్రాభియం చేశాడు. మరి ఈ సినిమాతో కార్తి బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకున్నాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
స్టోరీ విషయానికొస్తే..
సర్ధార్ కథ విషయానికొస్తే.. చంద్రబోస్ (కార్తి) అలియాస్ (సర్ధార్) RAW0 ఏజెంట్. తన ప్రాణాలను పణంగా పెట్టే గూఢచారి. ఈయన మన దేశానికి చెందిన జాతీయ భద్రతా సలహాదారును హత్య చేయడంతో దేశద్రోహిగా ప్రకటిస్తోంది మన దేశం. ఇంతకీ ’రా’ అలియాస్ సర్ధార్ జాతీయ భద్రతా సలహాదారును ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది. దేశభక్తుడైన సర్ధార్.. దేశద్రోహిగా ఎందుకు మారాడు. ఈ నేపథ్యంలో చెన్నైలో ఉండే ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ (కార్తి) ఎవరు ? మరి దేశద్రోహిగా ముద్రపడ్డ సర్ధార్‌ను దేశభక్తుడిగా మన దేశం గుర్తించిందా లేదా అనేది సర్ధార్ మూవీ స్టోరీ.
కథనం, టెక్నిషియన్స్ విషయానికొస్తే..
దర్శకుడు పి.యస్.మిత్రన్.. దేశం కోసం అజ్ఞాతంగా పనిచేసే ఎంతో మంది ‘రా’ ఏజెంట్స్ (గూఢచారులు) కనీస గుర్తింపు దక్కించుకోరు. ఒకవేళ గూఢచారులు విదేశాల్లో పట్టుపడితే అంతే సంగతులు. తమ వాడని మన దేశం ఒప్పుకోదు. అదే సమయంలో ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్, పోలీసుల్లో పనిచేసేవారికి ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి వారు చేసిన పనులతో గుర్తింపు వస్తోంది. కానీ విదేశాల్లో రహస్యంగా ఉంటూ ఎప్పటికప్పుడు విదేశాల్లో మన దేశంపై జరిగే కుట్రలను ఇక్కడ చేరవేస్తూ మన దేశాన్ని కాపాడే అసలుసిసలైన సైనికులు గూఢచారులు. ఇలా ఒక రా ఏజెంట్ దేశం కోసం మన దేశానికి చెందిన అత్యున్నత అధికారిని చంపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి వెనక పెద్ద వాటర్ మాఫియా ఉంటోంది. ఇక మిత్రన్ ఈ సినిమా కథను సర్దార్.. జాతీయ భద్రతా సలహాదారును బంగ్లాదేశ్‌లో చంపడంతో ప్రారంభమవుతోంది. సర్థార్ బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్ జైల్లో 32 యేళ్లు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అక్కడ పోలీసులకు మిలటరీ కూడా అతను ఐడెంటిటీ తెలియనీయకుండా జాగ్రత్త పడతాడు. ఎన్ని సార్లు ఇంటరాగేషన్ చేసినా.. ఒక్కో భాషలో వాళ్లను కన్ఫ్యూజన్ చేస్తాడు.
ఇక దర్శకుడు మిత్రన్.. ఒక ‘రా’ ఏజెంట్ ఎలా ఉంటాడు. తన సొంత ఊర్లో ఏం చేస్తుంటాడు. ఎపుడు ఎలా ప్రవర్తిస్తాడు. అతనికి ఎన్ని భాషల్లో ప్రావీణ్యం ఉంటుందనే పూర్తి అవగాహనతో దర్శకుడు మిత్రన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమాలో కార్తి వాళ్లో నాటకాలు వేసేవాడి పాత్రలో చూపించాడు. అలా ఉంటూనే దేశం కోసం పనిచేస్తూ ఉంటాడు. గూఢచారి అవసరమొచ్చినపుడు దేశం కోసం ఎలా ప్రాణాలు తెగించి మరి శత్రువుల మూకలో చేరి సమాచారాన్ని ఎలా సేకరించి దేశాన్ని రక్షిస్తాడనేది చక్కగా చూపించాడు. ముఖ్యంగా సర్ధార్‌గా కార్తి ఇంట్రడక్షన్ సీన్ మనకు బాలయ్య చెన్నకేశవరెడ్డి తీహార్ జైలు ఎపిసోడ్ గుర్తుకు తెస్తుంది. సినిమాలో ఈ సన్నివేశం బాగా ఎలివేట్ అయింది. మాస్ ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించేలా యాక్షన్ సన్నివేశాలుంటాయి. ఇంటర్వెల్ వరకు బాగానే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈయన క్లైమాక్స్ మాత్రం ఏదో గందరగోళంగా ముగించినట్టు ఉంది. ముఖ్యంగా అభిమన్యుడులో మనం కేవలం ఒక నంబర్ మాత్రమే అంటూ చూపించాడు. ఈ సినిమాలో ముఖ్యంగా దేశంలో నీళ్లు అనేది ఓ వ్యాపారంగా మారింది. ఫ్రీగా ఇచ్చే నీరను బాటిల్స్‌లో కొనుక్కుంటున్నాం. ఈ సందర్భంగా బాటిల్స్ నీరు తాగడం వల్ల కొన్ని వేల మంది చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారు. వాటర్ మాఫియా దేశ ప్రజలను ఎలా దోచుకుంటున్నారనేది ఈ సినిమాలో చూపించాడు. మొత్తంగా ఈ సినిమాలో విలన్ మహారాజా రాథోడ్ (చంకీ పాండే) వన్ నేషన్ .. వన్ పైప్ లైన్ అంటూ దేశ వ్యాప్తంగా అన్ని నదులను అనుసంధానం చేసి ఆ తర్వాత నీటితో వ్యాపారం చేయాలనుకుంటాడు. అతను సర్ధార్‌ను నియమించిన రా అధిపతి. అతని నీళ్ల వ్యాపారాన్ని బంగ్లాదేశ్‌లో జైల్లో ఖైదీగా ఉన్న సర్ధార్ ఎలా అడ్డుకున్నాడనే ఇంకాస్త చక్కగా ప్రజెంట్ చేస్తే బాగుండేది.ఈ సినిమాను 1983 నుంచి 1988 నేపథ్యంలో సాగుతోంది. ఆ తర్వాత వర్తమానంలో కథను చూపించాడు దర్శకుడు. కెమెరా మెన్ 1980 నాటి విజువల్స్ బాగున్నాయి. జీవి ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటర్ సెకండాఫ్‌లో తన కత్తికి మరింత పదును పెడితే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
కార్తి .. సర్ధార్‌గా, ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్‌గా తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్ జైలు యాక్షన్ ఎపిసోడ్లో ఇరగదీసాడు. అటు పాపులారిటీ కోసం పాకులాడే ఇన్స్పెక్టర్ పాత్రలో అలరించాడు. ఈ సినిమా ‘రా’ ఏజెంట్‌గా పదిపైగా విభిన్న గెటప్స్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. రాశీ ఖన్నా.. శాలిని అనే దేశంలో కార్పోరేట్స్ పై పోరాడే లాయర్ పాత్రలో నటించింది. ఇక విలన్‌గా చంకీ పాండే తన నటనతో ఆకట్టుకున్నాడు. లైలా పాత్ర చిన్నదైనా.. ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్
‘రా’ ఏజెంట్‌గా కార్తి నటన
ఇంటర్వెల్ బ్యాంగ్
దర్శకుడు టేకింగ్
బంగ్లాదేశ్ జైలు ఎపిసోడ్
మైనస్ పాయింట్స్
సెకండాఫ్
క్లైమాక్స్
చివరి మాట: సర్ధార్ ఆలోచింపజేసే యాక్షన్ థ్రిల్లర్
రేటింగ్ : 2.75/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.