(డీపీ సతీష్, సీనియర్ ఎడిటర్, న్యూస్ 18)
సార్వత్రిక ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ కర్ణాటక రాాష్ట్ర ముఖ్యమంత్రి కుమార స్వామితో పాటు ప్రముఖ నటి సుమలత అంబరీష్‌కు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం సుమలత ఇండిపెండెట్‌గా కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తోంది. ఆమెకు మద్ధతుగా చిరంజీవి, రజినీకాంత్ సహా కేజీఎఫ్ స్టార్ యశ్ ప్రచారంలో సాయం చేస్తున్నారు. దివంగత అంబరీష్‌కు మాండ్యా నియోజవర్గ ప్రజలతో విడదీయరాని బంధం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు ఎంపీగా గెలిచారు. అంతేకాదు ఒకసారి కేంద్రమంత్రిగా పనిచేసారు. మరోవైపు సుమలతకు కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్గా నటించింది. మరోవైపు తోటి నటీనటులు ఆమెకు మద్దతుగా నిలుస్తారు. దీంతో భర్తకు నివాళులుగా మాండ్యా తరుపున లోక్‌సభకు పోటీ చేసి ప్రజలకు సేవా చేయాలనుకుంటోంది.ఇంకోవైపు కాంగ్రెస్ పొత్తులో భాగంగా మాండ్యా స్థానాన్ని జేడీఎస్‌కు కట్టబెట్టింది. అక్కడ లోకల్‌గా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సీటు జెడీఎస్‌కు కట్టబెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయమై గుర్రుగా ఉన్నారు. చాలా మంది లో లోపల ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న సుమలతకు సాయం అందిస్తున్నారు.

సుమలత, అంబరీష్(File)
మరోవైపు ఇదే మాండ్యా నియోజవర్గం నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి చిన్న కుమారుడు నిఖిల్ గౌడ్ ఎంపీగా పోటీచేస్తున్నాడు. ఆ మధ్య ‘జాగ్వార్’ మూవీతో కన్నడతో పాటు తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘సీతారామ కళ్యాణ’ అనే సినిమాలో నటించాడు.

తండ్రి కుమార స్వామితో నిఖిల్ గౌడ
తాజాగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న వీరిద్దరికి ఈసీ అనుకోని షాక్ ఇచ్చింది. మాండ్యాలో ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అంబరీష్,సుమలత సినిమాలతో పాటు జాగ్వార్ ఫేమ్ నిఖిల్ గౌడ సినిమాలను డీడీలో ప్రసారం చేయకూడదని మాండ్యా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఎన్.మంజుశ్రీ దూరదర్శన్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. వీరి సినిమాలు ప్రసారం కావడం వల్ల ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే వీరి చిత్రాలను దూరదర్శన్‌లో నిషేధం విధించినట్టు చెప్పుకొచ్చారు.

సుమలత,నిఖిల్ గౌడ
మరోవైపు మంజు శ్రీ మాట్లాడుతూ ఈ నిషేధం కేవలం దూరదర్శన్‌లో ప్రసారమయ్యే సినిమాలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. థియేటర్స్‌లో ప్రైవేటు చానెల్స్‌లో ప్రసారమయ్యే వాటికి ఈ నిబంధన వర్తించదని చెబుతున్నారు.

దూరదర్శన్, ఎలక్షన్ కమిషన్
ఇక ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. గత కొన్నేళ్లు ప్రజలు దూరదర్శన్ చానెల్‌కు దూరమయ్యారు. అసలు దూరదర్శన్‌లో ఏయే ప్రోగ్రామ్స్ వస్తున్నాయో సామాన్య జనాలకు తెలియడం లేదు. మరి అలాంటప్పుడు డీడీలో వీళ్ల సినిమాలను ఎన్నికలు పూర్తయ్యే వరకు నిషేధించడంలో ఎలాంటి ప్రభావం ఉండదని అందరు చెవులు కొరుకుంటున్నారు.