గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. అందులో స్పోర్ట్స్ స్టార్స్ మీద తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. అందులో క్రికెటర్స్ మీద ‘అజారుద్దున్’, ‘ఎంఎస్ ధోని’, ‘సచిన్’ సినిమాలు తెరకెక్కాయి. ప్రస్తుతం బాలీవుడ్లో మన దేశానికి క్రికెట్లో తొలి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా ..రణ్వీర్ సింగ్ హీరోగా ‘83’ బయోపిక్ రాబోతుంది. కరోనా లాక్డౌన్ లేకపోతే.. ఈ పాటికే ఈ సినిమా విడుదలై ఉండేది. తాజాగా విరాట్ కోహ్లీ జీవిత చరిత్రపై సినిమా రానుంది. ఇందులో కూడా రణ్వీర్ సింగ్ హీరోగా నటించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు వెండితెరపై మహిళ ప్రపంచ క్రికెట్లో సత్తా చాటి మిథాలీ రాజ్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నటి తాప్సీ మిథాలీ రాజ్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు ’శభాష్ మిథు’ అనే టైటిల్ ఖరారు చేసింది. తాజాగా ఒలింపిక్స్‌లో మన దేశానికి వ్యక్తిగతంగా తొలి పతకం అందించిన కరణం మల్లీశ్వరి జీవిత చరిత్రపై సినిమా తెరకెక్కించబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.
జూన్ 1న కరణం మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు ఎం.వీ.వీ.సత్యనారాయణ, కోన వెంకట్ అఫీషియల్‌గా ప్రకటించారు. ప్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇందులో బాలీవుడ్‌కు చెందిన ప్రియాంక చోప్రా నటించే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. గతంలో ప్రియాంక చోప్రా.. మేరీ కోమ్ జీవిత చరిత్రపై తెరకెక్కిన ‘మేరీకోమ్’ సినిమాలో టైటిల్ పాత్రలో అదరగొట్టింది. ఈ సినిమా కోసం ప్రియాంక వెయిట్ లిఫ్టింగ్‌తో బాక్సింగ్‌లో కోచింగ్ కూడా తీసుకుంది. ఆమె అయితే ఈ పాత్రకు న్యాయం చేసే అవకాశాలున్నాయని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే కంగాన రనౌత్‌ను సంప్రదించగా.. ఇప్పట్లో వర్కౌట్స్ చేయడం తన వల్ల కాదని చెప్పింది కూడా. రీసెంట్గా ‘పంగా’ సినిమాలో ఆమె వెజ్లర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా.
దీంతో నిర్మాతలు ప్రియాంక చోప్రాను కలిసి ఈ స్టోరీని నేరేట్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాను సంజనా రెడ్డి డైరెక్ట్ చేస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులను ప్రకటించే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.