బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, విలక్షణ నటి కంగనా రనౌత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వారిద్దరి మధ్య విభేదాలకు సంబంధించి బాలీవుడ్ మీడియాలో చర్చలేని రోజే ఉండదు. ఇదంతా గతం. ఇప్పుడు ఇద్దరి మధ్య స్నేహం చిగురించే సూచనలు కనిపిస్తున్నాయి. చేదు అనుభవాలను పక్కనబట్టి త్వరలోనే వారిద్దరూ కలిసి పనిచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కంగనా విషయంలో మనసు మార్చుకున్న కరణ్ జోహార్...కంగనా రనౌత్ బాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ యాక్ట్రస్లలో ఒకరంటూ ఆకాశానికెత్తేశారు. తప్పనిసరిగా ఆమెతో కలిసి పనిచేయాలని తాను భావిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

కరణ్ జోహార్
గతంలో కరణ్ జోహార్, కంగనా రనౌత్ బహిరంగంగానే పరస్పరం సెటైర్లు వేసుకున్నారు. ఇద్దరి మధ్య అగాధం బాగా పెరిగిందన్న ప్రచారం కూడా జరిగింది. ఆ విషయానికొస్తే బాలీవుడ్ తారలు అలియా భట్, రణ్‌బీర్ కపూర్ తదితరులకు జాతి ప్రయోజనాల పట్ల అక్కర్లేదంటూ ఇటీవల కంగనా రనౌత్ వెనుకాడలేదు. ‘మణికర్ణిక’ చిత్ర దర్శకుడు క్రిష్‌తో కంగనా రనౌత్ కస్సుబుస్సులాటలు అందరికీ తెలిసిందే. అందుకే ఆమెకు ఇండస్ట్రీలో శత్రువులు ఎక్కువేనంటారు.
ఇప్పుడు ఆమెతో రాజీ కుదుర్చుకునేందుకు సిద్ధమంటూ తన వ్యాక్యలతో కరణ్ జోహార్ సంకేతాలిచ్చారు. మరి ఆయన స్నేహ హస్తాన్ని కంగనా అందుకుంటుందో? లేదో? వేచి చూడాల్సిందే.