Tollywood Legendery Hero Kanta Rao Death Anniversary | తెలుగు సినిమాల్లో కత్తి యుద్దం అంటే అందరకీ గుర్తుకువచ్చేది ఆ హీరోనే. ఆయన ఖడ్గ విన్యాసానికీ ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లు కూడా హాట్సాఫ్ చెప్పారు. కత్తి పడితే మెరుపు వేగంతో శత్రువును మట్టి కరిపించే విజయసింహుడు. ఆపదలో ఉన్న రాకుమారిని రక్షించే గండరగండడు. తెలుగు జానపద చిత్రసీమలో అజేయుడు. అసామాన్య ప్రతిభా సంపన్నుడు. ఆయనే ప్రముఖ నటుడు కాంతారావు. ఆశేష ప్రేక్షాభిమానులకు ఆయన కత్తి కాంతారావుగానే పరిచయం. నేడు ఆ మహానటుడు వర్థంతి సందర్భంగా న్యూస్ 18 ప్రత్యేక కథనం. తెలుగు సినిమాల్లో ఒక్కో నటుడికి ఒక్కో విశిష్ట స్థానం ఉంది. కొన్ని పాత్రలు ఆయా నటుల కెరీర్‌కే హైలెట్ గా నిలిచిపోతాయి. అలాంటి పాత్రలు పోషించిన అరుదైన నటుల్లో కాంతారావు అగ్రగణ్యుడు.
కామన్‌గా కాంతారావు అంటే ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కత్తి కాంతారావు అంటే ఠక్కున గుర్తుకువస్తారాయన. కేవలం జానపద హీరోగానే కాకుండా...పౌరాణిక పాత్రల్లో నారదుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఎన్నో జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో కథానాయకుడిగా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన అనితర సాధ్యుడిగా పేరు సంపాదించాడు.
ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లు తిరుగులేని హీరోలుగా వెలిగిపోతుంటే .... వారితో సమానమైన స్థాయిలో హీరోగా నిలబడిన ఏకైక నటుడు కాంతారావు. కత్తి పట్టిన జానపద వీరుడంటే ఇప్పటికీ మనకు గుర్తుకు వచ్చేది కాంతారావే. తెలుగు చిత్రసీమలో రాముడు, కృష్ణుడు పాత్రలంటే ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తాడో....నారద పాత్రలకు కాంతారావు అంతే పేరు సాధించాడు. కేవలం నారద పాత్రలే కాదు.. రాముడు, కృష్ణుడు, ఇంద్రుడు మొదలైన పౌరాణిక పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసారాయన.
తెలుగు సినీ కళామతల్లికి ఎన్.టి.ఆర్, ఏఎన్ఆర్ లు రెండు కళ్ళయితే కాంతారావు ఆ కళ్ల మధ్య తిలకం లాంటి వారు. ఒక కళాకారుడికి ఇంతకంటే గొప్ప అభినందన ఏముంటుంది? ఎందరో హీరోలు జానపద పాత్రలు వేసినా, జానపద హీరో అనగానే అందరికీ గుర్తుకు వచ్చే నటుడు కాంతారావు. తన పాత్రలతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించిన కాంతారావు 1923 నవంబర్ 16న నల్గొండ జిల్లా, గుడిబండ గ్రామంలో జన్మించాడు. ఆయన పూర్తిపేరు తాడేపల్లి లక్ష్మీకాంతారావు. విద్యాభ్యాసం మొత్తం కోదాడ, ఖమ్మంలో కొనసాగింది. నాటకాల మీద ఆసక్తితో సురభి నాటక సమాజంలో చేరి.. ఎన్నో నాటకాల్లో దేవుళ్ల పాత్రలను పోషించాడు కాంతారావు. ఆ అనుభవమే ఆయనకు సినిమాల్లో బాగా ఉపయోగపడింది.
సినిమా అవకాశాల కోసం ఎన్నో కష్టాలు అనుభవించిన కాంతారావు టాకీ పులి హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రతిజ్ఞ’తో హీరోగా పరిచయం అయ్యారు. ‘ప్రతిజ్ఞ’తర్వాత.. కాంతారావు వెనుదిరిగి చూసుకోలేదు. విఠలాచార్య సినిమా హీరో అంటే కాంతారావు పేరే వినిపించేది. విఠలాచార్య తొలి తెలుగు చిత్రం ‘కన్యాదానం’ నుంచి వీరిద్దరి అనుబంధం మొదలై... అలా కొనసాగుతూ వచ్చింది. వీరి జానపద చిత్రాల పరంపర దక్షిణ భారతంలో ఓ ట్రెండ్. ఆ రోజుల్లోనే ఎలాంటి డూప్ లేకుండా ఫైట్స్ చేసిన ఘనత కాంతారావుది.
కేవలం జానపద హీరోగానే కాకుండా... పౌరాణికల్లోనూ గుర్తుండిపోయే పాత్రలేన్నో చేసి శభాష్ అనిపించాడు కాంతారావు. ఒకటా రెండా... ఎన్నో పాత్రలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. వాటిలో ప్రధానమైంది నారద వేషం. ఇప్పటికీ నారదుడంటే తెలుగు ప్రేక్షకులకు కాంతారావే గుర్తొస్తాడు. ప్రత్యేకించి నారదుడిగా ‘గంగా గౌరీ సంవాదం’, మొదులుకొని ‘దీపావళి’, ‘సీతారామ కళ్యాణం’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’, ‘శ్రీ కృష్ణ తులాభారం’, ‘శ్రీ కృష్ణసత్య’, ‘సతీ సావిత్రి’.. మొదలగు చిత్రాల్లో నారదుడిగా అలరించారు కాంతారావు.
ఎన్టీఆర్ తో పరిచయం కాంతారావుకు కెరీర్ పరంగా ఎంతో మేలు చేసింది. హెచ్.ఎం.రెడ్డి ఆఫీసులో కాంతారావుని చూసిన రామారావు తన ‘జయసింహ’ చిత్రంలో తమ్ముడి పాత్రనిచ్చి ప్రోత్సహించాడు. ‘జయ సింహ’ చిత్రంలో అన్నదమ్ములుగా నటించిన ఎన్టీఆర్, కాంతారావు, ఆ తర్వాత నిజజీవితంలో అన్నదమ్ములుగా మెలిగారు. వీరిద్దరు కలిసి.. ‘గౌరీ మహత్యం’, ‘శభాష్ రాముడు’, ‘భట్టి విక్రమార్క’, ‘రక్త సంబంధం’, ‘భీష్మ’, ‘ఆప్తమిత్రుడు’, ‘నర్తనశాల’ ‘లవకుశ’ ‘ఏకవీర’ వంటి అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ‘లవకుశ’లో ఆయన నటకు జాతీయ అవార్డు వరించింది.
కాంతారావు జానపద చిత్రాల హీరోగా ముద్రపడినా... పలు సాంఘిక చిత్రాల హీరోగానూ మురిపించాడు. ‘శభాష్ రాముడు’, ‘శాంతినివాసం’ , ‘రక్తసంబంధం’ వంటి చిత్రాలు ఆయనకు మంచిపేరు తెచ్చాయి. దాదాపు 500 చిత్రాలలో నటించిన కాంతారావు ‘ప్రేమజీవులు’, ‘సప్తస్వరాలు’, ‘గుండెలు తీసిన మొనగాడు’, ‘స్వాతి చినుకులు’ సినిమాలు నిర్మించాడు. కాంతారావుకు చిత్ర నిర్మాణం అంతగా కలిసిరాలేదని చెప్పాలి. దీంతో ఆర్థికంగా ఎంతో నష్టపోయారు.
కాంతారావు నటనా పటిమా తెలుగు చిత్రాల వరకే పరిమితం కాలేదు. కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో నటించి అక్కడి వారి ప్రేక్షకాభిమానం సైతం పొందిన ఘనత కాంతారావుది. మలయాళంలో ‘భక్త కుచేల’ లో కృష్ణుడిగా నటించి.. కణ్ణన్‌గా ప్రశంసలు పొందాడు. కన్నడంలో ‘కంఠీరవ’ ‘ఆశాసుందరి’ చిత్రంలో నటించాడు. తమిళులైతే కాంతారావును ఏకంగా.. ‘ఆంధ్రా ఎంజిఆర్’ గా పిలిచేవారంటే ఆయనకున్న ఫాలోయింగ్ ఎలాంటిదో చెప్పొచ్చు.
వయస్సు పై బడిన తర్వాత.. కాంతారావుకు హీరో వేషాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. కేవలం కథానాయకుడిగానే కాకుండా.. కాలానుగుణంగా వివిధ పాత్రలు పోషించాడాయన. అందులో భాగంగా.. ‘ముత్యాల ముగ్గు’, ‘ఓ సీతకథ’, ‘గుణవంతుడు’, ‘ఎదురీత’, ‘ఊరికి మొనగాడు’, ‘మనవూరి పాండవులు’, ‘అల్లూరి సీతారామరాజు’వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా ‘బికారి రాముడు’, ‘ఎదురులేని మనిషి’, ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి చిత్రాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ మెప్పించాడు.
అగ్ర హీరోల సరసన మరో అగ్ర నటుడిగా వెలుగొందిన ఆయన.. ఆస్తుల విషయానికి వస్తే, ఆ స్థాయిలో కూడబెట్టలేదనే చెప్పాలి. కాంతారావు సంపాదించిన అమూల్యమైన ఆస్తి ఏదైనా వుందంటే అది ప్రజాభిమానమే. ఎన్టీఆర్, ఏఎన్నార్ల సరసన నిలచిన హీరోగా పేరు సాధించాడు. అయినా కాంతారావు పట్ల చిత్రపరిశ్రమ నిర్లక్ష్యవైఖిరి అవలంబించింది. ఇక్కడ మాములు ఆర్టిస్టులకు సొంత ఇల్లు ఉన్న ఇండస్ట్రీలో... తెలుగు చిత్రసీమలో నెంబర్ వన్ హీరోలకు పోటీ ఇచ్చిన కాంతారావుకు కనీసం సొంత ఇల్లు కూడా లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆయన గురించి పట్టించుకోకపోవడం శోచనీయం. ప్రాంతీయ విభేదాలతో బలైన తొలి తెలంగాణ వ్యక్తి గా నిలిచారు. 75 ఏళ్ల తెలుగు సినిమా వజ్రోత్సవాల్లో ఆయనకు సరైన గౌరవం దక్కకుండా చేశారు. పరిస్థితులు అనుకూలించక కొన్ని సినిమాల్లో, సీరియళ్లలో చిన్న చితకా ప్రాధాన్యత లేని పాత్రలు పోషించారాయన.
ఎన్నో జానపద, పౌరాణిక, సాంఘిక, క్రైం, చిత్రాల్లో నటించి ఆల్ రౌండర్ అనిపించుకున్న మహానటుడు కాంతారావు. తన 86వ యేట 2009 మార్చి 22న అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూసారు. ప్రస్తుతం కాంతారావు జీవిత కథపై పీసీ ఆదిత్య అనే దర్శకుడు బయోపిక్ మూవీని నిర్మిస్తున్నట్టు ప్రకటించినా.. ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ మూవీలో హీరోగా ఆయన ఎదుర్కొన్న అనుభవాలను చూపించనున్నారు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా.. జానపద రాకుమారుడిగా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.