Jayashree Ramaiah: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. కన్నడ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. బెంగళూరులోని తన ఇంట్లో ఉరేసుకొని ఆమె బలవన్మరణంకు పాల్పడ్డారు. అయితే గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని సంధ్య కిరణ ఆశ్రమంలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఈ క్రమంలో డిప్రెషన్‌ను భరించలేకనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఉదయం నుంచి జయకు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఫోన్లు చేస్తుండగా ఎత్తకపోవడంతో.. వారు ఆశ్రమ్కి ఫోన్లు చేశారు. దీంతో ఆశ్రమ్ నిర్వాహకులు ఆమె ఇంటికి వెళ్లగా.. అప్పటికే జయశ్రీ ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
కాగా ‘ఉప్పు హులి కారా’, ‘కన్నడ గొత్తిల్లా’ వంటి చిత్రాల్లో నటించిన జయశ్రీ.. కన్నడలో రియాలిటీ షో బిగ్‌బాస్ 3లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ క్రమంలో ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. అయితే బయటకు వచ్చిన తరువాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. ఈ క్రమంలో డిప్రెషన్లోకి వెళ్లింది.

జయశ్రీ రామయ్య File Photo
ఈ నేపథ్యంలో ఈ జీవితానికి ముగింపు పలకాలని ఉందంటూ గతేడాది జూన్ 24న జయశ్రీ తన ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ తరువాత కాసేపటికే డిలీట్ చేశారు. ఇక ఈ విషయం తెలిసిన నటుడు కిచ్చ సుదీప్ ఆమెను ఓదార్చాడు. ఆ తరువాత కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికీ.. మళ్లీ డిప్రెషన్లోకి వెళ్లిన జయశ్రీ.. కుటుంబ సభ్యులు, స్నేహితులకు దూరంగా ఉంటూ ఒంటరిగా ఉన్నట్లు ఆమె స్నేహితురాలు శిల్ప తెలిపింది.