కంగన రనౌత్.. ఈ పేరు వింటే ముందుగా నటన కంటే ముందుగా వివాదాలే గుర్తుకొస్తాయి. ఎందుకంటే కెరీర్ మొదటి నుంచి కాంట్రవర్సీలతో అంతలా స్నేహం చేస్తూ వచ్చింది కంగన రనౌత్. ఇప్పటికీ ఈమె సినిమాల కంటే కూడా వివాదాలే ఎక్కువగా ఈమెకు క్రేజ్ తీసుకొచ్చాయి. మొన్నటికి మొన్న ‘మణికర్ణిక’ సినిమాతో కూడా కాంట్రవర్సీనే కోరి తెచ్చుకుంది కంగన. ముఖ్యంగా డైరెక్షన్ క్రెడిట్ విషయంలో దర్శకుడు క్రిష్,కంగనా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇక ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీ బాయి పాత్రలో తన నటనతో వివాదం చేసే వాళ్లు నోళ్లు మూయించింది కంగన. మరోవైపు ఈ సినిమాలో తన యాక్టింగ్‌కు జాతీయ ఉత్తమ నటి అవార్డు రాకపోతే.. ఆ జాతీయ అవార్డుల విశ్వసనీయతను అనుమానానించాల్సి వస్తోందని వివాదాస్పద ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ భామ మూడు భాషల్లో తెరకెక్కుతోన్న ‘జయలలిత’ బయోపిక్‌లో యాక్ట్ చేస్తోంది. గతంలో ఈ భామ ‘వన్స్ అపానే టైమ్ ఇన్ ముంబాయి’ సినిమాలో హీరోయిన్ పాత్రనే చేసింది. ఈ సినిమాతో పాటు కంగనా..కే.రాఘవేంద్రరావు కొడుకు కే.యస్.ప్రకాష్ రావు దర్శకత్వంలో ‘మెంటల్ హై క్యా’ సినిమా చేస్తోంది. రాజ్ కుమార్ రావ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేసారు.

మెంటల్ హై క్యా పోస్టర్
ఇపుడే పోస్టరే వివాదాలకు కేంద్ర బిందువు అయింది. ఈ పోస్టర్లో కంగనా, రాజ్ కుమార్ రావ్లు ఎదురెదురుగా నిలబడి నాలుకల్ని బయటకు చాచి వాటిపై బ్లేడును నిలబెట్టారు. నిజంగానే వీళ్లిద్దరికి మెంటలా అనే తీర్లో ఈ సినిమా పోస్టర్ ఉంది. తాజాగా ఈ పోస్టర్‌పై ఐపీఎస్ సంఘం (ఇండియన్ సైక్రియాట్రిక్ సోసైటీ ,The Indian Psychiatric Society) వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టర్..మానసిక వికలాంగులను కించ పరిచేలా ఉందని వ్యాఖ్యానించింది. అంతేకాదు సదరు పోస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 ప్రకారం సెన్సార్ బోర్డ్ చైర్మన్ ప్రసూన్ జోషికి ఒక లేఖ రాసారు. భారతదేశంలో మాములు వ్యక్తులతో పాటు మానసిక వికలాంగులకు హక్కులు ఉంటాయి.వాళ్లను కించపరుస్తూ ‘మెంటల్ హై క్యా’ సినిమా తెరకెక్కించినట్టు ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు మానసిక వికలాంగుల సంక్షేమార్థం ఈ సినిమా టైటిల్‌ను మార్చమని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ సినిమాను బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఏక్తాకపూర్ నిర్మిస్తున్నారు.