Jr NTR video call to a fan: నేనున్నాను నీకేం కాదు.. అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ భరోసా..

అభిమానికి సర్‌ప్రైజ్ కాల్ చేసిన ఎన్టీఆర్ (Jr NTR Fan)

Jr NTR video call to a fan: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్లకు మనోధైర్యానికి మించిన మందు లేదంటారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ తన కోసం పరితపిస్తున్న ఓ అభిమానిని హాస్పిటల్‌కు వెళ్లి కలిసొచ్చాడు. అప్పటి వరకు ఆశలే లేని ఆ అమ్మాయి విచిత్రంగా..

  • Share this:
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్లకు మనోధైర్యానికి మించిన మందు లేదంటారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ తన కోసం పరితపిస్తున్న ఓ అభిమానిని హాస్పిటల్‌కు వెళ్లి కలిసొచ్చాడు. అప్పటి వరకు ఆశలే లేని ఆ అమ్మాయి విచిత్రంగా కోలుకుంది.. కొన్ని నెలల్లోనే మామూలు మనిషి అయిపోయింది. ఇప్పుడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా ఇదే చేసాడు. తన అభిమాని ఒకరు తనను చూడాలనుకుంటున్నారని తెలుసుకుని అతడితో మాట్లాడాడు.. ధైర్యం చెప్పాడు.. నీకేం కాదు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చాడు. అభిమానితో వీడియో కాల్ మాట్లాడి అంతా బాగుంటుందని సర్ది చెప్పాడు. ఆ అభిమాని పేరు వెంకన్న.. ఈయన కొంతకాలంగా కండరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్‌కు ఈయన ప్రాణమిచ్చేంత అభిమాని. జీవితంలో ఒక్కసారైనా ఎన్టీఆర్‌‌ను కలిసి ఫోటో దిగాలనేది ఈయన కోరిక. దాంతో అభిమాని వివరాలు తెలుసుకున్న ఎన్టీఆర్.. అతడితో వీడియో కాల్ మాట్లాడాడు. ఆయన కుటుంబ సభ్యులను కూడా పలకరించాడు. అందరికీ ధైర్యం చెప్పాడు. తానున్నాననంటూ భరోసా ఇచ్చాడు ఆ కుటుంబానికి. ఆ వీడియో కాల్ సంభాషణ ఇలా సాగింది..

వెంకన్న: అన్నా.. నమస్తే అన్నా ఎలా ఉన్నారు.. మిమ్మల్ని చూడాలని కలవాలని రోజూ అనుకుంటాను అన్నా.. ఎన్నో ఏళ్లుగా నా కోరిక అది.. మీతో నాకొక సెల్ఫీ కావాలన్నా.. అంతకు మించి ఏం వద్దన్నా..

జూనియర్ ఎన్టీఆర్‌: అయ్యో తప్పకుండా.. ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు.. ఇప్పుడు ఈ కరోనా నడుస్తుంది కదా.. ఇది అయిపోయిన వెంటనే కలుద్దాం.. కలిసి మనం కలిసి మంచి ఫొటో దిగుదాం.. కరోనా పోయి పరిస్థితులు కాస్త సర్దుకున్నాక నిన్ను నేను ప్రత్యేకంగా కలుస్తాను.. ఈ లోపు నువ్వు బాగా తిని రెస్ట్‌ తీసుకో..

వెంకన్న: ఇది చాలు అన్నా నాకు.. ఇంకేం వద్దు.. మిమ్మల్ని కలవడం కోసమైనా బతికుంటా అన్నా.. ఆ ఆశతోనే బతుకుతానన్నా..

జూనియర్ ఎన్టీఆర్‌: అయ్యో.. నీకేం కాదు. నువ్వు ఎక్కడికెళతావు కానీ.. నీకేం కాదు, నాకేం కాదు. ఇక్కడే ఉంటాం ఇద్దరం.. నువ్వు మాత్రం బాగా రెస్ట్‌ తీసుకో.. మంచి ఆహారం తీసుకుని జాగ్రత్తగా ఆనందంగా ఉండు.. నీ ఆనందమే నీకు ఆయుష్షు పోస్తుంది.. నేను కూడా కలుస్తాను నిన్ను.. అమ్మను బాగా చూసుకో..

వెంకన్న: అలాగే అన్నా.. ఇదిగో ఇక్కడే ఉందన్న మా అమ్మ కూడా..

జూనియర్ ఎన్టీఆర్‌: అమ్మా బాగున్నారా.. నేనున్నానమ్మా మీకు భయపడకండి.. మీ అబ్బాయికి ఏం కాదు.. నా వంతు సాయం నేను చేస్తాను.. అక్కడ మా వాళ్లున్నారు కదా.. అంతా వాళ్లు చూసుకుంటారు.. మీరేం కంగారు పడొద్దు అన్నీ నేను చూసుకుంటా.. అంటూ వెంకన్న తల్లికి కూడా ధైర్యాన్నిచ్చాడు ఎన్టీఆర్.

ఆయన మాటలతో వెంకన్న చాలా ఉత్సాహంగా మారిపోయాడు. త్వరలోనే నయం చేసుకుని వెళ్లి ఎన్టీఆర్ అన్నను కలుస్తానంటూ చెప్పుకుంటున్నాడు. జూనియర్ చేసిన ఈ పనితో సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published: