ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమానే అనే ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. సాంకేతికత పెరిగిన క్రమంలో కొత్త టాలెంట్ బయటకు రావడంతో కొత్త కాన్సెప్ట్ చిత్రాలు రూపొందాయి. దీంతో దక్షిణాది సినిమా కంటెంట్ బలమేంటో అందరికీ అర్థమైంది. బాహుబలి, కేజీయఫ్ వంటి చిత్రాలతో మన తెలుగు సినిమాలు ప్యాన్ ఇండియా రేంజ్లో కలెక్షన్స్ సునామీని క్రియేట్ చేశాయి. దీంతో మన దర్శకుల ప్రతిభ దేశంలోనే కాదు.. యావత్ ప్రపంచం తెలిసింది. మన దక్షిణాదిన ముఖ్యంగా తెలుగులో మంచి సినిమాలను రీమేక్ చేయడానికి బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆసక్తి చూపారు. మరో అడుగు ముందుకేసి ఇప్పుడు ఏకంగా మన దర్శకులే బాలీవుడ్లో సినిమాలను తెరకెక్కించడం స్టార్ట్ చేశారు. ఇది వరకు సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వంటి దర్శకులు బాలీవుడ్లో సినిమాలను తెరకెక్కించినా అవి ఒకటో రెండో మాత్రమే ఉండేవి కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. మన యువ దర్శకులు బాలీవుడ్లో పాగా వేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
కబీర్‌సింగ్:
తెలుగులో విజయవంతమైన అర్జున్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండను స్టార్ హీరోని చేసిన సినిమా ఇది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ వంగా పేరు దేశం యావత్తు మారుమోగింది. రా లవ్‌స్టోరిని సందీప్ వంగా తెరకెక్కించిన తీరుకి అందరూ హ్యాట్సాఫ్ చెప్పారు. దీంతో బాలీవుడ్ మేకర్స్ అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో సందీప్ వంగాతోనే కబీర్ సింగ్‌గా రీమేక్ చేశారు. ఈ సినిమా బాలీవుడ్‌లోనూ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి ఆ ఏడాది బెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు సందీప్ వంగా బాలీవుడ్లోనే తన రెండో సినిమా 'యానిమల్'ను రణ్‌భీర్ కపూర్‌తో డైరెక్ట్ చేస్తున్నాడు.
దుర్గామతి:
పిల్లజమీందార్ వంటి సినిమా సహా తెలుగులో కొన్ని చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు అశోక్ డైరెక్షన్లో రూపొందిన సూపర్‌హిట్ మూవీ 'భాగమతి'. అనుష్క టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సినిమా నచ్చడంతో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మరి కొంతమందితో కలిసి 'భాగమతి' సినిమాను 'దుర్గామతి' పేరుతో అశోక్ దర్శకత్వంలోనే రీమేక్ చేశారు. భూమి ఫెడ్నేకర్ టైటిల్ పాత్రలో నటించింది. అయితే హిందీలో ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని దక్కించుకోలేదు. కానీ నిర్మాతలకు నష్టాన్ని మాత్రం కలిగించలేదు.
జెర్సీ:
తెలుగులో హీరో నానిని సరికొత్త కోణంలో ప్రెజెంట్ చేసిన సినిమా 'జెర్సీ'. గౌతమ్ తిన్ననూరి మళ్లీరావా అనే ఒకే ఒక సినిమాను డైరెక్ట్ చేశాడు. అది మంచి విజయాన్నే దక్కించుకుంది. కథపై నమ్మకంతో ఉద్వాసనకు గురైన ఓ ఉద్యోగి, ముప్పై ఆరేళ్ల క్రికెటర్ కొడుకు కోసం క్రికెట్ ఆడాలనుకోవడమే కథాంశం. క్రికెట్ ఆడితే ప్రాణాలు పోతాయని తెలిసినా కొడుకు కోసం క్రికెట్ ఆడటమే సినిమాలో ట్విస్ట్. తెలుగులో నానికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రమిది. గౌతమ్ తిన్ననూరిని అందరూ అప్రిషియేట్ చేశారు. ఈ సినిమా సక్సెస్ గౌతమ్ తిన్ననూరిని బాలీవుడ్లో దర్శకుడిగా మార్చేసింది. జెర్సీ పేరరుతో షాహిద్ కపూర్ హీరోగా మన తెలుగు నిర్మాతలు అల్లు అరవింద్, దిల్‌రాజు, బాలీవుడ్ నిర్మాత అమన్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్ 5న విడుదలవుతుంది. మరి ఈ సినిమాతో గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతాడేమో దీపావళికి వరకు వెయిట్ చేసి చూద్దాం..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Jersey, Shahid Kapoor