న్యాచురల్ స్టార్ అంటే అంతా న్యాచురల్ గానే ఉండాలి. నటనతో పాటు రొమాన్స్ కూడా. ఇప్పుడు నాని కూడా ఈ విషయంలో ఆరితేరిపోయాడు. ఇప్పుడు ఈయన నటిస్తున్న జెర్సీ సినిమాలో కేవలం ఆటలు మాత్రమే ఉంటాయేమో.. రొమాన్స్ ఉండదేమో అనుకున్నారంతా. కానీ తాజాగా విడుదలైన అదేంటో కానీ ఉన్నపాటుగా సాంగ్ చూసిన తర్వాత సినిమాలో ఏ రేంజ్ రొమాన్స్ ఉండబోతుందో అర్థమైపోతుంది. ఇప్పుడు విడుదలైన పాటలో ఏకంగా లిప్ లాక్ సీన్స్ కూడా చేసాడు నాని. శ్రద్ధా శ్రీనాథ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.
అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నాడు. ఆయనే ఈ పాట పాడాడు కూడా. 1.30 నిమిషం నిడివి గల ఈ పాటలో రొమాన్స్ అదరగొట్టాడు నాని. గౌతమ్ తిన్ననూరి కూడా ఇన్ని రోజులు జెర్సీలో ఓ కోణాన్ని మాత్రమే చూపించాడు. ఇప్పుడు కథలో మరో కోణం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసాడు. ఎప్రిల్ 19న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆగి ఓడిపోయేవాడు ఉన్నాడు.. కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు మాత్రం లేడంటూ టీజర్ లో చెప్పిన ఒక్క డైలాగ్ చెబుతుంది నాని సినిమా కథ ఎలా ఉండబోతుందో.
1980ల్లో సాగే కథ ఇది.ఇండియన్ క్రికెట్ టీంలోకి రావాలని కలలుకనే ఓ ఆటగాడి కథ ఇది. అప్పటికే 36 ఏళ్లు రావడంతో అంతా జీవితంలో ఓడిపోయావు అని.. ఏం సాధించలేవు అంటూ నిరుత్సాహపరుస్తుంటారు. అప్పుడు హీరో ఎలా అనుకున్నది సాధించాడు అనేది స్పూర్థి దాయకంగా తీస్తున్నాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.
ఇది మాజీ ఇండియన్ క్రికెటర్ రమణ్ లాంబ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న కథ అనే ప్రచారం జరుగుతుంది. క్లైమాక్స్ లో నాని చనిపోతాడని తెలుస్తుంది. నెగిటివ్ క్లైమాక్స్ సినిమాకు సరిగ్గా సూట్ అవుతుందని కూడా భావిస్తున్నాడు న్యాచురల్ స్టార్. వరుసగా రెండు పరాజయాలతో రేసులో వెనకబడిపోయిన నానికి ఈ సినిమా విజయం కీలకంగా మారింది. మరి ఏం జరుగుతుందో.. జెర్సీ ఏం చేస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nani, Telugu Cinema, Tollywood