Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్లో దూసుకుపోతున్నారు. దఢక్ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ఆ మూవీతో మంచి సక్సెస్‌ని ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత కార్గిల్ గర్ల్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో నటించి అందరి చేత ప్రశంసలు కురిపించుకున్నారు. తల్లికి దగ్గ తనయ అంటూ ఇప్పటికే జాన్వీపై అభిప్రాయాలు వినిపిస్తుండగా.. ప్రస్తుతం ఆమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల రాజ్ కుమార్ రావు, వరుణ్ శర్మ, జాన్వీ కపూర్లు రూహీ అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలోనూ వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌తో పాటు పాటలు ఆకట్టుకుంటున్నాయి. కాగా మూవీ ప్రమోషన్లలో భాగంగా బ్రైడ్స్ ఇండియా మ్యాగజైన్‌తో ముచ్చటించిన జాన్వీ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ క్రమంలో తన పెళ్లి గురించి కూడా జాన్వీ మాట్లాడారు. నా పెళ్లికి సంబంధించి నాకు ఒక క్లియర్ పిక్చర్ ఉంది. నాకు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉంది. అందులో సన్నిహితులు మాత్రమే ఉండాలి. నేను కాంచీవరం చీరను ధరించి, బంగారం పెట్టుకొని, నా తలలో పూలను పెట్టుకోవాలి. నా భర్త లుంగీలో ఉండాలి. ఆ తరువాత మేమిద్దరం అరటాకులో భోజనం చేయాలి అని అన్నారు.
ఇక ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్నకు.. తిరుపతిని నేను చాలా సార్లు సందర్శించా. నా జీవితంలో అత్యంత కీలకమైన పెళ్లిని.. నాకు ఇష్టమైన వాడితో అక్కడే చేసుకోవాలనుకున్నా. గతంలో నేను అక్కడ జరిగిన మా బంధువుల పెళ్లికి వెళ్లా. చాలా ఎంజాయ్ చేశా. ఆడంబరంగా జరిగే పెళ్లిళ్లంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి పెళ్లిళ్లకు వెళ్లడం ఫన్ అనిపించినా.. అలాంటి పెద్ద శుభకార్యంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండటం నాకు ఇష్టం అని జాన్వీ చెప్పుకొచ్చారు. కాగా శ్రీదేవి మూలాలు తిరుపతి ప్రాంతంలో ఉన్నాయి. ఆమె బంధువులు ఇప్పుడు తిరుపతి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. తల్లి అభిరుచులను ఎక్కువగా ఇష్టపడే జాన్వీ.. తిరుపతిపై ప్రత్యేక అభిమానాన్ని పెంచుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Janhvi Kapoor