news18-telugu
Updated: December 29, 2019, 7:47 AM IST
నాగబాబు రోజా ఫైల్ ఫోటోస్ (Naga Babu Roja)
ఏపీలో రాజకీయ దుమారం ఎలాగూ చూస్తూనే ఉన్నాం. బుల్లితెరపై కూడా ఒక రకమైన రాజకీయ అలజడి రేగుతోంది. అదే జబర్దస్త్ కామెడీ షో వర్సెస్ అదిరింది కామెడీ షో. జబర్దస్త్ కామెడీ షోలో నాగబాబు జడ్జిగా ఉన్నంతకాలం ఏ సమస్యా రాలేదు. ఆయన బయటకు వెళ్లిపోయి... అదిరింది షోలో జడ్జిగా ప్రత్యక్షమవ్వడంతో... కొత్త రాజకీయం మొదలైంది. ఈ రెండు షోలూ చూసే ప్రేక్షకులు ఇప్పుడు... రెండు వర్గాలుగా విడిపోయారన్న వాదన వినిపిస్తోంది. కారణం... ఎమ్మెల్యే రోజా... వైసీపీ నేత కావడంతో... వైసీపీ అభిమానులంతా జబర్దస్త్ కామెడీ షోని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అటు నాగబాబు... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బ్రదర్ కావడంతో... పవన్ కళ్యాణ్ అభిమానులంతా అదిరింది షో అదిరిపోయిందంటున్నారు. ఇలా రెండు రాజకీయ పార్టీలతో ఈ అంశం ముడిపడుతుండటంతో... ఇది రాజకీయంగా దుమారం రేపుతోంది.
చిత్రమేంటంటే... ఈ రెండు పార్టీల అభిమానులూ... అటు జబర్దస్త్, ఇటు అదిరింది... రెండు ప్రోగ్రామ్సూ చక్కగా చూస్తున్నారు. చక్కగా నవ్వుకుంటున్నారు. అంతా అయిపోయాక... సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ అభిమానులు జబర్దస్త్ షోను మెచ్చుకుంటూ... అదిరింది షోను తిడుతున్నారు. అదే సమయంలో... జనసేన అభిమానులు... జబర్దస్త్ పని అయిపోయిందనీ, అదిరింది నెంబర్ వన్ అవుతుందని చెబుతున్నారు.
ఇలా కామెడీ షోలు కాస్తా సీరియస్ రాజకీయ అంశాలుగా మారుతుండటం ఇబ్బందికర అంశమే. ఐతే... ఇది అభిమానులకే పరిమితం కాలేదు. అటు మల్లెమాల ప్రొడక్షన్స్, ఇటు జీ తెలుగు కూడా తమ తమ షోలపై మీరా, మేమా అన్నట్లు కత్తులు దూస్తున్నాయి. త్వరలోనే గురు, శుక్రవారాల్లో జబర్దస్త్ షోలు వచ్చే సమయంలోనే అదిరింది షో కూడా వేసే ఆలోచన ఉన్నట్లు స్వయంగా నాగబాబే ప్రకటించారు. అంతేనా... అదిరింది కూడా వారానికి రెండు షోలు పెట్టే ఆలోచన కూడా ఉందని స్పష్టం చేశారు. సో... ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చెప్పలేం. ఇప్పటికైతే... రాజకీయ పరంగా అభిమానులు... సోషల్ మీడియాకే పరిమితం అవుతూ... సెటైర్లు వేసుకుంటున్నారు. పోటీ ఉండాల్సిందే... అది ఆహ్లాదకరమైన పోటీలా సాగితే అందరికీ మంచిదే అంటున్నారు విశ్లేషకులు.
Published by:
Krishna Kumar N
First published:
December 29, 2019, 7:47 AM IST