హీరో రాజశేఖర్, జీవిత దంపతులకూ... మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మధ్య ఎప్పటి నుంచో మనస్పర్థలు ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీ సమయంలో రాజశేఖర్ ప్రయాణిస్తున్న వాహనంపై మెగా ఫ్యాన్స్ దాడి చేశారంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ పక్కనబెట్టి ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో జీవిత రాజశేఖర్ సభ్యులుగా ఉన్న నరేశ్ ప్యానెల్‌కు మద్ధతు ప్రకటించారు మెగా బ్రదర్ నాగబాబు. ‘మా’ ఎన్నికల్లో నరేశ్ ప్యానెల్ ఘనవిజయం సాధించింది. అయితే ‘మా’ ఎన్నికలు ముగిసిన వెంటనే రాజశేఖర్, ఆయన భార్య జీవిత ఇద్దరూ వైసీపీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ తరుపున ప్రచారంలో పాల్గొని పవన్ కల్యాణ్‌కూ, జనసేన పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశారు. మెగా బ్రదర్‌ను ఎన్నికల సమయంలో వాడుకుని, గెలిచిన తర్వాత ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నిర్వహించారంటూ జీవిత రాజశేఖర్‌పై వార్తలు వినిపించాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జీవిత, రాజశేఖర్ సభ్యులుగా ఉన్న వైసీపీ ఘన విజయం సాధించగా... జనసేన ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటుకు మాత్రమే పరిమితమై ఘోర ఓటమి మూటగట్టుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం జూబ్లీహిల్స్‌లోని తమ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి... వైసీపీ విజయం గురించి, జనసేన ఓటమి గురించి మాట్లాడారు జీవిత, రాజశేఖర్. నాగబాబును ‘మా’ ఎన్నికల్లో వాడుకున్నామనే వ్యాఖ్యలను జీవిత ఖండించారు. ఆయన చెప్పడం వల్ల మాకు ఎవ్వరూ ఓటేయాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు జీవిత రాజశేఖర్.
వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జీవిత, రాజశేఖర్
‘‘నిజానికి ‘మా’ అనేది ఓ కుటుంబం. అందులో అందరం ఒక్కటే. 500 నుంచి 600 ఓట్లు ఉన్న ‘మా’ అసోసియేషన్‌లో నాగబాబుగారు మాకు మద్ధతు మాత్రమే ప్రకటించారు. ప్రతి ఇంటికీ వెళ్లి మాకు ఓటేయమని చెప్పలేదు. ఆయనే స్వయంగా వేలు పట్టుకుని ఓట్లేయించారా? కాదు... మేం కష్టపడ్డాం. అందరం కలిసి క్యాంపెయిన్ చేసుకున్నాం. నేను, రాజశేఖర్, మా అమ్మాయిలు ప్రతి మెంబర్‌కీ ఫోన్ చేసి, ఏం చేయగలమో వివరించాం. కాబట్టి నమ్మకంతో వాళ్లు ఓటేశారు. అంతేకాని నాగబాబు మద్ధతు చేయడం వల్లే మాకు ఓట్లు పడలేదు. మహా అయితే ఆయన సపోర్ట్ కారణంగా ఒక్క శాతం ఓట్లు వచ్చి ఉండొచ్చు అంతే... నాగబాబు గారి వల్లే గెలిచాం అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదంతా వ్యూస్ కోసం వాళ్లు చేస్తున్న క్రియేషన్. నాగబాబును వాడుకుని, మోసం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు. మేం ఏం చేయాలో చెప్పడానికి మీరెవరు? సోషల్ మీడియాకు మేం ఎందుకు భయపడాలి’ అంటూ ప్రశ్నించింది జీవిత రాజశేఖర్.
‘మా’ అధ్యక్షుడు నరేష్‌తో జీవితా రాజశేఖర్
వైఎస్సార్సీపీ తరపున సినీనటులు జీవిత, రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ నేత పవన్ కల్యాణ్ కంటే జగన్‌కే ప్రజాసమస్యలపై అవగాహన ఉందని..వైసీపీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు జీవిత రాజశేఖర్. ఈ ప్రచారంతో జీవిత, రాజశేఖర్‌లతో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. నాగబాబును వాడుకుని ‘మా’ ఎన్నికల్లో గెలిచి, ఆ తర్వాత ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. నర్సాపురం పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన నాగబాబు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.