సుడిగాలి సుధీర్ పేరు తలుచుకోగానే పెదవిపై చిరునవ్వు వస్తుంది. ఆ పేరుకు ఉన్న ఇమేజ్ అలాంటిది మరి. జబర్దస్త్ కామెడీ షోతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు ఈయన. అలాంటి సుధీర్ ఇప్పుడు హీరో కూడా అయిపోయాడు. ఇప్పటికే ఈయన నటించిన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో మళ్లీ హీరోగా ట్రై చేయడనే అనుకున్నారంతా. కానీ అందరి ఊహలు తలకిందులు చేస్తూ మళ్లీ హీరోగా వస్తున్నాడు ఈయన. ఒకటి కాదు వరస సినిమాలు చేస్తున్నాడు ఈ కమెడియన్ కమ్ హీరో.
తొలి రెండు సినిమాలు పూర్తిగా కామెడీతో నింపేసిన సుధీర్.. మూడో ప్రయత్నం మాత్రం భిన్నంగా చేస్తున్నాడు. ఈయన తన మూడో సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్‌గా చేస్తున్నాడు. ఇందులో కామెడీ హీరోగా కాకుండా సీరియస్ రోల్ చేస్తున్నాడు. దానికోసమే ప్రత్యేకంగా గెటప్ కూడా మార్చేసాడు సుధీర్. ప్రస్తుతం జబర్దస్త్‌లో ఈయన కనిపిస్తున్న లుక్ కూడా ఇదే. లాక్డౌన్లో ఈ సినిమా కోసం కండలు కూడా పెంచేసాడు ఈయన. సిక్స్ ప్యాక్ చేసాడు.. దాంతో పాటు ఫిజిక్‌పై కూడా ఫోకస్ చేసాడు సుధీర్.
ప్రత్యేకంగా ట్రైనర్‌ను పెట్టుకుని మరీ తన మూడో సినిమా కోసం సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు కాలింగ్ సహస్ర అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసారు. ఈ మధ్యే ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇది చూసి ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. కొత్త నిర్మాతలు నిర్మిస్తున్న ఈ సినిమాను అరుణ్ విక్కీరాల తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్ గెటప్ హైలైట్ కానుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు సుధీర్. ట్రైనర్‌ను కూడా పెట్టుకోవడంతో నిర్మాతలు కూడా భారీగానే ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గురించి మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు. రష్మి నటిస్తుందని ఎప్పట్లాగే నెటిజన్స్ న్యూస్ అయితే వైరల్ చేస్తున్నారు. దాంతో పాటు మరో సినిమాను కూడా ఈ మధ్యే మొదలు పెట్టాడు సుధీర్. మొత్తానికి హీరోగా కలిసిరాకపోయినా కూడా మళ్లీ మళ్లీ ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఈయన. మరి అది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sudigali sudheer, Telugu Cinema, Tollywood