బుల్లితెరపై భీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్.. తన పేరుతోనే అందర్నీ మాయ చేస్తున్నాడు. స్క్రీన్ పై కనిపిస్తే చాలు నవ్వులు పూయిస్తూ పిచ్చెక్కిస్తున్నాడు. ఈయన పేరు మీదే చాలా షోలు నడుస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. కేవలం సుధీర్‌ను డీ గ్రేడ్ చేయడంతోనే ఢీ లాంటి షోల్లో అద్భుతమైన కామెడీ పండుతుంది. జబర్దస్త్‌లో కూడా ఈయన్ని బాగా ఆడుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిల పిచ్చోడు అంటూ సెటైర్లు వేస్తుంటారు. అయినా కూడా అన్నింటినీ ఆయన నవ్వుతూ తీసుకుంటాడు. అంతేకాదు తామేం చేసినా కూడా కామెడీ కోసమే అని.. ప్రేక్షకులు నవ్వితే అదే చాలు అంటాడు సుధీర్.
తనపై ఎన్ని పంచులు వేసినా కూడా తను కూడా ఎంజాయ్ చేస్తానని చెప్తున్నాడు సుధీర్. అయితే కొన్నిసార్లు ఈయనపై చేసిన కామెడీని ఆయన భరించినా కూడా అతడి అభిమానులు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. వాటిని కామెంట్స్ రూపంలో బయట పెడుతుంటారు. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఢీ ఛాంపియన్స్ ప్రోమోలో బాబా భాస్కర్ చేసిన కామెడీ సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. ఆ షోలో సుధీర్‌ను బాబా భాస్కర్ అనుకరించాడు.
అందులో భాగంగానే సుడిగాలి సుధీర్ కూర్చునే విధానం.. అతడు డాన్సులు చేసే విధానం అన్నింటినీ చేసి చూపించాడు బాబా. అయితే నెక్ట్స్ కంటెస్టెంట్ ఎవరని చెప్పేటప్పుడు సుధీర్ ఎలా ఉంటాడు అనేది కూడా బాబా భాస్కర్ చేసి చూపించాడు. ఇది చూసిన తర్వాత ఆడియన్స్ కడుపులు పట్టుకుని నవ్వుకుంటున్నారు. అయితే కొందరు సుధీర్ ఫ్యాన్స్ మాత్రం మరీ ఇంత స్థాయిలో డీ గ్రేడ్ చేయాలా అంటూ ఫైర్ అవుతున్నారు. కామెడీ కోసం సుధీర్‌ను టార్గెట్ చేయొచ్చు కానీ మరీ అంతగా విమర్శించాల్సిన అవసరం లేదు.. సెటైర్లు వేయాల్సిన పని లేదంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ అంతగా బాబా ఏమన్నాడు అనుకుంటున్నారా..? సుధీర్‌ను అనుకరిస్తూ చివరికి బాంబ్ పేల్చాడు బాబా.
ఛీఛీ నీది ఒక డ్యూటీనారా.. ఇది చేయడానికా వీడికి డబ్బులు ఇస్తున్నారు.. ఛీ అంటూ సెటైర్ వేసాడు బాబా భాస్కర్. అది విన్న వెంటనే అక్కడున్న వాళ్లంతా ఘొల్లుమని నవ్వేసారు. సుధీర్ కూడా దీన్ని లైట్ తీసుకున్నాడు. అయితే సెటైర్లు వేస్తే పేలుతాయని తెలిసినపుడు మరీ ఆయన చేసే పనిపై కూడా సెటైర్లు వేయడం మంచిది కాదంటున్నారు నెటిజన్లు. ఓ వ్యక్తిని మరీ ఈ స్థాయిలో టార్గెట్ చేసి కామెడీ పుట్టించడం అవసరమా అంటున్నారు. పక్కనే హైపర్ ఆది కూడా ఉన్నాడు కదా.. ఆయనపై కూడా ఇలాంటి వెకిలి కామెడీ చేసుకోండి అంటున్నారు నెటిజన్లు. ఏదేమైనా కూడా అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగినా కూడా బాబా భాస్కర్‌ను మాత్రం సుధీర్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Baba Bhaskar, Jabardasth comedy show, Sudigali sudheer, Telugu Cinema, Tollywood